బాల్యంలోకి వెళ్లిరావాలనుంది
కాని ఇప్పుడక్కడ
అమ్మ ఉండదు.
చిన్నప్పటి ఇంటిలో
నిద్రపోవాలని కోరిక
కాని అప్పటి స్వప్నాలు
తూనీగల్లా ఎగరవు.
నాటి స్కూల్ మైదానంలో
ఫుట్బాల్ ఆడాలని వుంది
ఇప్పుడా గ్రౌండే లేదు.
నేను తన్నిన బంతి
కాలాన్ని చీల్చుకుంటూ ఎటుమాయమైందో!
అప్పటి స్నేహితుల్ని
ఒక్కచోట కలవాలని వుంది
కాని తెగిన ముత్యాలహారం కోసం
ఎన్ని దేశాలు వెతకాలో!
జారుడుబండ ఎక్కి
గతంలోకి జారిపోవాలని వుంది
ఇవాళ హృదయం
రెండు ముక్కలుగా కొట్టుకుంటుంది.
నా అవస్థ చూసి
పక్కనే వున్న మా మనుమడు నవ్వుతున్నాడు
తాతా!
జీవితంలో యూటర్న్ ఉండదు
నువ్వే చెప్పావు అన్నాడు.
– డాక్టర్ ఎన్.గోపి