ఎండ నీడను జూసే
మా అమ్మమ్మ పొద్దు చెప్పేది…
ఓ పక్క పొయ్యికాడ అన్నమండుకుంటనే
ఇంకో పక్క సల్ల జేస్కచ్చేది…
అంటింట్ల తడ్కకు ఎనుకులాడకుండా
సూది గుచ్చిపెట్టేది…
గారె పుల్లకు అప్పాలు గుచ్చితే
సేతి గాజులేసినట్టే ఉండే
మాపటించి పెనం మీదేసిన
జొన్నరొట్టెను తిప్పుతాంటే
సందమామ తీరే అగుపడేది
ఇంట్ల గంపెడు పంజ్జేసుకుంటనే
కండ్లన్నీ ఎడ్ల మీద, కోళ్లమీదేసేది..
ఏ డబ్బా మూత్తెన సరాతం
వట్టి లటుక్కును తీసేది..
గంపల, అంచెల, చాట్ల సంసారం
మా అమ్మమ్మది..
అవి మందింట్లకు పోతే రావని
గుర్తుకు ఎర్రసుక్క రాసేది..
ఆ ఇంటి పాతాళగంగే ఊళ్ళే
అందరి బాయిల్ల తానం జేశచ్చేది
కుంచం బిందె ఆ వాడంత
గిర్ర గిర్ర తిరిగచ్చేది..
కొప్పెర పొయ్యికాడుంటే..
ఛత్రీ శిలుక్కొయ్యకుండాలే..
పంచపాల దిగుట్లుంటే
కుంకుంభరణి బొట్టు పెట్టెలుండాలె
శిబ్బి తనబ్బిలుంటే..
సోల బియ్యపు సంచిలేసేది..
ముంత ఇంటెన్క నూతి పొంటుంటే..
ముల్లుకట్టె కొట్టంలుండేది
అట్క మీదున్న ఇత్తడి గంగాళం
వాళ్ళవ్వగారిచ్చిన సొమ్మని ముర్షేది
ఆరు దూలాల ఇల్లున్న సుతం
తాతిపరంగ పంజ్జేస్కోని..
నిమ్మలంగ తిని పన్న బతుకులు..
సద్ది కట్టిన సేతులకు పనివంతురాలని పేరత్తే..
గట్కతిన్న పెయ్యికి తొంబై ఏండ్లు నిండే…
– తుమ్మల కల్పన రెడ్డి 9640462142