సమాజం మారుతున్న కొద్దీ విలువలు మారడం కాదు, మారుతున్న సమాజానికి అనుగుణంగా విలువలు శాశ్వతంగా ఉండేలా చూడాలి టీవీ ఛానళ్లు. ముఖ్యంగా మానవ ఔన్నత్యం కోసం ఆయా రంగాల్లోని నిష్ణాతులైన వారితో చర్చలు జరిపిస్తూ పరిపూర్ణ మానవ సమాజం కోసం పురాణ వాఙ్మయం నుంచి కానీ, ఆధునిక సాహిత్యం నుంచి కానీ సందేశాలను తీసుకొని వాటిని ప్రదర్శించాలి. అలా అని మన జీవితాలను శాసించే ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు కాలంతో ఎలాగూ మారుతాయి! అదే సమయంలో ఈ సమాజం మనగడకు, వికాసానికి మీడియా మాధ్యమాలు శాశ్వత విలువలను ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉండాలి.
ధారావాహికల్లో (సీరియళ్లు).. హింస, పరపీడనం, డాబు- దర్పాల ప్రదర్శన, ఒకరి మీద మరొకరు కుట్రలు, కుయుక్తులు చేసుకోవడం, పన్నాగాలు పన్నడం, హత్యా ప్రయత్నాలు, చిన్న పిల్లల వయసుకు మించి డైలాగులు చెప్పించడం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. దీనివల్ల ‘ఇలాగే ఉండాలేమో?’ అని ప్రేక్షకులు అనుకరించే ప్రయత్నం చేస్తారు. ముందుముందు కూడా ఇదే పోకడలకు పోతే సమాజం విచ్ఛిన్నమవుతుంది.
ఇంతకాలం పురాణాలతోనో, నాటకాల ద్వారానో, పాటల ద్వారానో, శతకాల ద్వారానో నీతినియమాలు, ధర్మ లక్షణాలు చెప్పించి, వాటిని శ్రోతలు, పాఠకుల మనసుల్లోకి ఎక్కించేవారు. అలా స్థిరంగా ఆచరించడం వల్లనే వ్యవస్థ పరంగాను, సంస్కృతి పరంగాను, వారసత్వ పరంగానూ వేల సంవత్సరాల నుంచి భారతదేశం కుటుంబ విలువలను నిలుపుకొంటూ వస్తున్నది.
రానురాను నాటకాల ప్రదర్శనలు తగ్గిపోయాయి. ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం, ప్రదర్శనల ద్వారా వారికి తగినంత ఆదాయం రాకపోవడం అందుకు ప్రధాన కారణాలు. శాస్త్రసాంకేతిక రంగాలు దూసుకురావడం, వేగం పెరగడం, ప్రజలు కూడా ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడటం మొదలైన కర్ణుడి చావుకు అనేక కారణాల వలెనే… స+హితం=సాహిత్యం కాస్తా ‘కు’ హితం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే సీరియళ్లు దూసుకువచ్చాయి. అయితే, వాటి పోకడ మరీ దారుణంగా తయారైంది. సీరియళ్లలో ఆడవాళ్ల దుర్మార్గాలు, దాష్టీకాల వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రస్తు త కుటుంబాలపై వాటి ప్రభావం ఎంతో ఉన్నది.
‘ఇవన్నీ తెలిసి మీరెందుకు సీరియల్ చూస్తున్నారు?’ అని ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చు. అందులోని మంచి చెడులను చెప్పడానికి నేనూ సీరియళ్లు చూస్తాను. ఆదిశంకరుల వంటివారు కూడా ఉభయభారతితో వాదనలో శృంగారపరమైన చర్చ వచ్చినప్పుడు కాస్త గడువు కోరి రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేశారు. ఏదైనా విషయం గురించి మంచి, చెడు చెప్పాలంటే మనకు తొలుత తెలిసి ఉండాలి కదా!
