ఇదొక ట్రావెలాగ్. ఇదొక అనువాదం. సైకిల్ మీద వచ్చే నాన్న కోసం ఎదురుచూసే పసితనపు దారుల్లో అమ్మ మరణాన్ని రద్దు చేసే జీవగర్ర దొరికితే బాగుండుననుకునే కథకురాలు బొగ్గుబావుల చీకటి వెలుగుల్లో తిరుగాడిన ట్రావెలాగ్ ఇది. ఒక ప్రాంతాన్నీ, ఆ ప్రాంత జీవితాలనూ తప్పొప్పులు ఎంచకుండా తీర్పరిగా కాక తటస్థంగా కథలుగా తిరగరాసిన రచన ఇది. యాత్రారచనలు కూర్చిన, పరాయి భాషలను అనుసృజించిన రచనానుభవాలు ఒక ప్రాంత నిజ జీవిత శకలాలను కథలుగా మార్చే ట్రావెలాగ్‌గా మారడం బహుశా కథకురాలి కథాయాత్ర స్వర్ణయుగారంభం కావచ్చు. ఆ కథకురాలు స్వర్ణ కిలారి. ఆ ప్రాంతం కొత్తగూడెం ఉరఫ్ సింగరేణి. ఆ కథలు బొగ్గు కథలు అలియాస్ ‘నల్ల బంగారం’ కథలు.
సింగరేణి అనబడే కొత్తగూడెం ప్రాంత అస్తిత్వం విచిత్రమైనది. ఈ నల్ల బంగారులోకానిది ప్రత్యేకమైన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవనం. పేరుకే కొత్తగూడెం కానీ, అది కొత్తదీ కాదు, గూడెమూ కాదు. అది నక్సల్బరీ పోరాటమంత సనాతనం. అది సికాస నినాదమంత ఆధునికం. ఖమ్మం మట్టిలోంచి నిప్పుకణికలు రగిల్చిన తెలంగాణ ఉద్యమ గడ్డ అది.
సరే. మరి గూడెం అన్నాక మనుషులుంటారు కదా. మనుషులన్నాక వాళ్లకు జీవితాలూ ఉంటాయి కదా. ఆ జీవితాల్లో నవ్వులుంటాయి. కానీ, వాటికి కన్నీళ్లుంటాయి. దుఖాలుంటాయి. కానీ, అవి నవ్వులు నటిస్తాయి. భయం ఉంటుంది. కానీ, అది ధైర్యం వేషంలో ఉంటుంది. ఆ జీవితాలకు మాయామర్మాలు తెలియవు. కానీ, వాళ్లు మాయామర్మాలకు గురవుతారు. వాళ్లు ఎప్పుడూ ఓడిపోతుంటారు. అయినా ప్రతిసారీ గెలుపు పాటలే పాడుకుంటారు. రాకాసి బొగ్గులోనూ దైవత్వాన్ని దర్శిస్తారు.
అటువంటి గూడెంలో, అటువంటి జీవితాల నడుమ పుట్టి పెరిగి, బతుకు లోతులను, గతుకుల దారులనూ, బాధల వైశాల్యాలనూ చూశారు స్వర్ణ. ఆ చూపు చివార్న ఒక ప్రాంత జీవన వైవిధ్యమూ, ఆ ప్రాంత జీవుల మెరుపులూ, మరకలూ, అనుభవాలుగా దొరికాయి. ఇంకేం కావాలి ఇంతకన్నా, మంచి కథలను తవ్వి తీయడానికి. తన ఆలోచనలను ఓపెన్‌కాస్ట్ చేసి గుండె లోతుల్లోంచి కథా రాశులను తోడి మన ముందు పోయడానికి.
తనకు ఎదురైన సంఘటనల్లో స్వర్ణకు కథలు సమస్యతో సహా దొరికాయి. వాటికి పరిష్కారాలూ రెడీమేడ్‌గా సిద్ధంగా ఉన్నాయి. తన కంటపడ్డ దృశ్యాలను పేర్చుకోవడమే కథకురాలు చేయాల్సింది. అదే చేశారు కూడా. ప్రతి ఘటనలోకి పాఠకుడిని తీసుకెళ్లగలిగారు స్వర్ణ. అందుకే, నాన్నను బొగ్గుబాయి ఏమైనా చేసిందేమోనన్న భయానికి మనమూ గురవుతాం. లోపల మరే దో నొప్పి దాగుందని హైమావతీ లాంటి వాళ్ల వేదనను తడిమితే కానీ, అర్థం కాదని మనకు పైకి కనపడే గద్దరితనం చెబుతుంది. మద్యం కాలేయాన్ని, గుండెనే కాదు, కుటుంబాన్ని కూడా తినేస్తుందని శీనుగాడు భయపెడతాడు.
స్వర్ణకు ఎదురైన ఈ మనుషులంతా అతి సామాన్యులు. వాళ్ల అనుభవాలూ అతి సాధారణం. కానీ, ప్రతి సాధారణ సంఘటన వెనుక ఒక తాత్వికత పరుచుకుని ఉంటుందనీ కథకురాలు గ్రహించారు. అందుకే, అతి సాధారణ అనుభవాలను కూడా గొప్ప పాఠాలు చేసి ప్రపంచానికి బంగారం లాంటి కథలుగా ఇచ్చారు. ఊహూ.. నల్ల బంగారం లాంటి కథలుగా అందించారు.
బొగ్గు గుండెల్లోని వజ్రం పరిచయం కావాలంటే ఎవరో ఒకరు మసి కావాల్సిందేనన్న రీతిని బోధించే కథలివి. సముద్రం పరిచయం కావాలంటే నదితో పాటు మనమూ ప్రవహించాలనే నీతిని బోధించే కథలివి. పదండి లోపలికి. కొన్ని వజ్రాలు, కొన్ని సముద్రాలు మనకూ దొరక్కపోవు!
(నల్ల బంగారం పుస్తకం ముందుమాటలో కొంత భాగం)
– ప్రసేన్