తెలుగు సాహిత్యరంగంలో ఆంధ్ర ప్రాంత సాహిత్య వికాసానికి కారణం ఆ ప్రాంతం ఆంగ్లేయుల పాలనలో ఉండటం ఒక కారణమైతే, పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లభాష అమలు కావడం మరో కారణమని, తెలంగాణలో ఆధునిక వికాసం లేదని, దానికి కారణం ఉర్దూ అధికార భాషగా ఉండటమేనన్న వాదన చెలామణిలో ఉండేది. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత జరిగిన పరిశోధనలతో ఆ వాదనకు కాలంచెల్లింది. అయితే, తెలంగాణ కేంద్రంగా వెలువడిన సాహిత్య చరిత్ర గ్రంథాలను పరిశీలిస్తే.. యూరోపు కేంద్రంగా గత శతాబ్దిలో తలెత్తిన అనేక కవిత్వ సాహితోద్యమాలను పరిచయం చేసిన అపురూప చరిత్ర గ్రంథాలు తెలంగాణ నుంచే వచ్చాయనే విషయం తేలుతుంది. అక్కడ రాజుకున్న ఆధునిక కవితోద్యమాలను చర్చిస్తూ వెలువడిన నాలుగు గ్రంథాలను పరిచయం చేయడమే ఈ వ్యాసరచన లక్ష్యం.
ఒకటవది ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’: వెలువడిన కాలం 1942. రచయిత నిజాం కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకుడైన కురుగంటి సీతారామయ్య. ఆంధ్రలో పుట్టి హైదరాబాద్లో స్థిరపడిన చరిత్రకారుడు. మొదలు ఈ గ్రంథం మూడు భాగాలుగా వెలువడింది. వీటిలో ఆనాటి మద్రాసు రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలన వల్ల ఆంగ్లభాష వల్ల ఆంధ్ర ప్రాంతాన సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వచ్చిన మార్పులపై వెలువడిన రచనలపై, కావ్యాలపై పరిచయం ఉన్నది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆంగ్ల వలసీకరణ తెచ్చిపెట్టిన అనేక మార్పులపై విమర్శనాత్మక వ్యాఖ్యానం ఉన్నది.
1900 తొలి దశకాల్లో నాయని వెంకట రంగారావు స్థాపించిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి గురించి అందులో భాగమైన కొమర్రాజు లక్షణరావు గురించి ఈ సంస్థ ప్రచురించిన అనేక గ్రంథాల వివరాల ప్రస్తావన ఉన్నది. మూడవ భాగంలో రియలిజం, ఐడియలిజం అన్న అత్యంత ఆధునిక భావాల గురించి విపులమైన చర్చ ఉన్నది. 3 భాగాలతో వెలుడిన నవ్యాంధ్ర సాహిత్య వీధులు ఆ తర్వాత అంటే… 1941 నుంచి 1950ల వరకు నాటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తలెత్తిన కవితోద్యమాలతో 4వ భాగాన్ని కూర్చి 1950లలో 2వ ముద్రణ చేశారు. ఇందులో చాలామంది కవుల ప్రస్తావన ఉన్నప్పటికీ శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబుపై కవిత్వం కేంద్రంగా ఈ చర్చ నడిచింది.
ఇదే భాగంలో ఆంధ్ర, తెలంగాణ కేంద్రంగా నడిచిన అభ్యుదయ సాహిత్యోద్యమం గురించి చాలా వివరాలున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆళ్వారుస్వామి నడిపిన అభ్యుదయ సాహిత్యోద్యమంపై చర్చలోకి రాని విషయాలున్నాయి. తెలంగాణకు చెందిన కాళోజీ నారాయణరావు, దాశరథి గురించి గొప్ప విశ్లేషణలున్నాయి. సురవరం, దేవులపల్లి రామానుజరావు, గార్లపాటి రాఘవరెడ్డిలతో పాటు నాటి తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్న కవులు ఆయా సంస్థల పేర్లు, వనపర్తి వంటి సంస్థానాల కేంద్రంగా నాటి యువ కవులు చేసిన సాహిత్య కృషి, ప్రస్తావనలున్నాయి.