మహిళలకు క్రూర మనస్తత్వం ఉన్నట్టు సీరియళ్లలో చూపించడం వల్ల మహిళలకే నష్టం. ఒక సీరియల్లో చిన్న కోడలు గయ్యాళి వలె, మరొక సీరియల్లో పెద్ద కోడలు బ్రహ్మరాక్షసి వలె, మరోచోట చదువుకున్న కోడలు దుష్టురాలి వలె, ఇంకో సీరియల్లో చదువుకున్న అత్తగారు క్రూరురాలి వలె, ఇలా అన్ని సీరియళ్లలో మహిళా ప్రతినాయికల (విలన్) పాత్రలను సృష్టిస్తున్నారు. ఇక వారి చర్యలెలా ఉంటాయం టే.. ఇదివరకే వివాహమైన వ్యక్తికి మరో వివాహం చేయాలని ప్రయత్నించడం, సదరు వ్యక్తి ధర్మచారిణిని తరిమేయాలని పన్నాగాలు పన్నడం.. లాంటి సీన్లు ఎక్కువగా ఉంటాయి. ఏకపత్నీవ్రతుడిగా కీర్తిపొందిన రాముడు కుటుంబాలకు ఇచ్చిన విలువల భరిణ రామాయణం. దాన్ని తునా తునకలు చేయడమే సీరియళ్ల పన్నాగమా? లేక పంతమా?
పురుషుల పాత్రలు మాత్రం సందేశాత్మకంగానే ఉంటాయి. పురుషుల పాత్రలను నోట్లో నాలుక లేని వారుగానో, లేక మరీ మంచితనాన్ని ప్రదర్శించేవారుగానో చిత్రీకరిస్తారు. కానీ, సీరియళ్లలో ఆడవారి మాటలెలా ఉంటాయంటే.. ‘అది ఎట్లా చేస్తున్నదో చూడు’, ‘దాన్ని జుట్టు పట్టు లాగి కొట్టాలి’ అనే డైలాగ్‌లు కనిపిస్తుంటాయి. విష ప్రయోగాలు చేయడం, లేదా కాలో, చెయ్యో విరగ్గొట్టి మంచంలో పడేసి, కాపురం చేయకుండా చూడాలని, నూనె డబ్బాలను మెట్ల మీద కుమ్మరించడం, లేదా ఫెన్సింగ్‌కు కరెంటు షాక్ వచ్చేలా అమర్చడం… లాంటి సీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా చేతబడులు, క్షుద్రపూజలు చేయించడం, మంత్రాలు-తంత్రాలు, మాయలు, మన్ను-మశానం అన్ని ప్రయత్నిస్తుంటారు.
ఇలా మూఢనమ్మకాలను పెంచి వందల ఏండ్లు వెనుకకు ప్రేక్షకులను తీసుకుపోవడం మంచిదేనా? అసలవన్నీ చూపించవచ్చా? నాటక లక్షణాలు వారికి తెలియవా? దేన్ని చూపించాలనేది చానళ్లు పాటిస్తున్నాయా? నియమ నిబంధనల గురించి చానళ్లకు తెలియదా? దర్శక-నిర్మాతలకు తెలియదా?
హిందూ వ్యవస్థకు ఉన్న పవిత్రతను పోగొట్టి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే సీరియళ్లను చూసినవారు ఏం కావాలి? ఎందుకంటే ఫ్యామిలీ టైమ్ అని కలిసి ఫ్యామిలీ రూంలో కూర్చొని టీవీ ఆన్ చేస్తే వచ్చే సీరియళ్లు ఇవే కదా? మరి అవి భార్యల సంతృప్తి కోసం కూర్చొని చూస్తారు. ఎలాంటి సంతృప్తి అంటే? పిల్లలు ఉద్యోగరీత్యా దూరప్రాంతాల్లో ఉంటే దంపతులు రోజూ బయటకు పోలేరు. కనుక టీవీల్లోనే సమయం గడుపుతారు. అలా ఉపయోగపడుతున్నాయి సీరియళ్లు. అలాంటప్పుడు సీరియల్ అవసరమే కదా? అని అంటారేమో? సీరియళ్లు ఆపేయాలని కాదు నేను చెప్పేది. అందులో నేరాలు- ఘోరాలు తగ్గించుకుంటే కాస్త మంచిదేమో? అని నా అభిప్రాయం.
ఒకతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం తల్లికి నచ్చదు. తన కొడుక్కి ఎలాగైనా రెండో పెళ్లి చేయాలని, ఆ ఇంట్లో కారణం లేకుండానే ఉండే తమ్ముడి కూతురిని తన కొడుకుకు కట్టబెట్టాలని, అందుకు కోడలిపై ఏదో ఒక నేరం మోపి ఇంట్లోంచి వెళ్లగొట్టాలని, తెగ ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఓ అత్త. నిజ జీవితంలో ఎంత కోపమున్నా కూడా ఇలా తన కుటుంబసభ్యులను చావగొట్టాలని చూస్తా రా? లేదా అంగవైకల్యం వచ్చేలా చేయాలనుకుంటారా? ఇలాంటి వాటిని లీనమై చూస్తున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఇంకా రేపు ఏం జరుగుతుంది? ఆ పిల్ల చస్తుందా? లేక దాని కాలు విరుగుతుందా? అని ఆడవాళ్లను తిట్టుకుంటూ కొంతమంది మగవారూ చూస్తారు. ఉత్కంఠ రేపి వదిలేస్తారు.
సీరియళ్లు వినోదాత్మకంగా ఉండి మనసుకు హాయి కలిగించి సేదతీర్చేలా ఉండాలి. సమాజాన్ని కదిలించేలా చైతన్యవంతమైన కథలతో సందేశాత్మకంగా ఉండాలి. ముఖ్యంగా, ఆడ విలన్లను తగ్గిస్తే మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ దుష్ట స్త్రీల గురించి చెప్పాలనుకొంటే మన ఇతిహాసాల్లో, పురాణాల్లో దుష్ట పాత్రలు లేవా? వాటి వలె చిత్రీకరించి, ఏది చెప్పినా బుజ్జగించినట్టు చెప్పాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఇది వరకే చాలామంది భార్యా బాధితులున్నారు. వారు మరో రకంగా హింసింపబడుతున్నారు. పెళ్లికాని 40 సంవత్సరాల బ్రహ్మచారులు, పెళ్లికాని ప్రసాదులున్నారంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న ఆడపిల్లలు కరువయ్యారనే కదా అర్థం! చాలామంది మహిళలు సీరియళ్లకు వ్యసనపరులైపోతున్నారు. వారు ఒక్క రోజు కూడా చూడకుండా ఉండరు.
పూర్వకాలంలో విలువలు పట్టు తప్పిపోతున్న ప్రతీసారి ఎవరో ఒక మహాత్ముడు ఆధ్యాత్మిక గురువై తమ బోధనలతో మళ్లీ ఆ విలువలను నిలబెట్టే ప్రయత్నం చేసేవారు. అలా పూర్వం అనసూయ, అరుంధతి లాంటి మునిపత్నులు ఆడవారికి మంచి-చెడుల తారతమ్యం చెప్పి జ్ఞానులను చేసేవారు. వాటిని సీత, ద్రౌపది వంటివారు విని ఆచరించి చూపా రు. అలా ఈ మహిళామణుల స్థానంలో టీవీ చానళ్లు ఆకట్టుకునే సీరియళ్లతో మైత్రీ పూర్వక కథనాలను ప్రదర్శించి, ఆ విలువలను నిలబెట్టాలి. అలా సామాజిక జీవితంలో శాశ్వత విలువలకున్న ప్రాధాన్యాన్ని చెప్పాలనుకుంటే ఎవరినీ కించపరచకుండానే చెప్పవచ్చు. ఉదాహరణకు మందర లాంటి ఆయా పాత్రలకు సముచిత స్థానాన్ని ప్రాముఖ్యాన్ని లోగడ కూడా ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కూడా అలా ఇస్తూ సీరియల్ తీయవచ్చు. అప్పుడే నిర్మాతలను అభ్యుదయ నిశ్శ్రేయస్సులని అనవచ్చు.
