శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం తెలుగు భాషా ప్రియులకు దేవాలయం. మొత్తం తెలంగాణకే అలంకారం. గ్రంథాలయోద్యమ ప్రభావం చేతనే భాషా నిలయం ఆవిర్భావం చెందిందని నా అభిప్రాయం. భాగ్యనగరంలో ఎన్ని గ్రంథాలయాలున్నా భాషా నిలయాల కేవీ సాటిరావు. ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్య గ్రంథాలయం కంటే పూర్వమే ఈ భాషా నిలయం స్థాపించబడటం గమనార్హం.
వరంగల్‌లోని రాజరాజనరేంద్ర భాషా నిలయం కూడా ఈ భాషా నిలయం తర్వాతనే ఆరంభించబడింది. నాకు తెలిసినంతవరకు హైదరాబాద్‌లో స్థాపించబడిన మొదటి గ్రంథాలయమే ‘శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’. ఇది 1901, సెప్టెంబర్ 1న స్థాపింపబడి 2001, సెప్టెంబర్ 1న శతజయంతి ఉత్సవం జరుపుకొన్నది. మనిషి జీవితకాలం నూరేండ్లు. కానీ, ఒక గ్రంథాలయం స్థాపించబడి నూరేండ్లు దాటినా ఇంకా అది చెక్కు చెదరకుండా భాషాభిమానులకు కల్పతరువుగా భాసిల్లుతుందంటే మనకు ఆశ్చర్యం కలుగకమానదు.
ఎప్పుడైనా వ్యవస్థ అనేది వ్యక్తుల ప్రవర్తనను బట్టి ఉంటుంది. భాషా నిలయం మొదటి నుంచి క్రమశిక్షణతో పాటు, పరోపకార పారీణత, విద్యతృష్ణ కలిగిన వారిచేతిలో ఉంది. అందుకే ఈ నాటికీ అది భాషా ప్రియులకు అందుబాటులో ఉంది. భాషావేత్తలను తయారుచేసింది. హైదరాబాద్ నడిబొడ్డున రెండు విశిష్టమైన సంస్థలున్నాయి. వీటిలో ఒకటి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం కాగా, మరొకటి ఆంధ్ర సారస్వత పరిషత్తు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో వీటి పేర్లు మార్చబడ్డాయి. కానీ, ఈ రెండు సంస్థలు తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలు నిరుపమానమైనవి.
నేను ఆంధ్ర సారస్వత పరిషత్తుతో అనుబంధం కలిగిన వ్యక్తిని. పరిషత్తు పరీక్షలు రాసి, అక్కడి ప్రాచ్యకళాశాలలో 1970 నుంచి 1977 దాకా చదువుకున్నవాణ్ని. ఆ సమయంలో నాకు ఆంధ్ర సారస్వత పరిషత్తు గ్రంథాలయం కంటే విశేషంగా భాషా నిలయం ఉపయోగపడింది. మేము సాయంకాల విద్యార్థులం కాబట్టి, ఉదయమే భాషా నిలయానికి వచ్చి సాయంత్రం దాకా గడిపేవాళ్లం. అందులో అమూల్యమైన గ్రంథాలు, ఆధార గ్రంథాలు మాకు లభించేవి.
ప్రాచ్య విద్యార్థులకు కావ్యాలతోను, శాస్త్ర గ్రంథాలతోను ఎక్కువ అనుబంధం. మాకు కావలసిన ఏ పుస్తకమైనా భాషా నిలయంలో లభించేది. గ్రంథాలయ నిర్వహణ సజావుగా జరిగేది కనుక, ప్రతి పుస్తకం జాగ్రత్తగా భద్రపరచబడింది. మాకు బయటికి పుస్తకాలిచ్చేవాళ్లు కారు. అక్కడే చదువుకోవాలి. మంచి వాతావరణంలో కూర్చొని చదువుతున్నప్పుడు సరస్వతీ నిలయంలో కూర్చున్న అనుభూతి కలిగేది!
