‘ప్రత్యేక తెలంగాణ’ కల నెరవేరి అప్పుడే దశాబ్దం గడిచిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని పరాయి పాలకులు చేసిన అబద్ధపు ప్రచారాలను పదేండ్ల స్వపరిపాలన పటాపంచలు చేసింది. అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి అయ్యింది. 2024 జూన్ 2 నాటికి తెలంగాణ అవతరించి పదేండ్లు గడుస్తున్న శుభ సందర్భంగా ‘చెలిమె’ ప్రత్యేక పేజీగా ప్రచురిస్తున్నాం. ప్రముఖ కవులు తమ తమ కవితల్లో తెలంగాణ రాష్ట్ర పదేండ్ల ప్రగతిని, తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానాన్ని అక్షరీకరించారు.
నమస్తే తెలంగాణ
జై జై జై తెలంగాణ తల్లి నీకు నమస్తే
తెలంగాణ రాష్ట్రమొచ్చె ప్రజల కలలు ఫలిస్తే
ప్రజలు, ప్రభుత్వాలు కలిసి ప్రగతి దారి నడిస్తే…
అనునిత్యం తలుస్తాము అమ్మ నీ చరిత్రే
జై జై జై తెలంగాణ తల్లి నీకు నమస్తే
అనునిత్యం తలుస్తాము అమ్మ నీ చరిత్రే
పొలం లేని రైతుండని కాలమొకటి గెలిస్తే
రైతే రాజని ఈ రాజ్యమెపుడు తలపోస్తే
అవినీతికి తావుండని, అక్రమాల నెలవుండని
అధికారులె ప్రజల పక్షాన.. నిలువాలని తలిస్తే
జై జై జై తెలంగాణ తల్లి నీకు నమస్తే
అనునిత్యం తలుస్తాము అమ్మ నీ చరిత్రే
అందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తే
కొందరికే చెందే ధనమందరికీ అందితే
మంచినీళ్లు కొనని ఒక మంచికాలమే వొస్తే
వంచనలెరుగని ఏలికలే.. ప్రజల బంతిలోన నిలిస్తే
జై జై జై తెలంగాణ తల్లి నీకు నమస్తే
అనునిత్యం తలుస్తాము అమ్మ నీ చరిత్రే
ప్రజలకిచ్చిన మాటే తన గెలుపని స్మరిస్తే
మాటలు నాటిన కోటలు నిజంగా ఫలిస్తే
గతకాలపు వెతలు పోయి కొత్తగ కలిగేను సోయి
శతశతాల పోరినట్టి అమరుల కల నిజమైతే
జై జై జై తెలంగాణ తల్లి నీకు నమస్తే
అనునిత్యం తలుస్తాము అమ్మ నీ చరిత్రే
జై జై జై తెలంగాణ తల్లి నీకు నమస్తే
తెలంగాణ రాష్ట్రమొచ్చె ప్రజల కలలు ఫలిస్తే
ప్రజలు, ప్రభుత్వాలు కలిసి ప్రగతిదారి నడిస్తే…
అనునిత్యం రాస్తాము అమ్మ నీ చరిత్రే
శ్రీరామోజు హరగోపాల్
మట్టి పరిమళాలు
ఎర్ర దుమ్ము సెలకలల్ల
ఏపుగ పెరిగిన పైరు
నెర్రలిడిసిన నేలన
నెమరేసిన పంటలు
నీళ్లు లేక తంటాలు
పడ్డ తెలంగాణ
నీళ్లు, నిధులతో
నిండు కుండలా నిలిచింది
రైతు చనిపోతే…
ఆదుకున్నది రైతు బీమా
జిల్లాల వ్యాప్తితో దిశ మార్చుకుని
ఇంటికి చేరువైంది సుపరిపాలన
అభివృద్ధికి పునాదిరాళ్లు
మెడికల్ కాలేజీల పెంపుతో
పేద విద్యార్థులు డాక్టర్లు అవుతుండ్రు
ఇంటి ఇగురం- ఇడుపులు తెలుపు
ఏరు పడ్డప్పుడు ఎగతాళి చేసినోళ్లు
అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతుండ్రు
అమరవీరుల జ్ఞాపకార్థం
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ
