నీరు పల్లమెరుగు
నిజమని నమ్మించిన ఓ అబద్ధం
నీళ్ల నిలువుదోపిడీకి
నొక్కి వక్కాణించిన బూటకం
నీటికి పల్లమే కాదు ఎత్తులు తెలుసు
భగీరథుడికి నీటిని పల్లంలోకి
తీసుకెళ్లడమే తెలుసు
చంద్రశేఖరుడు నీటిని ఎత్తుకు
తీసుకెళ్లి సిగలో బంధించాడు
ఆకాశంతో దోస్తీ అవనిపై వ్యాప్తి
పంట పొలాల కండ్లల్లో దీప్తి
నెర్రలు వారిన భూములు
ఎద విప్పారి దున్నమంటున్నయి
బిరుసుకు పోయిన ఒడ్లు
బంతి చేమంతితో జత కడ్తమంటున్నయి
దున్నిన దుక్కి గంధమై
పరిమళ భరిత సుగంధమై
పెద్ద గడప కుంకుమై
పెద్ద ముత్తయిదువ కాలి పసుపై
బొడ్రాయి అమ్మవారి జాతరై
ఎనకటి రోజుల ఊరైంది
నాస్టాలజిక్ ప్రపంచంలోకి వెళ్ళామా?
మళ్ళీ పునర్జన్మ ఎత్తామా ?
అవును నా ఊరు తిరిగొచ్చింది
తలపై గంగమ్మతో
చంద్రశేఖరుడే దిగివచ్చిండు
పాలమూరు రంగారెడ్డి నల్లగొండ
నిండుగా కృష్ణమ్మ జలధారలు
సిరులు సిరులుగా
పచ్చబడింది నా పాలమూరు
ఏ.జయంతి
98663 71918