సాహిత్య ఉత్సవాలంటే (లిటరరీ ఫెస్టివల్స్) జాతీయ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో మేధో జీవులు పాలు పంచుకునే ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితమైనవిగా భావిస్తారు. కానీ, 2025, మార్చ్ 9న దేశంలో తొలిసారి హైదరాబాద్‌లోని తార్నాక ప్రాంత రచయితలు, ప్రచురణకర్తలను భాగస్వాములను చేస్తూ పక్కా లోకల్ సాహితీ సంబురాలను నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను తార్నాక ప్రాంత గృహ సముదాయ సంక్షేమ సంఘాలు (రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్), సీనియర్ సిటిజన్స్ సంయుక్తంగా స్వచ్ఛందంగా నిర్వహించాయి.
ఆర్థికంగానే కాకుండా, సాహితీ ఉత్సవాల నిర్వహణలో పూర్తిగా భాగస్వాములు కావడం మరో ప్రత్యేకత. సృజనశీల రచయితలు, బుద్ధిజీవుల ఆలోచనలను క్షేత్రస్థాయిలో వ్యాపింపచేయడానికీ, తమ ప్రాంతంలోని విద్యావంతులలో పుస్తక పఠనాసక్తిని ప్రోత్సహించడంలో ఈ వినూత్నమైన ప్రాంతీయ సాహితీ ఉత్సవాలను బయటివారి ప్రోత్సాహంతోనో, ప్రభుత్వ సహాయంతోనో కాకుండా, తమ ప్రాంతంలోని గృహ సముదాయ సంక్షేమ సంఘాల సహకారంతోనే నిర్వహించాలనే భావనకు తార్నాక గృహ సముదాయ సంక్షేమ సంఘాల స్థాయీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రావు వీబీజే చెలికాని అంకురార్పణ చేశారు.
తార్నాక ప్రాంతవాసులైన రచయితలూ, ప్రచురణ కర్తలు పద్మిని భావరాజు, డాక్టర్ రఘుకుమార్ అవధానుల, ఆనందేశి నాగరాజు, డాక్టర్ లక్కరాజు నిర్మల, రేణుక అయోల, డాక్టర్ పి.జ్యోతి, ప్రొఫెసర్ పీసపాటి, కొసరాజు సురేష్, జెన్నీ, ప్రొఫెసర్ జహంగీర్, డాక్టర్ ఏ.రాజమొగిలి, శ్రీమతి వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ రాధాకృష్ణ, డాక్టర్ ఈటెల సమ్మన్న, ప్రొఫెసర్ కౌసర్ అజాం తదితరులు తమ పుస్తకాల గురించి వివరించారు. వీరి పుస్తకాలను విక్రయించడానికి వీలుగా 18 ప్రత్యేక స్టాల్స్ ఇందులో ఏర్పాటుచేశారు. సందర్శకులు రచయితలను ముఖాముఖిగా కలుసుకోవడంతో పాటుగా తమకు నచ్చిన పుస్తకం గురించి సమావేశంలో ముచ్చటించారు.
ఈ సాహితీ ఉత్సవాన్ని మణిపూర్ విశ్వవిద్యాలయ కులపతి, ఓయూ మాజీ ఉప కులపతి టి.తిరుపతి రావు విశిష్ట అతిథిగా పాల్గొని హైదరాబాద్‌కే విద్యా కేంద్రమైన తార్నాకలో మొదటి ప్రాంతీయ సాహితీ ఉత్సవాలు నిర్వహించి చరిత్ర సృష్టించారన్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శాస్త్రీయ వంటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసి గౌరవించారు. క్షేత్రస్థాయిలో మంచి పుస్తకాల ఆదరణకు, పుస్తక పఠనాసక్తి పెంపొందించడానికి, ప్రాంతీయ రచనల ప్రాచుర్యానికి ఇది మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం.
– ఆనందేశి నాగరాజు 98488 38323