‘నా అంతరంగపు ఆకాశం నిండా శ్రావణార్ద్ర మేఘ పంక్తిలా సానుభూతి నిండుకుంటుంది’ అంటాడు మల్లావఝల సదాశివుడు. కవి హృదయం వానకాలం మబ్బులా, కవి కలం వజ్రాయుధంలా ఉండాలి. చిత్త ద్రవీభవన స్థితి నుంచే నిజమైన సృజన మొలకెత్తుతుంది. అప్పుడే కవి నిత్య స్పందనాస్పద హృదయుడై గొప్ప కవిత్వాన్ని వాగ్దానం చేస్తాడు. పీడిత జనుల మూకీభాష్పాలకు గొంతునిచ్చి వేదనాభరిత జీవితాలను ఊరడిస్తాడు. విషాదాల నిశీధుల్లో అక్షర ఉషోదయమై ప్రభాసిస్తాడు.
‘పర్జన్యం గుండె పితికి అగ్నికీలలనూ, వరుణ ధారలనూ అస్ర్తాలుగా తెచ్చింది నేన నా ఆగ్నేయా అస్త్రం పరాన్నభుక్కుల్ని దహించివేస్తుంది నా వరుణ ధార పగర చితాభస్మ రాసుల్ని కడిగివేస్తుంది’
అని తన కవితా ఎజెండాను ప్రకటించి, ఈ ఎరుకతోనే నిత్యం ప్రయాణించిన ప్రజాకవి మల్లవఝల సదాశివుడు. కోల్ బెల్ట్ ప్రాంతంలో కోటిగొంతుల విప్లవ సైరన్లా, గౌతమీ తీరంలో కవన గోదావరిలా ప్రతిధ్వనించాడు. వేన వేల మెగావాట్ల విద్యుత్ శక్తిని కవిత్వంలో దట్టించి సామాజిక విముక్తి గీతాలను ఆలపించాడు. ‘తలాపున పారుతుంది గోదారి నీ చేను నీ చెలుక ఎడారి’ అంటూ తెలంగాణ ప్రజల జల దుఃఖాన్ని ‘ఏమున్నదక్కో! ఏమున్నదక్క! ముల్లె సదురుకున్న, ఎల్లి పోతావున్న ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ వలస బతుకుల వలపోతను గానం చేశాడు.
‘ఇది నా తెలంగాణ మణులు దొంగిలించబడ్డ మాణిక్య వీణ’ అంటూ భంగపడిన నేల ఆర్తిని అక్షరాలా వినిపించాడు ‘నా బీజాక్షరాలు ఓం హ్రీం క్లీం కాదు కొంరం భీం’ అంటూ ప్రజా పోరాటాల కేంద్రంగా ప్రత్యామ్నాయ అధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించాడు. సదాశివుడి జీవన సాహిత్య ప్రస్థానం గురించి పి చంద్ ‘తలాపున పారే పాట’ 2018 పేరుతో పుస్తకం వెలువడేవరకు ఈ కవి సాహిత్యం గురించి అంతగా ఎవరికీ పరిచయం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మురుమూర్ గ్రామంలో వెంకటకిష్టయ్య, లక్ష్మీనరసమ్మ దంపతులకు 1945, సెప్టెంబర్ 2న సదాశివుడు జన్మించాడు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సదాశివుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించాడు. వర్గ కుల సమాజంలో కండ్ల ముందు రగులుతున్న అన్యాయాలను, అక్రమాలను సహించలేక, ఆగ్రహ భార్గవుడై అరణ్యవాసం చేసి, మళ్లీ జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. కారాగార నిర్బంధాలను లెక్కచేయకుండా, రాజ్యం సాగించే దౌర్జన్యానికి వ్యతిరేకంగా కలబడి నిలబడి పోరుచేశాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిబద్ధుడైన కార్యకర్తలా సదాశివుడు ప్రత్యేక రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పరిశ్రమించాడు. ప్రజా నాయకుడిగా, గాయకుడిగా సదాశివుడు ముందుకుసాగాడు.
