ఆధునిక కథా వికాసంలో అనేక మలుపులున్నాయి. సంఘ సంస్కరణ దృష్టితో కథ మొదలు ప్రచారానికి వచ్చినా, వెంట వెంటనే వివిధ లక్ష్యాలకు అది వాహికగా మారింది. మధ్యతరగతి జీవితాల సున్నితత్వానికి సంబంధించిన వస్తువులను మాత్రమే కథలుగా భావించే దశకాలు కొన్ని గడిచిపోయాయి. ఆయా దశకాలలో మధ్యతరగతి, ఉద్యోగ జీవితాల్లోని సమస్యలు, ఆ జీవితాల వల్ల ఏర్పడిన కుటుంబ వ్యవహారాల ఘర్షణ ప్రధాన కథావస్తువుగా చాలా కాలం నడిచింది. అస్తిత్వ ఉద్యమాలు ఆరంభమయ్యాక కథ ఆయా ఉద్యమాలకు అలంబనగా కూడా మారింది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో స్థానీయ జీవిత చిత్రణ, స్థానిక భాషా వినియోగం గౌరవప్రదంగా మారాయి. అయితే ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ చాలామంది ఆ వెసులుబాటును సరిగ్గా వినియోగించుకోగలిగారని మాత్రం చెప్పలేం. కానీ, ‘బర్కతి’ కథల సంపుటిలో సాగర్ల సత్తయ్య ఈ రెండు అంశాలను చాలా సాధికారికంగా వినియోగించుకున్నారు.
వస్తువు రీత్యా, భాషా వినిమయం రీత్యా, కథా నిర్వహణ రీత్యా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ప్రాంత కథల వస్తువుకు, రూపానికి, ఒక సరైన ఉదాహరణ సురవరం ప్రతాపరెడ్డి కథ ‘గ్యారా కద్దు-బారా కొత్వాల్’. మరొక ఉదాహరణ కాళోజీ నారాయణరావు కథ ‘తెలియక ప్రేమ-తెలిసి ద్వేషం’.
ఈ రెండు కథల్లో విస్తారమైన వస్తువు, స్థానిక వస్తువు, అభివ్యక్తిలో అత్యంత సూటిదనం గమనించవచ్చు. సాగర్ల సత్తయ్య కథలు ఈ రెండు కథలకు ఒక కొనసాగింపుగా చెప్పొచ్చు. ఎందుకంటే సత్తయ్య ఈ 15 కథల్లో తెలంగాణ దిగువ మధ్యతరగతి జన జీవితమే వస్తువు.
భాష అత్యంత సరళంగా నల్లగొండ జిల్లా ప్రజల వ్యవహారంలో ఉన్నది. వస్తువు మాత్రం ఒకే అంశం దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల కథ నిడివి తక్కువగా ఉండి పాఠకుడిని కొన్ని నిమిషాల్లో దాని వెంట కళ్లను పరుగు పెట్టిస్తుంది. అలా చూసినప్పుడు ఒక్క వస్తు విస్తారంలో తప్ప మిగిలిన అన్ని లక్షణాలతో ఆ రెండు కథలకు సరైన వారసత్వంగా ఈ కథలను సత్తయ్య కొనసాగించారని చెప్పవచ్చు.
తెలంగాణ కథలకు పెట్టిన శీర్షికలు కూడా ఇక్కడి భాషలోని నుడికారం నుంచి ఉద్భవించినవే కాకుండా సజీవమైన సాంస్కృతిక రూపాలు. ‘ఊర బోనాలు’, ‘బర్కతి’, ‘తశ్వ’, ‘ఎనుగర్ర’, ‘సారె’, ‘మరుగుమందు’ లాంటి పేర్లు ప్రత్యేకంగా తెలంగాణ పాఠకులకు ఏదో భావనను స్ఫురింపజేయగలిగే సంకేత పదాలు.
