ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష ‘తెలుగు’. మన దేశంలో హిందీతర్వాత ఎక్కువగా మాట్లాడే రెండవ భాష కూడా మన తెలుగే. ఈ మధ్య బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ లిపి సదస్సులో కొరియా భాష తర్వాత రెండవ అంతర్జాతీయ లిపిగా తెలుగునే సమర్థించారు. అంత చక్కని అజంత భాష మనది. అమర భావాల అమృత భాష మన తెలుగు నుడి.
ఇక తెలుగు నుడి చరిత్ర గురించి చెప్పుకొంటే.. ఇది క్రీస్తుకు ముందు దాదాపు 3000 ఏండ్ల కిందటనే తొలి అడుగులు వేసిన ద్రవిడ భాష అని చెప్పవచ్చు. అంటే, ఆదిమ ద్రవిడ భాషల చరిత్ర క్రీస్తుపూర్వమే కొన్ని శతాబ్దాల ముందున్నది.
ప్రపంచంలో అన్ని భాషల కన్నా పాత భాషగా పాత సుమేర్ భాషను ఎక్కువమంది అంగీకరించారు. తర్వాత పాత ఈజిప్ట్, హిబ్రూ, గ్రీకు, పాత చైనా, కొరియా భాషలు పాతవిగా గుర్తించారు. మన తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది. సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలు ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవి. అంటే, ఇండో యూరప్ కుటుంబానికి చెందినవి. మరి మన ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తులు, కొడగు, కుడుక్, గోండి, గదబ మొదలైనవి ద్రవిడ భాష కుటుంబానికి చెందినవి. ఇక కొందరున్నట్టుగా జనని సంస్కృతంబు సకల భాషలకు అన్న మాట తప్పని ఎందరో సాహితీవేత్తల వాదన. నిజమే. తెలుగు, తదితర ద్రవిడ భాషలకు, సంస్కృతానికి సంబంధమే లేదంటారు. ఇక ఇతర భాషలు చూస్తే హిందీ సంస్కృతం, ప్రాకృతం, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, అస్సామీ, గుజరాతీ, ఒరియా, మరాఠీ, కశ్మీరీ, కొంకణి, నేపాలీ, ఈ భాషలన్నీ ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినవి.
ద్రవిడ భాషల్లో మొదటగా విడివడిన భాష తెలుగు. ఆ తర్వాత తమిళం, కన్నడం, మలయాళం విడిపోయాయి. ప్రపంచంలో దాదాపు 6000 భాషలున్నాయి. వాటిలో సొంత లిపి కలిగి ఉన్న భాషలు దాదాపు 400 లోపు. భారతీయ భాషా కుటుంబాల్లో ముఖ్యమైనవి రెండు భాషా కుటుంబాలు. ఒకటి, ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. రెండవది, ద్రవిడ భాషా కుటుంబం. ఇండో ఆర్యన్ భాషలకు చెందినవి ఉత్తర భారతీయ భాషలు. వాటిని ఉత్తర భారతీయ ఆర్య భాషలని కూడా అంటారు. ద్రవిడ కుటుంబానికి చెందిన భాషలు దక్షిణ భారతీయ భాషలు… వీటిని ద్రవిడ భాషలంటారు.
ప్రపంచంలో ఉన్న భాషల్లో ఎక్కువ ధాతువులు (roots of verbs) ఉన్న భాష మన తెలుగే. క్రియా ధాతువులు తమిళంలో 450, హిందీలో 350, సంస్కృతంలో 1400 ఉంటాయి. మరి, మన భాషలో ఎన్నో తెలుసా? తెలుగు భాషలో 1800 ధాతువులున్నాయి. అంత గొప్ప భాష మనది. ధాతుక్రియలు అంటే.. ‘కోయు, మూయు, వ్రాయు, వచ్చు, పోవు, కూరు, వండు, నేయు, తెచ్చు, ఇచ్చు’.. ఇలా.. ఉదాహరణకు ‘చేయు’ అనే మూల క్రియనే తీసుకుంటే ఆ మూల ధాతువు నుంచి ఎన్నో పదాలను పుట్టించవచ్చు. అవి.. ‘చేత, చేనేత, చేయగల, చేసి, చేసిన, చేయుచున్న, … ఇలా వేల పదాలు పుట్టించుకోవచ్చు. ఈ సౌలభ్యం ఇతర భాషా నుడులలో ఇంతగా లేదు. మన తెలుగు అజంత భాష కాబట్టి, ప్రతి పదం చివర అచ్చు ఉచ్చారణతో మాట అంతమవుతుంది.
ఉదాహరణకు… ‘అందరూ..’ దీనిలో చివరి అక్షరం ‘ర్+ ఊ….’. ఇలాగే అన్ని మాటల చివర అచ్చు ఉచ్చారణతో ఉంటుంది. ఇలాంటి ఉచ్చారణ లాటిన్ ఇటాలియన్ భాషకు కూడా ఉన్నది. అందుకే, ఈ భాష కూడా అజంత భాష కాబట్టి తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నారు.