రెండవ గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము: సప్రదాయము ప్రయోగము: ప్రయోగాలు’ రచయిత మహాకవి డాక్టర్ సినారాయణ రెడ్డి. వెలువడిన కాలం 1967. ఈ మహా గ్రంథం తెలుగు సాహిత్యంలోనే విశిష్ఠమైనది. తెలుగులో మొదటి ప్రపంచయుద్ధ కాలం తర్వాత తెలుగు సాహిత్యాన్ని ఊపేసిన భావ కవిత్వాన్ని (ఇంగ్లిష్లో రొమాంటిక్ పోయెట్రీ) అనేక కోణాల్లో చర్చించిన మహా గ్రంథమిది. అంతేకాదు, రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఐరోపాను చుట్టుముట్టిన అనేక కవితా ఉద్యమాల తాత్త్విక భూమికను అతి నవ్వకవితా ధోరణులు అనే శీర్శికలో మొత్తం 8 భాగాలుగా చేసి విశ్లేషించాడు. వీటికి తోడు నిరాశవాద ధోరణితో పాటు సింబాలిజం, డాడాయిజం, వంటివాటిని కూడా చేర్చాడు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఫ్రెంచ్, ఆంగ్ల కవితారంగాన్ని చుట్టుముట్టేసిన తీరును ప్రామాణికమైన ఆధారాలతో విశ్లేషించాడు. ఫ్రెంచి కవితా రంగంలో ఇమేజిజానికి ప్రఖ్యాతిగాంచిన కవులు మాలార్మే, లాపోలను పరిచయం చేసి, వారు వచన కవితను తీర్చిదిద్దిన తీరును చర్చించాడు. ఈ ధోరణుల ప్రభావంతో రాసిన శ్రీశ్రీ, నారాయణబాబు, పఠాబి, ఆరుద్ర వంటి కవుల కవితను విశ్లేషించాడు. ఈ నవీన ధోరణుల ప్రభావంతో శ్రీశ్రీ కవితా రచనకు పూనుకోవడం వల్ల తెలుగులో వచన కవితకు చక్కని స్థానమేర్పడిందని, అపూర్వ వైవిధ్యం ఏర్పడిందని వ్యాఖ్యానించాడు. సింబాలిజం అన్న ధోరణిని పరిచయం చేసి ఆరుద్రను సింబాలిస్టు కవిగా విశ్లేషించాడు. కవిత్వంలో కామప్రధానం, వైచిత్రి ప్రియత్వం వంటి ధోరణుల తాత్విక భూమికను చర్చిస్తూ ప్రఖ్యాత సైకాలజిస్టు ప్రాయిడ్ను పరిచయం చేశాడు.
3వ గ్రంథం ‘ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత అధివాస్తవికత’: రచయిత నందిని సిధారెడ్డి, వెలువడిన కాలం: 1988. ఈ పుస్తకం రెండు భాగాలుగా ఉన్నది. ఒకటి వాస్తవికతపై చర్చ, మరొకటి అధివాస్తవికతపై చర్చ. ఇతర రెండు పుస్తకాల పరిచయంలో కూడా అధివాస్తవికతను చర్చించినందున వాస్తవితకను రచయిత విశ్లేషించిన తీరును పరిచయం చేస్తాను. అభ్యుదయ సాహిత్యం తెలుగు సాహిత్యరంగంలోకి విస్తారమైన చర్చలోకి వచ్చిన భావన వాస్తవికత. ఇదే భావన భారతీయ సాహిత్యంలో భిన్నమైన పేర్లతో కొనసాగుతున్న విషయం సాహిత్యకారులకు విధితమే. మార్క్సిస్టు కళాసిద్ధాంతాల వెలుగులో రచయిత సిధారెడ్డి వాస్తవికతకు ఉన్న సైద్ధాంతిస్థాయిని చర్చించి సంప్రదాయ సాహిత్యరంగంపై తిరుగుబాటుగా దానిని విశ్లేంచిన తీరు తెలుగు సాహిత్యరంగంలోనే విశిష్ఠమైన ప్రయత్నం. పారిశ్రామిక విప్లవం తర్వాత సాహిత్య కళారంగాల్లోకి హతువు పునాదిగా పెట్టుబడిదారీ వర్గాలు, కష్టజీవుల మధ్య జరిగిన సంఘర్షణలోంచి, భౌతిక పరిస్థితుల భూమికగా వాస్తవికత రూపుదిద్దుకున్న తీరును విశ్లేషించిన పుస్తకమిది. వేద కాలం నుంచి మొదలుపెడితే భారతదేశ సాహ్యితకళారంగాల్లో వాస్తవికతను అలంకారికలు నిర్వచించని తీరు రచయిత విశ్లేషించారు. ఉత్పత్తి పునాదిగా అందులో సంఘర్షణ భూమికలో వాస్తవికత రాజుకున్న తీరును చర్చిచారు.
4వ గ్రంథం ‘శ్రీశ్రీ కవిత్వము మనో విశ్లేషానాత్మక పరిశీలనము’: రచయిత దేవరాజు కృష్ణమరాజు, వెలువడిన కాలం 1999, ఈ ముగ్గురు రచయితలు పూర్తిగా తెలంగాణ వాసులు. తెలుగు సాహిత్యంలో ఐరోపా కేంద్రంగా వెలుగుచూసిన మనస్తత్వ శాస్ర్తాన్ని అన్వయిస్తూ వెలువడిన పరిశోధనా గ్రంథంగా ఈ పుస్తకానికి ప్రాధాన్యం ఉన్నది. భారతీయ కావ్య తత్వవిచారంలో కొన్ని చర్చనీయాంశాలను వివరిస్తూ శ్రీశ్రీ మహా ప్రస్తాన గేయాలకు మనస్తత్వ శాస్ర్తాన్ని అన్వయించడం ఈ పుస్తకంలో ముఖమైంది. ప్రెంచి మహాకవి బాద్లేర్, కథానికా రచయిత గేడి ముపాసా, అమెరికన్ రచయిత ఎడ్తార్ ఎలెన్ పోలకు ఉన్న సారూప్యతలను విశ్లేషించడం ఒక ముఖ్య అంశం.
– సామిడి జగన్రెడ్డి 85006 32551