దళిత ఆత్మగౌరవ పోరాటాల నేపథ్యంలో అస్తిత్వ ఉద్యమాల జాడలో కులవివక్షకు వ్యతిరేకంగా తన గ్రామ పరిసర ప్రాంతాల్లోని మాల మాదిగలను చైతన్యపరిచాడు. వారికి దేవాలయ ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్ష చేసి, నిష్టాగరిష్టులైన పండితుల ఆగ్రహానికి గురయ్యాడు. బ్రాహ్మణ కులం నుంచి బహిష్కరిస్తామని బెదిరించినా భయపడకుండా కుల నిర్మూలనా ధ్యేయంతో వెలివాడల విముక్తి దిశగా సదాశివుడు తన కార్యాచరణను మలుచుకున్నాడు. అప్పు చేసి మరీ గోదావరిఖనిలో దళిత సాహిత్య సదస్సులు నిర్వహించాడు. విప్లవ, స్త్రీవాద, దళిత, తెలంగాణ ఉద్యమాల ఆశయాల పథంలో సదాశివుడు ప్రభావశీలమైన ప్రజా సాహిత్యాన్ని సృష్టించాడు. ‘ఎర్రకుంకుమ’ పాటల సంకలనం 2003 ‘సైరన్’ వచన కవితా సంపుటి 2005లో వెలువరించి విప్లవకవిగా మన్ననలను అందుకున్నాడు. రాశిలో తక్కువైనప్పటికీ వాసిలో మిగతా విప్లవ కవులకు తీసిపోని విధంగా శక్తివంతమైన కవిత్వం రాశాడు. స్వాతంత్య్ర పోరాటం తీవ్రతరమైనప్పుడు పుట్టిన సదాశివుడు, మలిదశ తెలంగాణ పోరాటం బలోపేతమవుతున్న సందర్భంలో 2005 నవంబర్ 25న కన్నుమూశాడు.
సదాశివుడి కవిత్వంలో విప్లవ స్పృహతో పాటు దళిత సాహిత్య స్ఫూర్తి కనిపిస్తుంది. దళిత కవిత్వంలోని భావతీవ్రత ఈ కవి కవిత్వంలో వ్యక్తం కావడం విశేషంగా భావించవచ్చు. దళిత సంఘీభావ సాహిత్య దృష్టితో సదాశివుడి కవిత్వాన్ని విశ్లేషించవలసిన అవసరమున్నది. కులాధిపత్యం, మతాహంకారం వల్ల సంభవించే సామాజిక ప్రమాదాల గురించి తన కవిత్వంలో సదాశివుడు ప్రగాఢంగా విశ్లేషించాడు. ‘నాలుగు తలల హైందవ నాగరాజు నీడలో/ వెలివేతల తలతీతల మతోన్మాద క్రీడలో నా జాతి నలిగి నలిగి నెత్తురోడుతుంది (రాం రాం)’ అంటూ దళిత అస్తిత్వ సంఘర్షణను అక్షరబద్ధం చేశాడు. ‘శివ కేశవుల పేరుతో ప్రాణ దీపాలార్పిందని, బౌద్ధా రామాలను కూల్చిందని, ప్రార్థనా మందిరాల గుండెల్లో పలుగూ పారా దించిందని, నెలవంకను నెత్తుటేర్లలో ముంచిదని’ నాటి నుంచి నేటివరకు చారిత్రాత్మకంగా మతం రగిలిస్తున్న హింసాకాండను ఈ కవి తేటతెల్లం చేశాడు.