తెలంగాణ తల్లి ఒడి నిండా…
మట్టి పరిమళపు రాసులు
ఆర్కల రాజేష్ తిర్మలాపురం (ఆరతి) 91779 09700
కొన్ని వసంత కాలాల చిగురు
మెల్లగ జారుకుంటున్న మబ్బుల్ని
పగ్గమేసి గుంజితే మునుపు రాలిన నీటి బొట్లెన్ని
సర్కార్ తుమ్మల నీడలతో మైదానమైన
చెరువులల్ల పదను జాడేది
నడుస్తున్న తొవ్వల
వలసపోకుంట పోరలు తంగెడు చెట్టుకు
కలల్ని దాచిపెట్టిన ఎన్నో యాదులు
ఎద్దెన్క మనిషి,
మనిషెనక ఎద్దు ఎన్నిసార్లు పొలిమేర దాటలేదు
పల్లె నీడను మిగిల్చి
పుట్టిన నేలను వదిలి
ఒంటె అడుగుల్లో మెతుకుల్ని వెతుక్కుంట పోయిన యవ్వనాలు శవాలై రాకట ఎంతటి గత విషాదం
గుత్తులు గుత్తులు వరిగొలుసులు కట్టాల్సిన
పొలంల ఎండ్రిన్ డబ్బాలోంచి మనిషి మూలుగు
అరవై ఏండ్లు కలిసి నడిచినాంక గూడా
బాషింగం కట్టి బంధుత్వం
కలుపుకోని పరాయి పాలన
రక్తం చిందిన నేల మీద
నమ్మకం నందివర్ధనమై మొలిచింది
ఏండ్ల పోరాటం విజయకేతనమై రెపరెపలాడింది
వరి చేను సింగారించుకున్న పెండ్లి పందిరైంది
చెరువు మత్తడులు
బాల్యంలో ఉన్న పసిపిల్లల నవ్వుల తుళ్లింతలు
వంగిన విల్లు లాంటి నింగి మోకాళ్ల మీద కూర్చొని
బంతిచేనైన ఈ నేలను ముద్దాడుతున్నది
కరువు కన్నీళ్లింకిన చూపుతో వలస పోయింది
వెలుగురేఖలను నాగలికి చుట్టుకొని
రైతు పొలంల సూర్యుడై వెలిగిపోతున్నడు
వేముగంటి మురళీకృష్ణ
96765 98465
జూన్ 2
చిన్నప్పుడు
పెద్దోళ్ల నోట విన్న
పెద్దూరు పట్నం..
పట్నమంటే ఒక సినారె
ఒక దాశరథి
పట్నమంటే
అక్కడే కన్ను మూసిన
నా బిడ్డ జ్ఞాపకాలు
పట్నమంటే
ఆదివారం అబిడ్స్ చెరువులో
విరబూసిన పుస్తకాల కలువలు
పట్నమంటే
ఉద్యమాల గడ్డ
పట్నమంటే
బత్కనీకొచ్చేటోళ్లకు
అన్నపు ముద్ద…
ఇప్పుడు పట్నమంటే
జూన్ 2
జూన్ 2 అంటే
అమరుల త్యాగఫలం
జూన్ 2 అంటే
మన తెలంగాణ
జన తెలంగాణ
జూన్ 2
ఘన తెలంగాణ
రాష్ర్టావిర్భావ
నిండు పండుగ రోజు
వీపీ చందన్రావు
94400 38565
యుద్ధ జ్వలనం
ఎడతెరపి లేని దుఃఖం
ఎడారిలో ఒంటరి ఒంటెలాంటి
దిగులు ప్రయాణం.. చూపులకు అందినంత
దూరం జీవిస్తున్న శవాలు
బానిసల ముసుగు నుంచి పీలుస్తున్న గాలి
సంపద సృష్టికర్తలై,
ఉన్నత సాంస్కృతిక నేపథ్య వారసులై
బిగించిన వలస పిడికిలిలో ఊపిరాడని దైన్యం
ఎందుకు దిగులు?.. ఎందుకీ వేదన?
పోరాడితే పోయేది
బానిస సంకెళ్లే అన్న ఒక స్ఫూర్తి
ఒక విక్రాంతి.. ఒక విస్పోటన
ఎగిసింది ఆమరణ దీక్ష
కొత్త జవాన్ని నింపింది
అర్జునుడికి పక్షి కన్నే కనిపించింది
అభిమన్యుడు పద్మవూహం ఛేదించాడు
శ్రమ జీవి చరిత్ర రాశాడు
దీక్షావిదుడి సహస్ర సూర్యతేజం
సబ్బండ వర్ణాలలో నిండిపోయింది
వికసించిన ప్రాణవాయువు
అంతా కొత్త ఉత్తేజం
నవజాత శిశువు కేరింతలు
పదేళ్ల ప్రయాణంలో ఎన్ని పదనిసలు?
