అప్పుడు
గిప్పుడైతే
బాగుండనిపిస్తది
అప్పుడంటే
నా చిన్నతనం
రెండు అంగిలాగుల జత
ఒక ఇస్కుల్ డ్రెస్
మెడిమెలు సమ్సిన
లబ్బర్ చెప్పులు జత
ఐనగాని.. చింతే లేకుండే
మోతెబరి రైతులం గాకున్న
ఉన్న చారెడు భూమిల్నే
ఇంటి దినుసుల్ని పండించుకొని
ఇగురంతో బతికేటోళ్ళం
దసరా మహా సరదాగా
జతగాళ్లతోని జరుపుకొనేటోళ్ళం
బతుకమ్మని జేసెటోళ్లకు
వాగు వంకలల్ల తిరిగి
తీరు తీర్ల పూవులు తెచ్చి
మోత్కాకులు గుట్టిచ్చేటోళ్ళం
ఒగరి భుజాన ఒగరు
చేతులేస్కొని.. జమి జేబ్ల నింపుకొని
ఊరంతా దిరుక్కుంట
వరసైనోళ్ళ కాళ్ళు మొక్కుకుంట
దీవెనార్తులందుకొని
అందరితోని అలైబలై తీస్కునేటోళ్ళం
ఇంట్ల సుట్టాలను అర్సుకొని
మా బల్గమంతా
ఇస్తారాకుల బంతి భోజనాలు
జేసేటోళ్ళం
ఇప్పుడు.. యాదానికి
ఇబ్బంది లేకున్నా
అల్మోర్ నిండా బట్టలున్నా
ఇంటి ముంగల కారున్నా
బందు బల్గం ఎవరొస్తలేరు
ఎవరు పిలుస్తలేరు
పండుగొచ్చిందంటే
పది మంది గూడే
పద్ధతి కరువైంది
హెచ్చుతగ్గుల్లేని
ప్రేమలు తక్కువైనయ్
బంతిభోజనాల జాడె పోయింది
జతగాళ్ళు
ఎవ్వని పన్ల వాళ్ళు
ఏదో కల్సినమంటే కల్సినం
పైసామే పరమాత్మ
అన్నట్లు.. వాట్సప్ల శుభాకాంక్షల చక్కర్లు
ఎంతుంటే ఏంది
ఎంత దగ్గరుంటే ఏంది
మనసు దగ్గరితనం కరువైనంక
అప్పుడు గిప్పుడైతే
బాగుండనిపిస్తుంది..
– జె.రామకృష్ణరాజు 95504 53224