జీవితంలో రోజు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుక్కొనేందుకు మంచి మాటలు లేదా మంచి నడవడికతోనే ఎలా చెప్పాలని ఆలోచించాలి. ఎందుకంటే మానవుల పరస్పర బంధాలతో కలిసి చేసే పనులు, నేర్పరితనంతో చేసే పనులకు వీటి వల్ల గండిపడి శాంతిని కోల్పోతారు. మానవ ఐక్యత లోపించి, ఎన్నో కష్టాలకు దారితీస్తుంటాయి. ఇలాంటి వ్యాకులత కలిగించే సీరియళ్ల స్థానంలో పనులు చేసి అలసిపోయిన వారికి ప్రశాంతతను కలిగించే కథనాలను ప్రసారం చేయాలి.
ఏ కావ్యం రాసినా, ఏ నవల రాసినా, సాహిత్య ప్రక్రియలో ఏది రాసినా మానవ కల్యాణమే లక్ష్యంగా సాగాలి. అంతే తప్ప ద్వేషాలు- పగ-ప్రతీకారాలతో సీరియళ్లు తీస్తే, రోజూ వాటిని పదే పదే చూపెడితే ఆ ప్రభావం కొద్ది కొద్దిగా మనిషిని మృదు స్వభావం కోల్పోయేలా చేస్తుంది. మొరటుగా మారుస్తుంది. నిజ జీవితంలోనూ సాటివారిని హింసించవచ్చని అనిపించవచ్చు. అప్పుడు ఆ సీరియల్ దుష్ప్రభావం చూపిందనే అనుకోవాల్సి ఉంటుంది.
అందరూ అలాంటి అత్తాకోడళ్లే ఉన్నారనుకోవద్దు. అయినా సరదాగా చూసేవారూ ఉన్నారు. కాకపోతే దానికన్నా ప్రమా దం ఏమంటే సీరియళ్లు చూడటం అంటువ్యాధిగా మారడం. ఆ వేళకు బంధువు వచ్చినా పగవాడిగా అనిపిస్తాడు. లేదా తన పిల్లలో, భర్తనో క్రికెట్ చూడాలని రిమోట్ ఇవ్వమంటే… వారి మీద వీరికి వచ్చే కోపం అంతా ఇంతా కాదు. ఇలాంటి వారి సంఖ్య ఎక్కువవుతున్నది. టీవీ చానళ్లు ఏదో కాలక్షేపం కోసం హింసా ప్రవృత్తి ఉన్న సీరియళ్లను తీస్తున్నాయిలే అని ఎవరికివారే ఉదాసీనంగా ఊరుకుంటే ఎలా? అటువంటి ఫార్ములాతో ఓ సీరియల్ విజయవంతమైందని అనుకోండి! మరో నిర్మాత అలాగే కుట్రలు నిండిన సీరియల్ తీసి దానికి రేటింగ్ పెరిగితే, మళ్లీ నేర ప్రవృత్తి ఉన్న మహిళలను కథా నాయికలుగా చేసి మరో సీరియల్ తీస్తారు. అలా కాకుండా మంచి కథనాలతో ప్రబోధాత్మకంగా, వినోదాత్మకంగా, టీవీ ముందు కొంత సమయం గడిపినా ఏదో ఒకటి నేర్చుకోవడమో, తెలుసుకునేలా సీరియళ్లు ఉండాలి. అప్పుడే మానసిక ఆందోళనలు కలగకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.
– రంగరాజు పద్మజ 99897 58144