హరిత హరితంగా ఆ ముఖం వికసించింది
జలసిరులతో ఆకుపచ్చని చీర కట్టుకుంది
రైతు గుండె విజయ గీతం ఆలపించింది
మళ్లీ చీకటి…
ఎక్కడో కలుసుకున్న భూమి ఆకాశాలు
ఇప్పుడు మళ్లీ కలలు అయ్యాయా?
నడక తప్పదు
తెలంగాణ రక్తమే
ఒక యుద్ధ జ్వలనం
ఒక జన సమ్మర్దం
ఒక విప్లవం.
– కాంచనపల్లి గోవర్ధన్ రాజు
96760 96614
ఒక దశాబ్దపు కల
ఒక కల మొలకెత్తి
పచ్చని ఆకులతో
కళకళలాడటం మొదలై
దశాబ్దం గడిచింది
కలల నీడలో
సేద దీరుతున్న పక్షులెన్నో
కొత్త అధ్యాయాల్ని కలగంటూ
మహా వృక్షమయ్యే
మరో మహా కల కోసం
సిద్ధపడుతున్నాయి
పీడ కల ఛాయలింకా
మర్రి నీడల్లా వెంటాడుతూనే వున్నాయి
బానిస బుద్ధుల జాడలింకా
ఆధిపత్యపు కోరల కింద పడి
నలిగిపోతూనే వున్నాయి
స్వచ్ఛమైన తేట నీటి సరస్సు లాంటి
ఒక వెచ్చని కలను పొదుగుతూ
కాలం నిరీక్షిస్తూనే ఉంది
బంగారు తెలంగాణ దిశగా
భవితవ్యపు జింకపిల్ల
పరుగులు పెడుతూనే ఉంది
పులులు చెప్పే
అహింసా కథలకు తలలూపుతూ
గొర్రెలింకా మోసపోతూనే వున్నాయి
ఒక దశాబ్దపు కలని
కాకులెత్తుకుపోకుండా
చెట్టులా ఎదుగుతున్న
దట్టమైన ఆకుపచ్చని సైన్యమొకటి
రేపటి కలలకొమ్మల్లోంచి
కొత్త పొద్దయి పొడుచుకొస్తోంది
కాలం ఒక కొత్త రుతువునూ
సిద్ధ పరుస్తోంది
చిత్తలూరి
91338 32246
పోరులో వీరులు
పోరులో వీరులు పొద్దుపొడుపై
పొడిచిన తెలంగాణ
దగా పడ్డ తెలంగాణ
దారి చూపిన తెలంగాణ
నీళ్లు మలిపిన తెలంగాణ
నిధులు మలిపిన తెలంగాణ
నియమం కల తెలంగాణ
దగా పడ్డ తెలంగాణ
దశాబ్ది కాలం పచ్చబడ్డ
పల్లె నేల తెలంగాణ
సంకెళ్లు తెంచుకొని
సత్తువ సాటుకున్న తెలంగాణ
రైతుబీమా రైతుబంధు
షాదీ ముబారక్.. కల్యాణలక్ష్మి
కానుకల తెలంగాణ
హరితహారం మిషన్ భగీరథ
ప్రజా సంక్షేమ పథకాల
ప్రసిద్ధి తెలంగాణ
కొండల నడుమ కోనేరు అయింది
చెరువులో గంగమ్మ సేద తీరింది
కృష్ణమ్మ మామడిలో కునుకు తీసింది
గోదారి గంగమ్మ గొంతు తడిపింది
సాధించిన తెలంగాణ
సంతోషించిన తెలంగాణ
దేవరపాగ కృష్ణయ్య
99634 49579
తెలగాణ సేవకులము
పురిటి నొప్పుల కోర్చిన పుడమి యేది
కష్ట నష్టాలు దాచిన కడలియేది
ధైర్య సాహసాల్ గల్గిన ధరణి యేది
యేది తెలగాణ గాకింకనేదియేది
కరుణజూపు వేళ కన్నతల్లి మనసు
కడుపు నింపు వేళ కల్పతరువు
చేరికోరువేళ స్నేహితుడై నిల్చి
ఘనత గన్నది తెలంగాణ నిజము
పక్కవారికి నింత పంచిపెట్టుటె గాని
పరుల సొమ్మును గోరు పట్టులేదు
