పోయిన ఆదివారం రాత్రి 11.24 నిమిషాలకు అమరేశం రాజేశ్వర శర్మ కన్నుమూశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రాజేశ్వర శర్మ గారి శిష్యకోటిలో నేనొకన్ని. ఆయన తన దారిని తానే నిర్మించుకొని, నలుగురికి సాహిత్యంలో దారిచూపిన దారిదీపం. ఆ మహానుభావుడు సంస్కృత, తెలుగు సాహిత్య వ్యాకరణాల వెలుగులను సాహితీ నేల మీద ప్రసరించిన దినపతి.
గురువుగారు తరగతి గదిలో బాల వ్యాకరణం పుస్తకం చేతిలో లేకుండా గంగా ప్రవాహంలా పాఠం చెప్తుంటే ఒక్క సూత్రం నేను ఆయన బోధ నా నదిలో మైమరిచి తడిచి ముద్దయ్యేవాన్ని. ఆయన వామనుడే గానీ వ్యాకరణం, పరిశోధనం, విమర్శనం, పాండిత్యంలో విశ్వరూపం చూపేవారు. ఆయన నాకొక గ్లామర్ హీరో. నేను ఆయనకు ఆవగింజంత సహాయ పడినవాన్ని కాదు.
సేవలు చేసినవాన్ని కాదు కానీ ఆయన పాడెను నా దుఃఖమే మోసింది. ఒక్కమారైనా పూలో, పండ్లో అర్పించలేక పోయాను కానీ నాలుగు గులాబీ పూలు అందరితో పాటు ఆయన పాదాల చెంత వేసిన దేహం నాది. నేను, రెంటాల, ఎస్వీ, మాలతి మరికొందరం ప్రియశిష్యులం. ఎంఏలో క్లాస్మేట్స్ అందరం సబ్జెక్ట్ టూర్లు వెళ్లినప్పుడు గోపాల కృష్ణారావు, ఇరివెంటి కృష్ణమూర్తి, అమరేశం రాజేశ్‌వర్మ శర్మ మా వెంట వచ్చేవారు. నేను పెద్ద గుడి గోపురం మీదికి పాకుతూ ఎక్కి సార్‌ను గట్టిగా పిలిస్తే అక్కడి నుంచి కింద పడిపోతానన్న ఆందోళనతో పిలిచిన మాటలు, చూపులు నాకెందుకో ఇప్పు డు జ్ఞాపకానికి వచ్చి కన్నీళ్లు తిరుగుతున్నాయి. గిరిజ సార్ కూతురు. నా క్లాస్మేట్. ఇప్పటికీ సార్కిచ్చిన గౌరవమే గిరిజకు ఇస్తూ వస్తున్నాను.
కామారెడ్డిలో సరస్వతి రాజలింగ సభాపతి గార్లకు 5.9.1930లో రాజేశ్వర శర్మ జన్మించారు. ఆయన భార్య పేరు నరసమాంబ. ఆయనకు సంతానం గిరిజ, ఉమాపతి రావు, వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు, భారతి. రాజేశ్వర శర్మ గారి సహాధ్యాయి పోలా కృష్ణమూర్తి, ఆయన వల్లే నాకు ఏకాగ్రత అబ్బిందని చెప్పుకున్నారు. శర్మ గారి చదువు కామారెడ్డిలోని చిన్న మల్లారెడ్డి పాఠశాల నుంచి ప్రారంభమై ఉస్మానియా విశ్వవిద్యాలయం దాకా సాగింది. జటావల్లభ పురుషోత్తం, ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వేంకటావధాని దాకా ఎందరెందరికో శిష్యరికం చేసి సంస్కృ త, తెలుగు భాషలు నేర్చుకున్నారు.
కామారెడ్డి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఆం ధ్ర భాషోపాధ్యాయులుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల దాకా ఆచార్యులుగా, డీన్‌గా, తెలుగు శాఖ అధ్యక్షులుగా వివిధ వృత్తిపరమైన పదవులు నిర్వహించారు. పదవీ విరమణ తర్వాత కూడా తొంభై నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా ఆంధ్ర దేశం నలుమూలల సంస్కృత, తెలుగు వ్యాకరణాలు బోధిస్తూనే పరలోకం వెళ్లిపోయారు.
