స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత పల్లెల అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ పల్లెల రూపురేఖలను మార్చిన రూపశిల్పి కేసీఆరే. ఈ విషయంలో సంశయాలకు, శషబిషలకు తావులేదు.
వలస పాలకులు గ్రామీణాభివృద్ధికి కడగొట్టు ప్రాధాన్యమిచ్చారు. తెలంగాణ పల్లెలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దక్కన్ పీఠభూమిలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా తెలంగాణ అభివృద్ధి జరగదు. ఈ ఆలోచనతోనే కేసీఆర్ తన పాలనలో గ్రామీణాభివృద్ధికి కృషిచేశారు. పూడికతో నిండిన చెరువులను తొలుత మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచారు. తద్వారా వేసవిలో నీటిఎద్దడి రాకుండా అడ్డుకట్ట వేశారు. అంతేకాదు, శతాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని కాకతీయ గొలుసుకట్టు చెరువులకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు.
2018లో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం గ్రామీణాభివృద్ధికి దిక్సూచి అని చెప్పవచ్చు. ఈ చట్టం ద్వారా తండాలు, గిరిజన గూడెలను గ్రామపంచాయతీలుగా గుర్తించి రాష్ట్రంలో పంచాయతీల సంఖ్యను 12,791కి పెంచారు.
ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీం (ఈజీఎస్), ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐఆర్డీపీ) పథకాలను కేసీఆర్ సర్కార్ సమర్థంగా వినియోగించుకొని పెద్దమొత్తంలో నిధులను రాబట్టుకోగలిగింది. గ్రామీణాభివృద్ధిలో రైతుల శ్రేయస్సు దృష్ట్యా కేసీఆర్ సర్కార్ చేసిన మరో అద్భుతమైన కార్యక్రమం రైతువేదికల నిర్మాణం. ఈ రైతువేదికలలో సహాయ అగ్రికల్చర్ అధికారులను నియమించి అన్నదాతలకు అండగా నిలిచారు.
గతంలో గ్రామాల్లో ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే వారి దహన సంస్కారాలకు అష్టకష్టాలు పడాల్సివచ్చేది. సొంత భూములు లేనివారు చెరువులు, వాగుల పక్కన దహన సంస్కారాలు చేసేవారు. తెలంగాణలోని అనేక గ్రామాల్లో శ్మశానవాటికలు లేకపోవడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో అంతిమ సంస్కారాల కష్టాలను రూపుమాపేందుకు ఊరూరా వైకుంఠధామాలను నిర్మించారు. ఇక గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలన్న తలంపుతో ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయించారు. అంతేకాదు, పల్లెల్లో పచ్చదనం పెంపు కో సం పల్లె ప్రకృతి వనాలు, పార్కులను ఏర్పాటు చేశారు. గల్లీగల్లీకి సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఊరూరా మంచినీటి ట్యాంకులను నిర్మించి, ఇంటింటికి రక్షిత నీరు సరఫరా చేశారు.
ఇక ప్రతీ గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, నీటి ట్యాంకర్లను అందించారు. కొత్త గ్రామపంచాయతీ భవనాలను నిర్మించడమే కాకుండా కార్యదర్శి సహా సిబ్బందిని నియమించి గ్రామాల స్వయంపాలనకు బాటలు వేశారు. పలు గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం గోదాములను నిర్మించారు. గ్రామగ్రామాన పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేయడంతో ఎవుసం బాగుపడి పల్లెసీమలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. ఇప్పుడు తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా మనకు కనిపించే పల్లె ప్రగతి జాడలు రైతువేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, వైకుంఠధామం, క్రీడా మైదానాలు, పల్లె ప్రకృతివనాలు, పార్కులు, నిండుకుండలా కనిపించే చెరువులు, చెరువులోని చేపపిల్లలు, ఇంటి ముంగిట రక్షిత తాగునీరు, హరితహారం చెట్లు, పాడిపంటలు, పారిశుద్ధ్యం.. ఇవన్నీ కేసీఆర్ సుదీర్ఘ ప్రణాళికబద్ధమైన పాలనా కృషికి నిదర్శనాలు తప్ప, మరొకటి కాదు.
కాంగ్రెస్ సర్కార్ కొలువయ్యాక కేసీఆర్ కృషిని కొనసాగిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది. సుమారు రెండేండ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపకపోవడంతో పల్లెలు కునారిల్లుతున్నాయి. మొన్నటివరకు సర్పంచ్లు లేకపోవడంతో పల్లెలను పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయడంతో కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. దాంతో ఊర్లల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయలేని, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. తాజాగా పల్లెల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇకనైనా పరిస్థితిలో మార్పు రావాలి.
గాంధీజీ చెప్పినట్టుగా పల్లెలే
దేశాభివృద్ధికి పట్టుగొమ్మలనే విషయాన్ని పాలకులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ కృషిని కొనియాడుతూనే, భేషజాలకు పోకుండా ప్రస్తుత రేవంత్రెడ్డి సర్కార్ కూడా పల్లె ప్రగతిని కొనసాగించాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఎన్.తిర్మల్
94418 64514