అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో, రోజంతా ఖాళీగా వుండే ఓ లోకల్ రైల్వే స్టేషన్ అది. ఇద్దరు పెద్దమనుషులు చేతిలో పేపర్లతో, ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. వారిద్దరి వయసూ దాదాపు దగ్గరే. కానీ, ఒకరికి మాత్రమే సోడాబుడ్డి కళ్లద్దాలున్నాయి.
పరస్పరం పలకరించుకుని, వాతావరణం గురించి ప్రస్తావించుకుని, పేపర్లలో తలలు దూర్చేశారు పెద్దలు. అంతలో, ప్రతి రోజూ సాయంత్రం బండెక్కే ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరుగా ప్లాట్ఫామ్ మీదికి చేరుకున్నారు. వాళ్లను వీళ్లూ పట్టించుకోలేదు – వీళ్ళను వాళ్ళూ పట్టించుకోలేదు! హఠాత్తుగా, సోడాబుడ్డి కళ్లద్దాల పెద్దమనిషి (సో.క.పె.), చేతిలోని వార్తాపత్రిక నేలన పడేలా విసిరి కొట్టాడు. ఎదురుగా కూర్చున్న రెండో పెద్దమనిషి (రెం.పె.), సో.క.పె. వైపు వింతగా చూసి తిరిగి పత్రికలో తలదూర్చేశాడు.
“ఈ పేపర్లవాళ్లకి నానాటికీ బుద్ధి గడ్డితిని పోతోందండీ!” అనేశాడు సో.క.పె. బిగ్గరగా. “అదేమిటండీ అంతమాటనేశారు విలేకర్లు వింటే, కొంప తవ్వేయరూ?” అన్నాడు రెం.పె. బెదురుచూపులు చూస్తూ.
“లేకపోతే ఏమనమంటారండీ? మొదటి పేజీలోనే ఎనిమిది దెయ్యం వార్తలు వేస్తారా??” అన్నాడు సో.క.పె. ఆక్రోషంగా. “బాగుందండీ.. జనం దెయ్యం గురించి బెంగెట్టుకు ఛస్తూంటే, పత్రికలు ఏం పట్టనట్టు వుంటయా?” అన్నాడు రెం.పె.
‘అక్కడ దెయ్యం అల్లరి, ఇక్కడ దెయ్యం ఆగడం అని ఎన్ని రోజులుగా రాస్తున్నారో మీ కు తెలియందా?’అన్నాడు సో.క.పె. ‘ఏమో! ఎవరు చూసొచ్చారు కనక? ఐనా, దెయ్యాలు అల్లరీ ఆగడం చేయవుటండీ, చోద్దెం కాపోతేను?’ అన్నాడు రెం.పె. ‘అలాగటండీ? అయితే దెయ్యాలున్నాయంటారు తమరు?’ అన్నాడు సో.క.పె. ‘కుండబద్దలు కొట్టి మరీ అంటానా మాట! ఏం మీకు దెయ్యాలమీద నమ్మకం లేదాండీ?’ నిలదీశాడు రెం.పె. ‘ఎంతమాత్రం లేదు! మీరు చెప్పినట్టుగా, దెయ్యాలనేవే వుంటే, నా ముందుకు రమ్మనండి చూద్దాం!’అన్నాడు సో.క.పె.
అతని మాట పూర్తవుతూండగా రైలుబండి కుయ్యోమని వేసిన కేక ఆస్టిన్ స్టేషన్ను దద్దరిల్ల చేసింది. హఠాత్తుగా వినబడ్డ ఆ కేకకు ఉలిక్కిపడ్డాడు సోడాబుడ్డి కళ్లద్దాల పెద్దమనిషి. అతనికెదురుగా కూర్చునివున్న రెండో పెద్దమనిషి చిరునవ్వుతో మొదలుపెట్టి వికటాట్టహాసంతో పూర్తి చేశాడు నవ్వడం. నవ్వు పూర్తవుతుండగానే అతగాడు, కూర్చున్నవాడు కూర్చున్నట్టే మాయమైపోయాడు!
