కాళేశ్వరమంటే తెలంగాణ
గుండెచప్పుడు
కాళేశ్వరమంటే ఇక్కడి
జనులకు కన్నుల పండువ
ఆశే శ్వాసగా రైతన్న ఆకాంక్షలు
నెరవేర్చిన
ఆకుపచ్చని కల కాళేశ్వరం
బహుళ ప్రయోజనాలతో
బహుళార్థ సాధక ప్రాజెక్టుగా
ఎత్తిపోతలతో
ఎత్తైన పీఠభూమి నుంచి
ఎనక్కి మరలి ఎగిసెగిసి
ఉప్పొంగిన శివ గంగ
ఈ కాళేశ్వరం
ప్రజా ప్రయోజన పరిపాలనను,
ఆవిష్కరింపబడ్డ అద్భుత ఆలోచనలను
అభినందించి కొనసాగిస్తేనే
అది ప్రజాకీయం
అప్పుడే
ప్రజల పక్షాన నిలవడం
రాజకీయాలకతీతంగా ప్రజా
సంక్షేమమే పరమావధిగా
రాజ్యం నడిపే పాలకుడెప్పుడూ
ప్రజల గుండెల్లో కొలువై ఉంటాడు
లోపాల్లేని, మరమ్మతులు రాని
ప్రాజెక్టులుంటాయా ?
ప్రతి సమస్యకూ పరిష్కారమున్నట్టే
ప్రత్యామ్నాయమూ ఉంటుంది కదా?
ప్రజల ఘోష పట్టని
పాలకులున్నంత వరకు
ఏ ఘోష్ ప్రతిపాదననైనా
కోర్టులూ తిరస్కరిస్తాయి
నిరసనలూ మిన్నంటుతాయి
ప్రజాహిత పాలకుడెవరో
తెలుసుకుంటారు ప్రజలు
పట్టం కట్టడానికి
సమాయత్తమవుతుంటారు
ఎందుకంటే
కాళేశ్వరమంటే తెలంగాణ గుండెచప్పుడు
కాళేశ్వరమంటే ఎనక్కి మరలి
ఎగిసెగిసి ఉప్పొంగిన గంగ
గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల కొద్దీ
నడిచిన ఊళ్లు, తండాలు-
బొక్కెనేస్తే చుక్క నీళ్లు
అందని అడుగంటిన బావులు
నీళ్ల కరువుతో తండ్లాడిన తెలంగాణ
దూప తీర్చిన పెనుగంగ ఈ కాళేశ్వరం
లక్ష ఎకరాల సేద్యాన్ని
సుసాధ్యం చేసిన ప్రాణహిత
నెర్రెలు వారిన నేలను పచ్చని పంట
చేలుగా మార్చిన పాతాళగంగ
ఎండిపోయి శిఖం దేలిన చెరువులను
నిండు గంగాళాలుగా మార్చిన స్వర్గంగా
అందుకే కాళేశ్వరమంటే
తెలంగాణ గుండెచప్పుడు
కాళేశ్వరమంటే ఇక్కడి
జనులకు కన్నులపండువ
– డా. వాణీదేవి దేవులపల్లి