తెలంగాణ భాష, యాస, అందులోని పలుకుబడులు మన ప్రాంత సంస్కృతికి, చారిత్రక వైభవానికి, ప్రజల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాల కాలంగా వివిధ రాచరికాల పాలన, ముఖ్యంగా నిజాం నవాబుల పాలన ప్రభావం వల్ల తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ, పర్షియన్, మరాఠీ, కన్నడ పదాలు సహజంగా కలిసిపోయి, ఒక విలక్షణమైన రూపాన్ని సంతరించుకున్నాయి. మన తెలంగాణ భాష కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు; అది శ్రమజీవుల స్వేదం, ఉనికి, మట్టి వాసన, ఆత్మీయతల కలయిక. తెలంగాణ పలుకుబడుల్లో నిష్కల్మషత్వం తొణికిసలాడుతుంది. ఇక్కడి సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు నిత్య జీవితంలోని కష్టసుఖాలను హాస్యాన్ని, వ్యంగాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తర్వాత నుంచి కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్ 9న యేటా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాష ఒక కీలక పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భంగా అచ్చమైన తెలంగాణ పలుకుబడిలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచాయి. సీమాంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ పలుకుబడిలో ఎవరైనా మాట్లాడడానికి వెనుకా ముందు ఆడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ భాషను ఆయుధంగా చేసుకుని కేసీఆర్ ఉద్యమాన్ని నడిపారు. అచ్చమైన తెలంగాణ భాషలో సాగే కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలను కట్టిపడేశాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానంగా ఈ మూడు అంశాలపై ఇక్కడి ప్రజలు ఉద్యమించారు. ఈ మూడే కాదు, తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతిక కోణం కూడా ఉన్నది. అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్న తెలంగాణ భాషకు, సాంప్రదాయాలకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన దానిలో కలగలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో తెలంగాణ భాష నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైంది.
తెలంగాణ భాషలో ఎంతో అర్థవంతమైన పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మేర అనే పదం. ఇతర ప్రాంతాల వారు దర్జీ అంటారు. ఇది ఉర్దూ నుంచి వచ్చింది. వాస్తవానికి తెలంగాణలో వాడే మేర పదాన్ని పరిశీలిస్తే పొలిమేర, ఆ మేరకు, ఈ మేరకు అనే మౌఖిక ప్రయోగాలు ఉన్నాయి.
మేర అంటే హద్దులని అర్థం. మేరవారు గుడ్డల్ని కత్తిరించి కుట్టేది వ్యక్తి మేరను బట్టే కదా. ఇది అసలు సిసలు తెలుగు పదం. సోయి, సోయిలేదు, సోయిసుద్ది, సోయిసెప్పటం లాంటివన్నీ తెలుగు పదాలు. తెలంగాణ భాషలో అచ్చమైన తెలుగు పోకడలు చాలా ఉన్నాయి. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు అలయ్ బలయ్ కలగలిసిపోవటం కూడా గొప్ప విశేషం. తెలంగాణ తెలుగులో పెద్దపెద్ద సమాసాలు, సంస్కృత పదభూయిష్టమైన తీరుతెన్నులు బహుతక్కువ. నలిమెల భాస్కర్ ‘తెలంగాణ పదకోశం’లో అనేక పదాల కూర్పు జరిగింది. తెలంగాణ పద సౌందర్యాన్ని ఆయన పట్టివ్వగలిగారు. ‘ఏ భాషకైనా జవజీవాలు జాతీయాలు, సామెతలే.
తెలంగాణ వాసుల పలుకు పలుకులో నుడికారం ఉంటుంది. చల్లగా ఉండేది చల్ల (మజ్జిగ), ఎర్రగా ఉండేది ఎర్ర (వానపాము), లాగుతూనే వేసుకునేది లాగు, అంగాన్ని కప్పి ఉంచేది అంగి, కంకుతూ తింటం గనుక కంకి’. ఇలాంటి మాటలెన్నో నలిమెల భాస్కర్ మనమందు ఉంచారు. అదేవిధంగా ‘గుమ్మి’ అనేది ప్రముఖ తెలంగాణ కథా రచయిత, నవలాకారుడైన డా.కాలువ మల్లయ్య రచించిన ఒక విశిష్టమైన పుస్తకం. ఈ పుస్తకం ‘తెలంగాణ వాడుక భాష పలుకుబడులు‘ అనే అంశంపై రాసినది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిత్యం మాట్లాడే విలక్షణమైన పదాలు, సామెతలు, జాతీయాలు, మరుగున పడిపోతున్న పలుకుబడులను ఇందులో పొందుపరిచారు. ‘గుమ్మి’ అంటే తెలంగాణ పల్లెల్లో ధాన్యాన్ని దాచుకునే పెద్ద బుట్ట లేదా నిల్వ పాత్ర. పల్లె ప్రజల నోట పలికే అమూల్యమైన భాషా పదాలను భద్రపరిచే ఒక నిల్వ పాత్ర లాంటిది కాబట్టే ఈ పుస్తకానికి ఆయన ‘గుమ్మి’ అని పేరు పెట్టారు.
తెలంగాణ ప్రజల భాషలో ఎన్నో పలుకుబడులు నిత్యం తానం ఆడుతాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.. ఆన గొట్టి ఎల్సినట్టు (లొల్లి లొల్లి గా ఉండి ఒక్కసారి నిశ్శబ్దం ఆవరిస్తే), సెర్లనీల్లు సెరెనుక వడ్డాయి (అంతా అయిపోయిందని తెలుపటానికి), ఎరుకైందా (నిజాన్ని తెలుపటానికి), ఎప్పటి సిప్ప ఎన్గుల్లే (ఫలితం శూన్యం అయినందుకు), ఏం దెల్వని ఎల్లిపాయె గుర్గలేత్తె కరిగిపాయే (తెలిసే కూడా తెలియనట్లు నటిస్తే), కడ్డుగాడు (కఠినత్వాన్ని తెలుపడానికి), కనికట్టు (ఇంద్రజాలం), కట్రౌతు (కట్టటానికి ఉపయోగించే రాయి), గత్కుడు (తాగటానికి ఉబలాట పడితే), గల్మ (కడప), జప్పున, మెత్త, తంతె.. ఇలాంటివి అనేకం నిత్యజీవితంలో మనం వాడే పదజాలం.
తెలంగాణ పలుకుబడుల్లో తెలుగు భాష ప్రాచీన రూపాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఉదా: తర్వాత అనే పదానికి అటెనక అని, స్పృహ అనే పదానికి సోయి అని వ్యవహరిస్తారు. ఇలాంటి మాటలు శబ్ద సౌందర్యాన్ని, భావ తీవ్రతను అద్భుతంగా వ్యక్తపరుస్తాయి.
తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాం పాలన, దక్కని సంస్కృతి కారణంగా మన తెలంగాణ భాషలో చాలా ఉర్దూ, హిందీ పదాలు కలగలిసిపోయాయి. ఉదా: ఆసుపత్రిని – దవాఖాన, అద్దెను – కిరాయి, ఇంటి స్థలం – జాగా వంటివి. ఇంకా అంగడి – సంత. యాది – జ్ఞాపకం, పెయ్యి – శరీరం, పత్తా – చిరునామా, సాలు – సరిపోవడం, ఎతలు – కష్టాలు, బువ్వ – అన్నం, పోరి – చిన్నపిల్ల, పోరగాడు – చిన్నపిల్లోడు, తిర్రి – పిచ్చి, పయిలం – జాగ్రత్త వంటి పదాలు ఇక్కడి ప్రత్యేకతను తెలియజేస్తాయి.
జాటావత్ రాజు
9347196264