పరుల కొరకు కష్టపడుట తెలియు గాని
శ్రమ దోపిడిని సేయు సరళి లేదు
పరుల సంస్కృతులపై భక్తి జూపుటె గాని
భేద భావముగనెడి బెట్టులేదు
బంధువర్గంబుగా పరుల దల్చుటెగాని
వైరులన్ భావించు వరుస లేదు
మంచితనమున్న మనుజులై మసలుకొంటు
యున్నవారలము ధీరులము యున్నతులము
ఘనతగన్న తెలంగాణ కన్నబిడ్డ
లము గదా యింతటౌన్నత్య లక్షణులము
కావ్యాలు వెలయించి కవులుగా రాణించి
పఠితల మెప్పించు పటిమ యుంది
కమ్మని గీతాలు గానంబు సేయుచు
శ్రోతలన్ ఒప్పించు శోభయుంది
జీవమై శోభిల్లు చిత్రాలు చిత్రించి
చూపరులను గట్టు సుగుణముంది
నాటికల్ సినిమాల నటనలో జీవించి
ప్రేక్షకుల్నలరించు ప్రేరణుంది
లలిత కళలన్ని మానేల వెలుగులీను
కళలు కత్తులై సమరాన కాలుదువ్వు
రెండువైపుల ముద్రణల్ నిండి జగతి
చెల్లుబాటగు నాణెమై యుల్లసిల్లు
గడ్డి పరకగాతలయొగ్గి గడుపగలము
మించి కత్తిగా తలల ఛేదించగలము
తలచి నంతటన్ సాధించి నిలువ గలము
గత చరిత్ర వారసులుగా బ్రతుకగలము
చేవగలిగిన తెలగాణ సేవకులము
అమరవాది
రాజశేఖర శర్మ
సదా స్మరామి
వీర పుత్రుల గన్న
వసుంధరీ ఈ జననీ..
ధీర పుత్రులు వున్న
పురంధరీ ఈ అవనీ..
త్యాగాల నా తల్లి
తనువెల్లా రగిలింది
బానిసత్వ బతుకుల్లో
బాధల్ని మింగింది
కష్టాల కడలిలో కన్నీరు కార్చింది
చెరసాల చెలిమిలో చరితల్ని రాసింది
శరాలను సంధించిన వీరోచిత పోరాటం
శరీరాలు బంధించిన ఆకాంక్షల ఆరాటం
సకలజనుల సమ్మెగా అడుగేసిన పోరుబాట
పై వోడి గుండెల్ని వణికించిన ఉద్యమ పాట
విజయగాథ చప్పట్లు వీరవనిత ముచ్చట్లు
పోరాటపు ఇక్కట్లు పొద్దుపొడుపు తప్పెట్లు
తిమిరంలో వెన్నుపోట్లు సమరంలో గన్నుకాట్లు
దాచుకున్న దాగవు చెప్పుకొన్న తరగవు
సమ్మక్క-సారక్క జాతర్లు బోనాల సందళ్లు
బతుకమ్మ కూడళ్లు విప్లవాల ఎరుపు కళ్ళు
గోల్కొండ రాస్తా చార్మినారు చౌరస్తా.. ఔరా
సాలార్జంగు మ్యూజియమ్ము
చారిత్రిక గుండె దమ్ము
వేములవాడ రాజన్న పాల్కుర్కి సోమన్న
కాళోజీ కలం గీత దాశరథీ కలల రాత
సుద్దాల హనుమన్న యుద్ధనౌక గద్దరన్న
పలుకు పలుకు తేనెలొలుకు.. పంచభక్ష్య పర్మాన్నం
జరీ అంచు చేనేత.. జానపదుల కలబోత
మక్కకంకుల పాలతీపి.. తంగేడు పూల రూపి
పాలపిట్ట.. జమ్మిచెట్టు మెట్టు మెట్టు ఎక్కినట్టు
ప్రాణాలను వదిలిపెట్టి సాధించిన హృదిమెట్టు
బాధించిన పరతంత్రపు గాయాలదీ ఆర్తి
సాధించిన స్వాతంత్య్రపు త్యాగాలదీ దీప్తి
