ధనుష్టంకారం
కూలుతున్న చెట్ల మధ్య నెమళ్ల, జింకల ఆర్తనాదాలు. గూడు కూలిన పిట్టలు చెల్లాచెదురైన బీభత్స భయానక దృశ్యం. పచ్చదనానికి బుల్డోజర్ల చెదలు. జేసీబీ చక్రాల ఉక్కుపట్టీల్లో చిక్కుకున్న జింకపిల్ల కళేబరం సాక్షిగా జరుగుతున్న ప్రకృతి హననం. పర్యావరణ విధ్వంసం. నగరం మధ్యలో వెలుగుతున్న ఆకుపచ్చని దీపాన్ని ఆర్పాలన్న సర్కారు ఆత్రం. నగరజీవికి కాలుష్యం నుంచి ఊరటనిచ్చే ఆకుపచ్చని ఊపిరితిత్తులను ఛిద్రం చేయాలని దూకుడు. చిన్న మొక్కయిన నాటని చేతులు పెద్ద అడవినే పెరికి కుప్పలు పోస్తున్నాయి. హరితావరణంపైకి గొడ్డళ్లు విసురుతున్నాయి. దివాళాకోరు భూమి అమ్మకాల కోసం దిక్కుమాలిన వేలానికి ఉరుకులాడుతున్న సర్కారుపై కలాల గర్జన… న్యాయస్థానం చెర్నాకోల చరుపులతో బుల్డోజర్లలో తర్జనభర్జన…
నా మెలకువ నెమళ్ల ఆట
నా కల.. జింకల తోట
గడ్డిపరకా మహావృక్షం పిట్టపాటా
తల్లి హరితాంబర చేలాంచలాలతో
బిడ్డల దోబూచులాట
అక్షరం కడుపులో నేను
అక్షరం చుట్టూ అడవి
నేను విద్యారణ్యంలో గిరిజనుణ్ణి
హఠాత్తుగా అర్ధరాత్రి నా కుటీరంలోకి
జేసీబీల వేషంలో డజన్ల కొద్దీ యుద్ధట్యాంకర్లు
శత్రుదేశంలోకి చొరబడినట్లుగా దురాక్రమణ దాడి
ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటుపోలేక
చెట్టూ పుట్టా ఆక్రందనలు.. నెత్తురోడే నెమళ్ల క్రీంకారాలు
యుద్ధం నాతో కాదట… చెట్లతో నట
యుద్ధం నాతో కాదట.. నా హరిత స్వప్నంతో నట
కావాల్సింది నేను కాదట
నేను నిలబడిన నేలంట
నాకు తెలుసీ విధ్వంస క్రతువు దేనికోసమో
లాఠీ జేసీబీ తంత్రాల ఆంతర్యమేమిటో
మీ చీకటి కుతంత్రాల్ని ధిక్కరించే మానవ వృక్షాన్ని నేను
లాఠీలతో బాదినా, బూటు కాళ్లతో తొక్కినా
మీరు నేల కూల్చిన చెట్లు మనుషులై లేచినట్లు
మీ యుద్ధ శకటాలను ముట్టడించి ధర్నా చేస్తాను
నోరులేని చెట్లు చేసే నినాదాన్నవుతాను
చెట్టూ నేలా నేనై పిడికిలి బిగిస్తాను
అడవి గర్జనలు ప్రతిధ్వనిస్తాను
జమ్మిచెట్టు సాక్షిగా
నగరారణ్యంలో ఆదివాసినై ధనుష్టంకారం చేస్తాను.
– వసీరా