Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash.
– Leonard Cohen
జీవితం బహురూపి. అది శాసిస్తుంది, దీవిస్తుంది, ఆడిస్తుంది, ఓడిస్తుంది, వెలిగిస్తుంది, గెలిపిస్తుంది. అలా జీవితపు బహుముఖాలను ఈ చిన్న బతుకులోనే చవిచూసే అదృష్టం దక్కించుకున్నాడు యాకూబ్. అందుకే అతడి కవిత్వం నిండైన జీవితానుభవంతో తొణికిసలాడుతుంది. అలాంటి అనుభవాలకు అక్షర రూపం ఇవ్వడాన్ని నిరంతర సాధనతో సాధ్యం చేసుకున్నాడు. అందుకే కవి యాకూబ్‌గా, బహుత్ ఖూబ్ యాకూబ్‌గా పరిణామం చెందాడు.
ఒకరికొకరం మనుషుల్లాగే పరిచయమయేంత వరకూ.. ‘కవిత్వం’ రాస్తూనే ఉంటానని ప్రతిన బూనుతూ అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట జ్ఞాపకాల ప్రవాహమై కవితావరణంలోకి ప్రవేశించాడు. అశాంతికి ఉన్న ‘లిపి’నీ, కన్నీటికి ఉన్న ‘భాష’నీ సొంతం చేసుకొని ‘జీవితమే కొలమానం’గా ముందుకు సాగిపోతున్నాడు. కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే ‘కవి’ అన్నారు. మరి కష్టజీవే కవి అయితే? ఆ కవిత్వం ఎంత సంపద్వంతంగా ఉంటుంది? ఎంత జీవంతో జవజవలాడుతుంది? అటువంటి కష్టజీవి యాకూబ్. తినడానికి సైతం తిండిలేని సందర్భాల్లో మాగిపోయిన పళ్లు తిని కడుపు నింపుకొన్నవాడు ఎలాంటి కలలు కంటాడు? ఇంకెలాంటి కవిత్వం రాస్తాడు? సరిగ్గా అలాంటి అక్షరాలనే ఆలింగనం చేసుకున్నాడు. ‘ప్రతి కూడలిలో ముడుపుల జాడల కోసం/ అరచేతుల్ని అక్కడక్కడ భిక్షాపాత్రలా అమరుస్తావు’ అంటూ శిథిలాల మాటున దాగిన శిశిర గాయాలను వెలికితీస్తాడు. యాకూబ్ కవిత్వానికి జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. భగభగలాడే ఆ జీవనరేఖల చేలాంచలాలు అతడి అక్షరాలు.
ఒక యూనియన్ ఆఫీసులో బాయ్‌గా పనిచేస్తూ, అర్ధాకలితో యవ్వన ప్రాదుర్భావ దినాలను గడుపుతూనే ‘సరిహద్దు రేఖ’ను చెరిపేసి, ‘ఎడతెగని ప్రయాణం’తో నదీమూలం లాంటి ‘ఇల్లు’ చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులో.. అవన్నీ అక్షరాల్లో అచ్చంగా ఒదిగిపోయాయి.
రారాపై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్, విమర్శపై ఉస్మానియాలో పీహెచ్డీ.. ఇవేనా? ఇంకా అనేక పుస్తకాలు, అభినందన సంచికలు, పలు సంకలనాలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించి తెలుగు సాహిత్యలోకం తలతిప్పి చూసేలా తన సత్తాను చాటుకున్నాడు. కింది నుంచి గబుక్కున లేచి, చొక్కా దులుపుకొని.. అందరి కళ్లముందూ నిలదొక్కుకుని గర్వంగా తలెత్తుకుని నిలుచున్నాడు. ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకున్నాడు. కవిత్వాన్ని అక్షరాలుగా, భావాలుగా మాత్రమే కాదు; ప్రేమగా కూడా ఆహ్వానించాడు. కవిత్వాన్నే జీవన సహచరిగా స్వీకరించాడు. శిలాలోలితతో కలిసి జీవన ప్రయాణాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, నెత్తి మీదకు ఒక గూడు సమకూర్చుకొని సమూహంలో సమున్నతంగా తలెత్తుకున్నాడు. మామూలు సామాజిక దృష్టితో చూస్తే అన్నివిధాలా జీవితంలో స్థిరపడినట్టే. కానీ, లోపలెప్పుడో దూరిన కవిత్వ పురుగు ఊరుకుంటుందా, తొలచకుండా?