అలుపెరగని త్యాగాలు అదే మన రాష్ట్ర స్ఫూర్తి
‘దశ’దిశలా ఫలాలు చేకూరెను అదే స్వేచ్ఛ కీర్తి
డాక్టర్ , కటుకోఝ్వల రమేష్
99490 83327
భరత గర్భ
నే కనిపించిన.. నే వినిపించిన
భావ ఝరుల
కవితా వధూటి పరంపరలో
నన్ను నేనుగా మళ్లీ మళ్లీ
వచో విలాసనవుతున్నాను
నూరేండ్లు ఇప్పుడు ఓ సంఖ్య కాదు
ఏడు దశాబ్దాల తెలంగాణ పోరాట చరిత
స్వర్ణోత్సవ కీర్తి పతాక ఉజ్వల గీతిక
భక్తి ఉద్యమాలు దేశానివైనప్పుడు
కొడిగట్టిన భాషా దీపాన్ని
మళ్లీ వెలిగించిన పటిమను
పడగొట్టిన విలువలను
నిలబెట్టిన ఘనతను
సాయుధ పోరాటాలు
స్వాతంత్య్ర బలిదానాలు
పునాదిరాళ్లు పుట్టుక బీళ్లూ వెల్లువలైనప్పుడు.. అప్పుడు…
ఒక్క అక్షరాన్ని ఇస్తే
తెలుగు జిలుగు తెలంగాణగా
భౌతిక ధర్మ బంధనమయ్యాను
బౌద్ధిక ధర్మ ప్రతిపత్తినయ్యాను
ఒక్క స్నేహ హస్తమిస్తే
అనంత చైతన్యమయ్యాను
చిటికెడు ప్రేమనిస్తే పలు రాష్ట్రీయుల్ని అక్కున చేర్చుకున్నాను
నేను తెలంగాణ మట్టిని
ప్రాచీనత నా కాకతి శిల్ప చాతుర్యంలో ప్రతిఫలించింది
ఆధునికత నా విద్వత్ రూపమయ్యింది
ప్రామాణికత నా ఆచార వ్యవహారమయ్యింది
బ్రతుకు ప్రవర్ధమానమవుతుంటే
పరిణతి మానవీయతకు పట్టం గట్టింది
ఎప్పుడెప్పుడు విపత్తు సంభవిస్తుందో
అప్పుడు మూగబోయిన గళగర్జనల
రాశి భూతం అవుతుంటాను
శాతవాహన సంరంభాలో
కుతుబ్షాహీల పాలననో
భాగ్యనగరమయ్యాను
కులమత భేదాలకు తావీయక
ముఖ్య పట్టణ ముచ్చటయ్యాను
హైదరాబాద్ పేరున ప్రపంచ వెలుగునయ్యాను
జన జీవన సౌందర్యానికి
నేను మేరు పర్వత ప్రతీకను
నా సాహితీ సౌజన్యంలో
ద్విపద రామాయణమో
భాగవత రచనా దీప్తులో
సుందరతను దృగ్గోచరం చేస్తుంటాయి
శాసన రచనల చరిత్ర రచనల
ధరిత్రిని.. కళల కాణాచిని
నేను సింగరేణి గనుల ఘన చరితను
కృష్ణా గోదావరి నగవుల పునీతను
నా పుట్టపుటంచులు
పచ్చని పేట అయినట్టు
ఝంఝామారుత స్వరజతిగా విప్లవించే మట్టిని నేను
నాదైన ఐక్యతా రాగాల
ముక్తకంఠ గరిమతో
నవ నిర్మిత యువత భవిత కలలను సాకారం చేస్తుంటాను
కొత్త వింతలను
పాత సంప్రదాయాలను
సానుకూలం చేస్తుంటాను
నేనవతరించిన పదేండ్ల పుట్టినరోజు ఇప్పుడు.. ఓ చక్కని వేడుకల వేదిక!
రండి… లోకమంతా చూపుల చుక్కలను ఈ నేలకు దండగా వేస్తున్నది
ప్రజ్వరిల్లే మయూఖాలనూ నేను
ఆహ్వానిస్తున్నాను
నేను భరత గర్భను.. నేను తెలంగాణను!!
డాక్టర్
కొండపల్లి నీహారిణి