ఒక సామాన్యుడికి ఇల్లు లేదా స్థలం అంటే కేవలం నాలుగు సరిహద్దుల భూమి కాదు. జీవితకాల శ్రమ, భవిష్యత్తు కలల సమాహారం. చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజులు, మున్సిపల్ పన్ను రసీదులు, ప్రభుత్వమిచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నా.. ఒక్కసారిగా మీ ఆస్తిని అమ్మడానికి కానీ, బ్యాంకులో తనఖా పెట్టడానికి కానీ వీల్లేదని చెప్తే? ఆ యజమాని గుండెలు ఒక్కసారిగా గుభేల్ మంటాయి. ‘సెక్షన్ 22-A నిషేధిత జాబితా’ రూపంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పట్టాదారులకు ఇప్పుడు సరిగ్గా ఇలాంటి విపత్తే ఎదురవుతున్నది.
ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్ భూము లు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. రిజిస్ట్రేషన్ల చట్టంలోని 22-A నిబంధన ఉద్దేశం కూడా అదే. ప్రజా ఆస్తులను కాపాడటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, ఆ రక్షణ కవచం అమాయక పట్టాదారుల మెడకు ఉచ్చుగా మారడమే అసలు విషాదం. ఒక సర్వే నంబరులో వంద ఎకరాల భూమి ఉండి, అందులో ప్రభుత్వానికి కేవలం పది ఎకరాలతోనే సంబంధం ఉన్నప్పుడు.. అధికారులు సులువు కోసం ఆ సర్వే నంబరు మొత్తాన్నీ 22-A పరిధిలోకి నెట్టేస్తున్నారు. ఫలితంగా, అదే నంబరులో మిగిలిన 90 ఎకరాల్లో నిబంధనల ప్రకారం ఇండ్లు కట్టుకుని, ఏండ్ల తరబడి నివసిస్తున్న వందలాది కుటుంబాల ఆస్తి హక్కులు ఒక్క కలంపోటుతో నిలిచిపోతున్నాయి. తప్పుడు రికార్డులు రూపొందించిన యంత్రాంగం వైపు ఉంటే.. తన ఆస్తి సరైనదేనని నిరూపించుకోవడానికి కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి మాత్రం ప్రజలదే అవుతున్నది.
‘భూ భారతి’ పోర్టల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, టోల్‌ఫ్రీ నంబర్ల ఏర్పాటు, ఉన్నత స్థాయి కమిటీల ప్రకటనలు మంచి పరిణామాలే అయినా.. సమస్యను మూలాల నుంచి సరిదిద్దకపోతే అవి తాత్కాలిక సాంత్వనలకే పరిమితమవుతాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి పాలకులు రాజకీయ ఆరోపణలను పక్కనపెట్టి సమగ్ర కార్యాచరణను అమలు చేయాలి. వివాదం ఉన్న భాగాన్ని శాస్త్రీయంగా గుర్తించి, కేవలం ఆ నిర్దిష్ట విస్తీర్ణాన్ని మాత్రమే బ్లాక్ చేయాలి. వివాదం లేని ప్రైవేట్ ఆస్తులకు తక్ష ణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. డిజిటల్ పారదర్శకత: ఏ ప్రాతిపదికన ఒక సర్వే నంబరును 22-A లో చేర్చారో ఆ రికార్డులు, ఉత్తర్వులు సామాన్యుడికి అర్థమయ్యేలా ఆన్లైన్లో బహిర్గతం చేయాలి. ప్రైవేట్ ఆస్తులపై వచ్చిన ఫిర్యాదులను నెలాఖరులోగా పరిష్కరించి, బాధితులకు తక్షణ విముక్తి కల్పించే చట్టబద్ధమైన బాధ్యతను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఎంత బాధ్యతో, సామాన్యుడి కష్టార్జితమైన ప్రైవేట్ ఆస్తిని కాపాడటం కూడా అంతే ముఖ్యం. నిషేధాల కన్నా నిష్పాక్షిక విచారణ, అస్పష్టతల కన్నా పారదర్శకత, జాప్యం కన్నా వేగవంతమైన న్యాయమే నేడు నగర ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన నిజమైన భరోసా.