There is a crack in everything, thats how the light gets in -Leonard Cohen
‘కవి సంగమం’ పేరుతో కొత్త కాంతిని ప్రసరింపజేయడానికి చిరుదివ్వెగా సిద్ధమయ్యాడు. తామరతంపరగా వెలిసే ఫేస్బుక్ పేజీలు, గ్రూపులకు భిన్నంగా దీక్షతో, పట్టుదలతో కవి సంగమం గ్రూపును ముందుకు తీసుకుపోయాడు. ఒకదానికొకటిగా అల్లుకుంటూ, కవులందరినీ బృందంలో కలుపుకుంటూ విస్తరించుకుంటూ సాగాడు. కవిత్వంపై వర్క్‌షాపులు నిర్వహించాడు. మూడు తరాల కవితా ప్రతినిధులతో కవి సమ్మేళనాలు ఏర్పాటుచేశాడు. కొత్త కవులను ప్రోత్సహిస్తూ కవితా సంకలనం వెలువరించాడు. అతడు ఇచ్చిన చేతిని ఆసరా చేసుకొని ఎంతోమంది కవులు నాలుగు అక్షరాలను నేర్చుకొని, తమ వాక్యాలపై నిలబడ్డారు. అంతవరకూ హైదరాబాద్ నగరానికే పరిమితమైన ‘కవి సంగమం’ తర్వాత ఊరూరా విస్తరించింది.
కన్న తల్లినీ, సొంత ఊరినీ ఎవరూ మరువరు. అందులోనూ కవనేవాడు అసలు విడువడు. యాకూబ్‌కు సొంత ఊరంటే బెంగ. ఆ ఊరికీ, అక్కడి వాళ్లకూ ఏదైనా-చిన్నదైనా పనికొచ్చే పనిచేయాలని తెగ తపించాడు. చివరికి ఊర్లోని తన ఇంట్లోనే ఒక గదిని కేవలం పుస్తకాల కోసం కేటాయించి, స్థానికంగా ఆవారాగా తిరిగే పిల్లలంతా అక్కడికి వచ్చి చదువుకునేలా తీర్చిదిద్దాడు. తన ఊరి పేరుతో ‘రొట్టమాకు రేవు’ అవార్డులు ఏర్పాటుచేసి ఏటా కవులకు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాడు.
ఇవన్నీ చేసింది-ఒక్కడేనా అంటే, బహుశా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తనకీ ఆశ్చర్యంగానే ఉంటుందేమో. కానీ, వాస్తవం. సంకల్పం ఉండాలి, పట్టుదలతో పని చేయాలి. సాధించలేనిదేమీ ఉండదని యాకూబ్ జీవితం చాటిచెప్తుంది. ఎవరు బతికారు మూడు యాభైలు అంటారు గానీ, రెండు అరవైలు బతికిన వారు మాత్రం ఎవరున్నారు. అయినా, అర్థం లేని బతుకు ఎన్నాళ్లు బతికితేనేం? బతికిన ప్రతి క్షణాన్ని జీవించడం గొప్ప కదా, ఇతరుల జీవితానికి కూడా ఇంత వెలుగు అద్దాలనుకోవడమే ధన్యత కదా?
‘ఆనేవాలా పల్ జానేవాలా హైహో సఖే తో ఇస్ మేన్ జిందగీ బితా పల్ జో యెహ్ జానేవాలా హై హో’ అని గుల్జార్ అన్నట్టు క్షణభంగురం లాంటి జీవితం నుంచి కవిత్వాన్ని పిండుకుంటున్న యాకూబ్, సృజన గురించి ముచ్చటించుకోవడమంటే మరింత స్ఫూర్తిని మూటగట్టుకోవడమే.
– (నేడు రవీంద్ర భారతిలో కవి యాకూబ్ సృజన సమాలోచన సదస్సు సందర్భంగా…)
దేశరాజు