భాషా నిలయం పుస్తకాలయం మాత్రమే కాదు, ప్రముఖుల ప్రసంగాలకు చక్కని వేదిక. నేనిక్కడే తొలిసారి శ్రీశ్రీని దర్శించాను. ఇంకా ఎంతోమంది ప్రముఖ కవులను చూశాను. ఇక్కడ ఒక్కొక్కసారి సాహిత్య గోష్ఠులు వారాలకొద్దీ కొనసాగేవి. విద్యార్థి దశలో మాకు జ్ఞానార్జనలో తోడ్పడ్డ భాషా నిలయం అధ్యాపకులమైన తర్వాత మమ్మల్ని అక్కడ జరిగే అనేక కార్యక్రమాలలో భాగస్వాములను చేసింది. యువభారతి కార్యక్రమాలు ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ఇక్కడికి విస్తరించాయి. వారు జరిపిన ఉపనిషత్ వింశతి సాహితీ సప్తాహాలలో నేను బృహదారణ్యకోపనిషత్తుపై ప్రసంగించాను. ఉపనిషత్తులపై నా తొలి ప్రసంగం ఇక్కడే మొదలైంది.
ఒక కాలంలో మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా ఉన్న భాషా నిలయం, చాలాకాలం పాటు ఎం.ఎల్.నరసింహారావు కార్యదర్శిగా అందించిన సేవలతో అభివృద్ధి చెందింది.
ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. సాహితీప్రియులు, కళాపోషకులు, తెలుగులో విశేషించి పీహెచ్డీ పట్టా అందుకున్న డాక్టర్ కేవీ రమణాచారి, ఐఏఎస్ అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి భాషా నిలయానికి ఒక నూతన భవనాన్ని నిర్మించే అవకాశాన్ని కల్పించారు. వారి మార్గదర్శనంలో ఆంధ్ర సారస్వత పరిషత్తుకు కూడా ఎంతో మేలు జరిగింది. పరిషత్తు నెలకొల్పబడిన స్థలం సంస్థకే స్వాధీనమైంది. ఇది మరుపురాని సంఘటన. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భాషా నిలయానికి మొదటి నుంచి మంచి కార్యవర్గం ఉండి, నిరంతరం కార్యక్రమాల ద్వారా గ్రంథాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది కనుక.
అరుదైన పుస్తకాలకు నెలవైంది శ్రీ కృష్ణదేవరాయ భాషా నిలయమే. నేను ‘ప్రాచీన కావ్యాలలో గ్రామీణ జీవన చిత్రణ’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్నప్పుడు ప్రాచీన కావ్యాలన్నీ భాషా నిలయంలో లభించినవే. నన్నెచోడుని కుమారసంభవం, పాల్కుర్కి రచనలు, నాచన సోముడి రచనలు, విశేషించి ప్రబంధ సాహిత్యం ఇక్కడ లభ్యమైంది. భారతి, ఆంధ్రపత్రిక సాహిత్యానుబంధం సంచికలన్నీ ఇక్కడ వంద సంవత్సరాల నాడే భద్రపరచడం జరిగింది.
మేం విద్యార్థులుగా ఉన్న సమయంలో ఒక పెద్ద భవంతిలో ఉన్న భాషా నిలయం ఇప్పుడు మూడు నాలుగంతస్థుల భవనంలో అత్యాధునికమైన రీతిలో పాఠకలోకానికి, పండిత లోకానికి అందుబాటులో ఉంది.
భాషా నిలయం పండిత సత్కారాలనెన్నింటినో నిర్వహిస్తున్నది. బూర్గులవారి పేరు మీద, దాశరథి పేరు మీద బహుమతులిస్తుంది. భాషా నిలయమంటే శారదా నిలయం, కేవలం ఈ గ్రంథాలయం సుల్తాన్‌బజార్ నడి కూడలిలో ఉన్నదనే కాదు, జ్ఞాన విజ్ఞానాలకు కూడలిగా ఉన్నది. నాలాంటి విద్యార్థులెంతోమందికి భాషా నిలయం విజ్ఞాన కల్పతరువైంది. ప్రస్తుతం 125వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.
– (వ్యాసకర్త: ప్రముఖ కవి)
ఆచార్య మసన చెన్నప్ప