చాలా విషయాలు నాకు
తెలియనివి తెలిసిన క్షణాన
భయంతో కూడిన
విభ్రాంతి కలుగుతుంది
అరికాళ్లకు ముల్లు గుచ్చుకుంటే
కళ్లకు కన్నీళ్లెందుకో అర్థం కాదు
కారణం
కాళ్ళూ కళ్ళూ ఒకే శరీరం యొక్క
అనుసంధిత (Intergal)
అవయవాలు కావడమేనా
అంటే ఒక మనిషి యొక్క నొప్పిని
మరో మనిషి అనుభూతించి
పంచుకోవాలంటే
వాళ్లు ఒకే శరీర భాగాల్లా
అనుసంధానం కావాలి కదా-
నొప్పి, బాధ, దుఃఖం
అందరూ పంచుకుంటూ
సుఖ సంతోషాలను కూడా
సమపర్చుకుంటూ
‘పంచుకోవడం’ అనే విస్తృత సూత్రం
ప్రపంచవ్యాప్తమై పరిఢవిల్లితే
మనిషి మాధవుడౌతాడా-మనిషి ఒకే
కుటుంబమై, గణజనమై.. జనరాజ్యమై
పరిణామ నియమం.. ఎంత సరళతరమో
గాలిలో ఊపిరి.. గాలిలో మనం..
మనతో ‘అందరి’ గాలి
కన్నీళ్ళు కన్నీళ్ళను ఆకర్షించి
ద్రవింపజేయడం.. ఒక పాఠమే కదా
కన్నీళ్లకు ఉనికి ఉంటుందా
చెట్టు కొమ్మను ఎంత చెక్కినా
పుట్టబోయే చిగుళ్ల ఆనవాళ్లు కనిపిస్తాయా
అనుభవాలు ముద్రలు ముద్రలుగా
వెలిసి గోడల మీది ఎండిపోయిన
పాన్ మరకల వలె
పిడికెడు గుండెలపై పాఠాలుగా
మిగిలి శాసిస్తున్నపుడు
మనిషి సుత్తె దెబ్బలు తినీ తినీ మిగిలిన
సొట్టలు పడ్డ రాతెండి గిన్నె ఐ
కిందపడి భళ్ళున శబ్దించి
జరజరా జరజరా బురదలోకి పరుగు
లోయల్లోనో, ఎడారి ఇసుకలోనో,
మురికి కూపంలోనో
కూరుకుపోవడం Blockade..
System derailed
మనిషికి దిక్కుతోచకో,
దిక్కులేకో బిక్కుబిక్కున
ఒక వినిర్మాణ ఆంతరిక
శిథిలతలో శిలౌతున్న స్థితి
ఒక Let-Out కావాలె..
నిశ్వసించుటకు
అరే… ఒక్క క్షణం నిలబడి
అమాయకపు పశువుల కళ్ళలోకి చూడు
కుక్క ప్రేమమయ చూపుల్లోకి చూడు..
ఒట్టి శుద్ధ అమాయకత్వం
పిచ్చుకల కిచకిచలను వింటూ
అడవి చెట్లలోకి అదృశ్యించు
వీటన్నింటిలో గుప్తమై ఉన్న ‘ప్రాణం’
ఎక్కడుందో తెలియదు
కానీ వాటిలోనే ఎక్కడో
చెట్లలోనే ఉన్నట్టు తెలుస్తుంది-
అప్పుడు మొస పోసుకుంటూ
పరుగెత్తుకుని పరుగెత్తుకుని
రైల్వే ప్లాట్‌ఫాంపైకి ఉరికొస్తావు
ఒంటి నిండా దుఃఖంతో
నువ్వు వీడ్కోలు చెప్పవలసిన రైలు
వెళ్లిపోతూ కనిపిస్తుంది దూరంగా
నువ్వపుడు కొంత కరుణవై.. కొంత కాంతివై.. కొన్ని వర్షపు చినుకులవై
ఒట్టి స్థాణువువై నిలబడిపోతావు
లోపల ఒక ఇసుక తుఫాన్
గర్జిస్తూ భీకరంగా-
ఏది చీకటి.. ఏది వెలుతురు-
ఏది ఉన్నది.. ఏది లేనిది
ఓ మహర్షీ.. ఓ మహాత్మా
-రామా
చంద్రమౌళి
93901 09993