‘నర్సమ్మ-అంజయ్య’ల బిడ్డ ‘సరిత’ను 10వ తరగతిలోనే చదువు మాన్పించి పెండ్లి చేస్తే అల్లుడు నరేష్ హింసిస్తాడు. ఆ హింస వల్ల గర్భస్రావమై పుట్టింటికి వస్తుంది సరిత. ఈ నేపథ్యంలోనే రహస్యంగా ఓపెన్ ఇంటర్ రాయించి టీటీసీకి సంసిద్ధం చేసిన హెడ్మాస్టర్ శ్రీనివాసరెడ్డి, అది ఆమె వ్యక్తిత్వ నిర్మాణానికి సహకరిస్తుంది కానీ, అదొక్కటే సరిపోదని సరిత భర్త మీద కేసు పెట్టమని కూడా సూచించే పరిష్కారం కథలో ఉన్నందున ఈ కథకు ‘పరిష్కారం’ అని పేరు పెట్టాడు రచయిత. అలా కథ పేరు ఎంతో ఔచిత్యంతో కుదిరింది. మిగిలిన పేర్లు కూడా అంతే ఔచిత్యంతో ఉన్నాయి.
మాల మాదిగల బోనాలను మధ్యాహ్నం తీయించి మిగిలిన వారి ఊర బోనాలను సాయంత్రం తీయించడంలోని అసంబద్ధత హైదరాబాద్ నుంచి వచ్చిన అవినాష్ అనే కుర్రాడికి అర్థమవుతుంది తప్ప ఊరోళ్లకు అర్థం కాకపోవడం అన్కాన్షియస్గా అగ్రవర్ణ భావజాలానికి అలవాటు పడిన ఊరి వాతావరణాన్ని తెలిపే కథ ‘ఊర బోనాలు’. వీరయ్య శిగమూగి మల్లమ్మ వాళ్ల ఇంట్లో పండుగ చేస్తేనే ‘బర్కతి’ ఉంటుందని రకరకాల వ్యవహారాలు చేయించి లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టిస్తాడు. అయినా బర్కతి దక్కదు గానీ అప్పు మీద పడుతుంది ‘బర్కతి’ కథలో. ఇలా.. ‘బర్కతి’ పుస్తకంలోని కథలన్నింటిలో రచయిత చెప్పాలనుకున్న లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో కథల శీర్షికలు కూడా అంతే స్పష్టంగా ఉండటం సాగర్ల సత్తయ్య రచనలో గమనించదగిన అంశం.
నిఘంటువులకు ఎక్కదగిన స్థానిక భాషాపదాలు ఇందులో కొల్లలుగా వాడారు రచయిత. ‘కక్కబోసుడు’, ‘ఆర్కతికి రావు బర్కత్కి రావు’, ‘అడిగాయ బుడిగాయ మాటలు’ వంటి పదాలు కథా గమనానికి బలాన్ని చేకూర్చాయి. చాలా అరుదుగానైనా స్థానిక సామెతలను అర్థవంతంగా వాడారు. సరితను ఎవరో వచ్చి చూసిపోయినట్టుంది కదా! మళ్లీ ఏమైనా మాట్లాడిండ్రా’ అని పక్కింటి లచ్చమ్మ అడిగితే, నరసమ్మ ‘ఎవరన్నరే. ఈ లోకం చల్లగుండ. దిష్టి తాకింది అంటే, దిగదాగింది అంటరు’ అంటుంది. ఇట్లా సామెతలను ఉపయోగించడం కథా నిర్వహణలో కొత్త కాకపోయినా మట్టి పరిమళం ఉన్న సామెతలను సహజసిద్ధ సన్నివేశాలను కల్పించి ఉపయోగించడం మాత్రం సాగర్ల సత్తయ్య లాంటి మట్టి బిడ్డలకే సాధ్యం.
గతంలో పద్యాలను, విమర్శను పుస్తకంగా తెచ్చిన డాక్టర్ సాగర్ల సత్తయ్య తెచ్చిన మొదటి కథా సంపుటి ‘బర్కతి’. ఈ పుస్తకంలో తెలంగాణ బహుజన కుటుంబాల ఆచారవ్యవహారాలు, ఆశా నిరాశలు, విద్యాగంధం పట్ల పెరిగిన ఆసక్తిని అపురూపంగా చిత్రించాడు. ఉపాధ్యాయుడిగా ఆదర్శం అనేక సందర్భాల్లో కథల్లో ప్రయోగించబడింది. తన జీవితాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితులను మాత్రమే ఆధారం చేసుకొని ఎంత గొప్ప కథలను అల్లవచ్చో డాక్టర్ సాగర్ల సత్తయ్య ‘బర్కతి’ ద్వారా
నిరూపించారు.
– ఏనుగు నరసింహారెడ్డి 89788 69183