తెలుగు వినడానికి, అనడానికి అందమైన ఒంపు సొంపుల భాష . తేట తేనెల భాష. సంగీతానికి అనువైన భాష. అమృత నుడుల పాలధారలో పంచదార కలిసిన భాష. మన అమ్మ నుడి తెలుగు నుడి. మన భాషలో ఏది పలుకుతామో అదే రాస్తాం. కానీ, కొన్ని భాషల్లో అలా ఉండదు. మచ్చుకు ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ‘కామ్ (calm)’ ఇక్కడ Lను పలకం, అలాగే put పుట్ అయితే but , బుట్ కావాలి, కానీ బట్ అని పలుకుతారు. తెలుగులో అలా కాదు. ఎన్ని వ్రాలు పలుకుతామో, అన్ని అక్షరాలే చాలు. మచ్చుకు అమ్మ అనే మాట ఉంటే.. అ+మ్మ… రెండు అక్షరాలు. అదే ఇంగ్లీషులో మదర్ అంటే మ+ద+ర్=3 వ్రాలు. కానీ ఇంగ్లీష్‌లో mo,the,r ఆరు అక్షరాలు కావాలి. చూశారా మన తెలుగు గొప్పదనం. అందులో ఉన్న సౌందర్యం, సౌలభ్యం. కనుక భాషాపరంగా భారతదేశంలో అన్ని భాషల కన్నా మన తెలుగే గొప్ప. కాబట్టే, కన్నడ ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల వారు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఇతర భాషల వారు మన భాషను గొప్పగా కీర్తిస్తుంటే, మనం మాత్రం తెలుగు వారమై ఉండి, డాలర్ల వ్యామోహంలో పడి పరభాష, పరుల సంస్కృతిలో కూరుకుపోతున్నాం. కన్న తల్లిని ‘అమ్మా’ అని పిలవడానికి సిగ్గుపడుతున్నాం. అమ్మను ‘మమ్మీ’ చేసి ఆనందిస్తున్నాం. ఇందుకు నవ్వుకోవాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి.
మన ప్రజల కట్టూ బొట్టు ఎలా ఉండేది? ఆంగ్లేయులు ప్రవేశించి వారి భాషను, వారి సంస్కృతిని మనపై రుద్దారు. దీంతో మనకు తెలియకుండానే వాళ్ల సంస్కృతీ సంప్రదాయాలు మన జీవితంలోకి వచ్చి చేరాయి. అంటే ఒక భాష నశిస్తే, ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి కూడా నాశనమవుతుంది. అందుకే.. ‘ఒక జాతి సంస్కృతిని నాశనం చేయాలంటే, మొదటగా వారి మాతృభాషను నాశనం చేస్తే చాలు’ అని ‘మెకాలే’ అన్నారు.
ఇకనైనా మనం ఇతర భాషల్లోని మాటలకు తెలుగులో అందరికీ అర్థమయ్యే మన జనవాడుక అచ్చ తెలుగు మాటలను పొం దిక చేసుకుందాం. అలా చే యరు, ఎందుకంటే వాళ్లకు తెలుగంటే దేశ్యమని, గ్రామ్యమని, హీన భాషని, లేకి భాషగా భావిస్తారు. అందుకే, అనువాదాలన్నీ సంస్కృత మిళితాంధ్ర భాషనే వాడారు. అందుకే, మేధావులంతా, గత మహానుభావులంతా తెలుగును చిన్నచూపు చూసి, వేల్పునుడికి పెద్దపీట వేశారు. ఇలా నేననడం చాలామంది సం స్కృతవాదులకు నాపై చాలా కోపం వస్తుందేమో.. అయినా, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పుకోక తప్పదు.
సంస్కృతం మనపై రుద్దడం వల్ల మన తెలుగుకు ఈ సంకర గతి పట్టింది. ఇది అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన నగ్న సత్యం. ఇది మన తెలుగుకున్న పెద్ద ఇబ్బంది. ఇది మనం గ్రహించకపోవడమే మనం చేసే పెద్ద తప్పు.
దేవుని గుడిలో ప్రార్థనలు తమిళంలో, సంస్కృతంలోనూ ఉంటాయి. కానీ తెలుగులో ఉండవు. దేవుళ్లకు తమిళం, సంస్కృతం భాషలు అర్థమైనప్పుడు తెలుగు ఎందుకు అర్థం కాదు? మనం తెలుగులో ప్రార్థనలు ఎందుకు చేయకూడదు? ఇలా చెప్పుకొంటూ పోతే అనేక శ్లోకాలు, ప్రార్థన గీతాలు, మేలుకొలుపులు, సుప్రభాతాలు అన్ని అర్థం కాని సంస్కృతంలోనే ఉంటాయి. వాటిని ఎందుకు అచ్చ తెలుగులోకి అనువదించకూడదు? అందరికీ అర్థమయ్యే రీతిలో చేయవచ్చు కదా? ఒకసారి ఈ దిశగా ఎందుకు ఆలోచించకూడదు?
అచ్చమైన తెలుగు కోసం ఎందరో మహానుభావులు కృషిచేశారు, వారిలో ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి, గురజాడ, వీరేశలింగం పంతులు, ఆదిభట్ల నారాయణదాసు, చిలుకూరి నారాయణరావు, నారు నాగనార్యులు, శ్రీపాద కృష్ణమూర్తి, మారేపల్లి రామచంద్ర కవి, కాళోజీ.. ఇలా ఎందరో మహానుభావుల గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇకపై తెలుగు అభిమానులందరూ తెలుగులోనే మాట్లాడుదాం, తెలుగులోనే ఆలోచించుదాం. తెలుగు నుడికై పోరాడుదాం. తెలుగు వాడుక భాషను కాపాడుకుందాం.
-రాఘవ మాస్టారు కేదారి
63629 73252