రాజేశ్వర శర్మ గారి రచనలు ప్రధానంగా నన్నెచోడుని కవిత్వం, వేదం వెంకటరాయశాస్త్రి రూపక సమాలోచన, అహోబిల పండితీయాం ధ్ర వివరణము, వైకృత చంద్రికాంధ్ర వివరణ ము, ఆంధ్ర వ్యాకరణ వికాసము, వేదం వెంకటరాయ శాస్త్రి వ్యాఖ్యానాలు, చరిత్ర పుటలు, శ్రీసాయి సచ్చరిత్ర ముక్తావళి గేయ ప్రబంధ ము, గజ్జెల విస్తరి, ఆత్మ నివేదనం ఆదిపర్వం, ఆత్మ నివేదనం ఉద్యోగ పర్వంతో పాటు అనేక అముద్రిత గ్రంథాలు ఐదు దాకా ఉన్నాయి. వివిధ పత్రికలలో మరె న్నో వ్యాసాలు వచ్చాయి. పోతన భాగవత పంచశతికీ, స్మారక సంచికకు సంపాదకులు. కామారెడ్డిలోని ప్రాచ్య విద్యా పరిషత్తు స్థాపకుడు.
చరిత్ర పుటలు గొప్ప పరిశోధనా గ్రంథం. మా నిజామాబాద్ జిల్లా గురించి ఆయన ఎంతో చెప్పేవారు. బోధన్, ఇందూరు ఎప్పటినుంచీ ఉన్న వో రాజేశ్వర శర్మ గ్రంథం ద్వారానే తెలుసుకున్నాను. క్రీ.పూ. ఒకటి రెండు దశాబ్దాల మధ్యకాలంలో జైనముని రాసిన ‘దనభత్తి’ అనే ప్రాకృత గ్రంథం లో ‘పౌదనం’లో పోదనం-బోదనం-బోదన్గా మారిన తీరునూ ఋషభదేవుని రాజధాని బోధన్ అని రాజేశ్వర శర్మ గారు వ్యక్తీకరించినదే, పరిశోధించినదే ప్రథమ ప్రామాణికం. అలాగే ఇంద్రవర్మ నిర్మించిన నగరం ఇంద్రపు రి. ఆ ఇంద్రపురే నేటి ఇందూరు అని మొట్టమొదట చెప్పినవాడు అమరేశం రాజేశ్వరశర్మ గారు.
రాజేశ్వరశర్మ తొలినాళ్ళ నుంచే గొప్ప పండితుడు, విమర్శకుడు. ఆయన రాసిన కుమారసంభవ కావ్యవిమర్శ ఓ విధంగా సిద్ధాంత గ్రంథంగానే చెప్పాలి. నన్నెచోడుని జాను తెనుగునూ ఆనాటి భాషా స్థితిగతులు షష్ఠ్యంతాల వంటివి ఎన్నో విషయాలను పరిశోధించి చూపారు. కుమార సంభవము ప్రథమ ప్రబం ధం అన్నది కూడా శర్మ గారే. ఆరుద్ర గారు సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో అక్కడక్కడా తన కు ప్రామాణికం అనిపించినవి చెప్పాల్సి వస్తే రాజేశ్వర శర్మ గారినే ఉటంకించారు. ఆయన భాషా పాండిత్యానికీ, సాహిత్య విమర్శకు అహోబిల పండితీయాంధ్ర వివరణం గానీ గజ్జెల విస్తరిలోని పదౌచిత్యాలు నేడు భాషనభ్యసించే వారికి మణిపూసలే.
రాజేశ్వర శర్మ గారి ‘ఆంధ్ర వ్యాకరణ వికా సం’ రెండు సంపుటాలుగా ప్రచురితమైన ఉస్మానియా నుంచి వచ్చిన వ్యాకరణ సిద్ధాం త గ్రంథాలలో ఇదే ప్రామాణికం నేటికి. ఆయన ఇంటిపేరు వ్యాకరణం అనిపించేటం తటి గొప్ప గ్రంథం ఇది. విరామనెరుగని వినూత్న కృషి ఇందులో ఉంది. ఆత్మ నివేదనం ఆయన ఆత్మకథ. దాన్ని రెండు భాగాలుగా ప్రచురించారు. ఆత్మ నివేదన ఆదిపర్వం. ఆత్మ నివేదన ఉద్యోగపర్వం రాసి వెళ్లిపోయారు. విశ్రాంతి పర్వం రాయవలసి ఉండె. ఆయన అధ్యయన, ఉద్యోగాల ప్రస్థానాలు నేటి తరానికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. సాహిత్య సేద్యం చేసేవారికి ఆయన రచనలు వెన్నెముకగా నిలుస్తాయి.