‘శంబూకుడి తలలకూ/ ఏకలవ్యుడి వేళ్ళకూ మరిగి మృగత్వమై విస్తరిస్తుందని, మతమా! నీకు నాకూ కుదరదు రాం రాం’ అంటూ మత దురహంకారాన్ని హెచ్చరించాడు. మతం జనహితం కావాలని సదాశివుడు అభిలషించాడు. ప్రగతి గురించి తెలుసుకోకుండా జాతికి పట్టిన దుమ్ము దులుపుకోకుండా ‘వంచకులందరూ పంచములని’ ముద్ర వేశారని కవి ఆక్షేపించాడు. దళితుల్లో వెల్లువెత్తుతున్న ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని కూడా సదాశివుడు సమర్థవంతంగా కవిత్వీకరించాడు. తమ అసమాన శ్రమైక జీవనంతో సమాజానికి సంపదలు చేకూర్చిపెట్టే అణగారినవర్గాలే దేశ మాతలు, దేశ పితలని, నాగరికతను, సంస్కృతిని నిర్మించిన దళిత బహుజనులే దేశానికి ఊపిరి అని సదాశివుడు సమున్నతంగా చాటిచెప్పాడు.
దండోరా ఉద్యమ నేపథ్యంలో మాదిగల నిరంతర శ్రమతత్త్వాన్ని వారిపై సాగుతున్న అణచివేత వైఖరిని ‘ఎన్నాళ్లు ఈ వెలివేత ఎన్నాళ్లు వలపోత’ అనే పాటలో చిత్రించాడు.
‘జాంబవీయ తాత్త్విక ధార అందించిన వారసత్వం/ వెలిగించిన మానవత్వం మనువాద బలిపీఠానికి ఎన్నాళ్లు బలికావాలని?’ సదాశివుడు ప్రశ్నించాడు.
‘గిరిజన గూడేనికి తపోభంగం చేశారో ఖబర్దార్’ / అడవి బిడ్డల హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాల వైఖరిని కార్పొరేట్ శక్తుల కపట వ్యూహాలను ధిక్కరించాడు. ‘రెక్కతెగిన ఎర్ర పావురం’ వామపక్ష వాదుల పరిమితులను తెలియజేశాడు. ‘మన అరుణారుణ మాగాణపు వరికంకి /చీడపీడలకు చిక్కి నేలకొరిగిందని’ తాను ఎదిగివచ్చిన రాజకీయాలను నిజాయితీగా విమర్శించాడు. ‘బుల్డోజర్ పాదాలు ప్రొక్లెయినర్ హస్తాలు మనిషికి మొలుచుకొస్తున్నాయని, ముక్కోటి జీవరాసుల చుట్టరికాన్ని తుత్తునియలు చేస్తున్నాడని పర్యావరణ సోయితో సదాశివుడు ఆరోపించాడు.
వస్తు రూపాలను అనుసరించి తన కవిత్వంలో సదాశివుడు ఔచితీమంతమైన భాషను ప్రయోగించాడు. ‘రుణగ్రస్థ క్షుదాక్షుభిత గాత్రులు’, ‘చలత్ చమూతరంగాలు’, ‘నగ్న భగ్న భయోద్విగ్న సంస్కృతి’, ‘కవన కేదారాలు’, ‘జ్వలితకృపాణాలు’, ‘కరాళ నర్తనశాల’ లాంటి సంస్కృత సమాసబంధురమైన పద బంధాలను వచన కవిత్వంలో అక్కడక్కడా ప్రయోగించినా సదాశివుడు పాటల్లో మాత్రం సామాన్య జన వ్యవహారానికి పెద్దపీట వేశాడు. అచ్చతెలుగు, తెలంగాణ నుడికారాలతో, పలుకుబడులతో, తన పాటలకు కొత్త వన్నెలద్దాడు. మల్లావఝల సదాశివుడి కవిత్వం ఈ కాలానికి అవసరమైన తాత్త్విక ఉత్తేజాన్ని అందిస్తుంది.
– డాక్టర్ కోయి కోటేశ్వరరావు 94404 80274