తెలంగాణ విముక్తి ఫలాలు బుక్కుతూ
తెలంగాణ తెచ్చినోళ్ళని , జనాన్ని
ఈసడించుకుంటూ, బట్టగాల్చి మీదేసి
బద్నాంజేస్తూ, ఆనందించే శాడిస్టులను
ఏందిదని నిలదీసి, బరాబర్ అడ్గుతం
పరాన్నబుక్కులు, మన నీళ్ళను తాగ్తుంటె,
కళ్ళుండీ చూడని, కబోదులమని కూకుని
అధికారపు మత్తుల జోగుతూ, ఊకున్నోళ్ళని
రేపు తెలంగాణ మాగాణమెట్ల పండుద్దని
మీడియా ముందర నిలబెట్టి, బరాబర్ అడ్గుతం
బుర్దల బొర్లె మట్టి మనుషుల దిక్కే చూడక
నీళ్ళియ్యక, గింజలియ్యక, ఎర్వులియ్యక
రైతు సహాయ మందక, అప్పులు దొరక్క
ముప్పు తిప్పల బడ్తున్న కాడి బతుకుల
వెతల కతలు బయటెట్టి, బరాబర్ అడ్గుతం
బీదా బిక్కి, ముక్కీ కక్కి, చెమట్ల గార్చి నీడేస్కుంటె
వంకర నిర్మాణాలను కూల్చి, ఏం సాధించిన్రు?
గోసిపాతంత, మూసీ బాగుపడి బట్ట గట్టలె,
వాళ్ళ ఉసురు, ఓట్ల ముసురై ముంచెస్తే,
మీరే గుడిశల దాక్కుంటరని, బరాబర్ అడ్గుతం
గురుకులాల, పేదల పిల్లోళ్ళు, కుళ్ళిన బువ్వ
గత్త పారుడ్లాంటి, పుల్సు మింగలేక మింగి,
దవాఖాన్ల షరీకై సత్తుంటె, తూతూ మంత్రంగా,
పల్కరించి పోతె, వాళ్ళకి ముందుకాలం ఏది?
కడ్పుల బాధొచ్చి, ఇదేంటని బరాబర్ అడ్గుతం
కులవృత్తులోళ్ళ సత్తువ సన్నగిల్లి సచ్చుబడ్తె
ఆకలి కత్తుల వంతెన మీన గతిలేక పండబట్టె.
వాళ్ళకాయాలు, వల్ల కాట్లో కాలక మురిగ పోతుంటె
ఎవర్నడగాలో, ఏం చెయ్యాలో, ఎట్ల బత్కాల్నోనని
కుముల్తున్న జనం కష్టాన్ని, బరాబర్ అడ్గుతం
మందింతగా, ఎన్నో గోసలు పడ్తున్నా, గుడ్లప్పగించి
చచ్చిన గొడ్డు కాడ కూకున్న రాబందుల్లాంటి వాళ్ళు
వచ్చిపోయే చుట్టాల మాటేగాని మంచీ చెడూ లేదు
ఆపదల్లో ఇరుక్కున్న ఆపన్నుల కంటి నీరు చూడలేక
ముందుకొచ్చి, జనంతో కల్సి, బరాబర్ అడ్గుతం
– కమ్మ రంగారావు 94401 79410