పేరులోనే ‘ఊహ’ అని ఉన్న అమ్మాయి శ్రీ ఊహ. ఆమె ఊహలకు అంతులేదు. ప్రతి ఊహనూ కథగా మలచగల సామర్థ్యానికి అదుపులేదు. ఎంత గంభీరమైన, గహనమైన భావాన్ని అయినా అలతి అలతి పదాలతో, చిన్నచిన్న వాక్యాలతో చెప్పడం ఆమె కథన ప్రత్యేకత. కవిత్వం ఒక ఆల్కెమీ అంటారు కానీ, కథ రచన కూడా ఆల్కెమీనే.
2022 డిసెంబర్ 24న మొదటి కథాసంపుటి ‘ఇసుక అద్దం’ ప్రచురించిన నాలుగేండ్ల్లు గడవకముందే మరొక రెండు సంకలనాలు ప్రచురించి తెలుగు సాహిత్యలోకాన్ని ఆశ్చర్యపరిచారు. వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా ఆమె ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రతి ప్రయాణమూ ఆమెకు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తుంది. అలా పరిచయమైన ప్రతి జీవితమూ ఆమెకు ఒక కథను ఇస్తుంది. శ్రీ ఊహ కేవలం కథలు మాత్రమే చెప్పరు. పాఠకుడిని తన వేలు పట్టుకుని అపరిచిత వీధుల్లోకి, మనుషుల అంతరంగాల్లోకి తీసుకెళ్తుంది. శ్రీ ఊహ కథ చదవడం అంటే, ‘బాల్కనీ’లో ఒక అందమైన దృశ్యాన్ని చూడటం కాదు, పాఠకుడు ఒక ‘జంగమం’గా మారి రకరకాల స్థల కాలాల్లోకి ఎదురువెళ్లే అనుభవం.
శ్రీ ఊహ కథల్లో ‘నిశ్శబ్దం’ ఒక ప్రధాన పాత్రధారి. కథలోని పాత్రలు చేసే సంభాషణల కంటే, ఆ సంభాషణల మధ్య ఉండే విరామాలు ఎక్కువ విషయాలను చెప్తాయి. ‘పరావర్తనం’ కథలో చైనులు అనే బ్రాహ్మణ యువకుడు శవ వాహకుడిగా మారటం వెనుక ఉన్న సామాజిక పరిణామం కానీ, ‘లడాయి’లో విమల్ ఎదుర్కొనే అస్తిత్వ పోరాటం కానీ…రచయిత్రి వాచ్యంగా ఎక్క డా విశ్లేషించరు. కానీ, ఆ పాత్రల ప్రవర్తన, వారి మౌనం పాఠకుడిని ఆలోచింపజేస్తాయి.
శ్రీ ఊహ రాసిన కథల్లో నేను మొదట చదివిన కథ ‘డబుల్ ఎక్సెల్’. మనం చాలా సాహిత్య చర్చలో, స్త్రీవాద సమావేశాల్లో బాడీ షేమింగ్ అని చాలా గంభీరంగా చర్చించుకుంటూ ఉంటాం. కానీ మన ఇండ్లల్లో, వీధుల్లో ఇది ‘సరదా’, ‘పరాచకం’ ముసుగులో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. శరీరం పెరగడం అనేది ఒక సహజ జీవక్రియ. అది వ్యక్తిగతమైనది కానీ, స్త్రీల విషయంలో సమాజం ఒక నిర్దిష్టమైన ’కొలత’ను ఆశిస్తుంది. ఆ కొలతకు అటుఇటుగా ఉన్నా, అది విమర్శలు, వెటకారాలకు దారితీస్తుంది. శరీరం గురించి మాట్లాడటం అనుచితమూ, అమానుషమూ అనే అత్యవసరమైన ఎరుకను కలిగిస్తుంది శ్రీ ఊహ రాసిన ‘డబుల్ ఎక్సెల్’. ‘బుజ్జమ్మ మెట్లు’ కథాంశం మధ్యతరగతి కుటుంబాల్లోని నైతిక విలువల పతనాన్ని, స్వార్థం ముందు రక్తసంబంధాలు ఎలా తలవంచుతాయో అత్యంత దారుణమైన వాస్తవికతతో చిత్రించారు. మనిషి తన అవసరాల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతాడని, ఎదుటివారి బాధ కంటే తన లాభమే ముఖ్యమనుకునే ’ముసుగు వేసుకున్న మధ్యతరగతి గౌరవం’ ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఎవరీ ట్యాంక్‌బండ్ శివ? అని ఆరాతీశారు శ్రీ ఊహ. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడేవారిని కాపాడటమే లక్ష్యంగా బతుకుతున్నవాడు శివ. కాలుష్య కాసారంలోకి దిగడమే ఆశ్చర్యమైతే, ఎందరి ప్రాణాలో కాపాడటం అద్భుతం అనుకున్నారు. అతడిని కలిశారు. తన గాథంతా తెలుసుకున్నారు. ‘శివ అంటే ఈడే’ అనే కథ రాశారు.
శ్రీ ఊహ కథలకు శీర్షికలు ఇచ్చే విషయంలో కూడా చాలా ప్రత్యేకం. ‘ఇసుక అద్దం’ అనే శీర్షికే ఒక వైరుధ్యం. ఇసుక అంటే అస్థిరతకు గుర్తు, అద్దం అంటే స్పష్టమైన ప్రతిబింబానికి గుర్తు. జీవితం ఇసుకలా చేజారిపోతున్నా, అందులో తనదైన అస్తిత్వాన్ని, స్పష్టతను వెతుక్కునే ప్రయత్నమే ఈ కథల సారాంశం. శ్రీ ఊహ కథల్లో వస్తువుకు హద్దు లు లేవు. మొత్తంగా చూసినప్పుడు ఆ కథల్లో వస్తువైవిధ్యం ఎక్కువ. కథలో చెప్పే విషయాలకంటే చెప్పకుండా వదిలేసిన విషయాలతో కథను ఎక్కువగా చెప్తారు. ‘ఇసుక అద్దం’లో ఒక రకమైన భావోద్వేగ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి సంపుటి కనుక తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తన అనుభవాలను అక్షరీకరించాలనే తపన ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. అదే ‘బల్కావ్’కి వచ్చేసరికి ఆ వేగం ఒక స్థిరమైన ప్రవాహంలా మారి, మరింత తాత్వికతను సంతరించుకున్నది.
– వంశీకృష్ణ 9573427422