సోడాబుడ్డి కళ్ళద్దాల పెద్దమనిషి తింగరి చూపులు చూస్తూ ఉన్నచోటే పాతుకుపోయాడు!! ప్లాట్ఫామ్ మీదికొచ్చిన పుష్పుల్ రైలు ఎక్కడానికి ఎగబడి వెళ్ళే ప్రయాణికుల్లో ఒక్కరూ అతన్ని పట్టించుకోలేదు పాపం! అయ్యా, ఇది ఓ.హెన్రీ చెప్పిన ఓ కథానిక అంటారు! నిజానిజాలు దేవుడికి – కాదు దెయ్యానికి ఎరుక!!
కథానికకు అనర్హమైన ఇతివృత్తమేదీ లేదని నిరూపించినవాళ్లలో అమెరికన్ కథకుడు ఓ.హెన్రీ (అసలు పేరు విలియమ్ సిడ్నీ పోర్టర్) ప్రథమగణ్యుడు. 1862లో పుట్టిన హెన్రీ, పొదుపుగా 48 యేళ్లు మాత్రమే బతికాడు. అమెరికన్ అంతర్యుద్ధం నడిమధ్యన జన్మించిన హెన్రీ జీవితమంతా గతుకుల బాటలో ప్రయాణంగానే సాగింది. ఆ మాటకొస్తే, అతనొక్కడనే కాదు అమెరికన్లు అందరూ ఆ రోజుల్లో అలాగే పడుతూ లేస్తూ మళ్ళీ పడుతూ జీవనయానం సాగించినవాళ్ళే. 1902 లోనే హెన్రీ కుడిచేతా ఎడం చేతా కథానికలు బరికేయడం మొదలుపెట్టాడు. ఎనిమిదేళ్ళ స్వల్ప కాలంలోనే 380కి పైగా కథానికలు రాసిపారేశాడు! పాఠకులు ఊహించని ‘ట్విస్ట్’తో కథను ముగించడమనే ఒకే ఒక్క చిట్కాతో దాదాపు నాలుగువందల కథానికలు రాయడం మాటలు కాదు. అది అతను ప్రయోగించిన శిల్ప విశేషం మాత్రమే! ఓ.హెన్రీ కథానికల్లో అత్యధికం మనుషుల మనసుల్లో మారుమూల దాగివుండే అనుకంప”నూ, కరుణనూ మీటి వాళ్ళలో మానవత్వాన్ని ఉజ్జ్వలం చేస్తుంటాయి. వాస్తవానికి, హెన్రీ కథానికలు ఇప్పటికీ బతికి వుండడానికి ఇదే కారణమేమో అనిపిస్తుంది.
హెన్రీ కథానికల్లో “ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ”, “ద ల్యాస్ట్ లీఫ్” ప్రపంచ ప్రసిద్ధికి నోచుకున్నాయి. అవి, ప్రేమను మరింత ఉజ్జ్వలం చేసే కరుణ, అనుకంప, ప్రేమలపై ఫోకస్ చేసిన కథానికలే! “ద ల్యాస్ట్ లీఫ్” కథానిక గురించి ఓసారి చెప్పుకుందాం. జాన్సీ-స్యూ రూమ్మేట్లు; యువ చిత్రకారిణులు. వాళ్లుండే బ్రహ్మచారి కూటంలోనే బతుకీడ్చే పేదవృద్ధ చిత్రకారుడు బేర్మన్. నగరంపై శిశిరం విరుచుకుపడిన నేపథ్యంలో చెట్లూ, తీగెలూ ఆకులు రాల్చేస్తున్న కాలమది. జాన్సీ న్యుమోనియాతో బాధపడుతుంటుంది. డాక్టర్ ఉన్నంతలో మంచి మందులిచ్చి ఏదోలా జాన్సీని బతికిస్తుంటాడు. చిక్కంతా, జాన్సీతోనే వచ్చిపడింది. వాళ్ళ గదికి ఆనుకుని వున్న గోడమీది తీగెకున్న ఆఖరి ఆకుతో పాటే తనూ రాలిపోతాననేది ఆమె మూఢనమ్మకం!
స్యూ ద్వారా ఆ విషయం తెలుసుకున్న బేర్మన్, ఓ మంచుకురిసిన రాత్రంతా మెళకువగా వుండి, ఆ గోడ మీద ఓ ఆకును చిత్రిస్తాడు. అది, తీగెలపై చిగురించే లేత ఆకును కళ్లారా చూస్తే ఎలా కనిపిస్తుందో, అలాగే వుంటుంది! దాన్ని చూసి, కాలం నెట్టేస్తుంది జాన్సీ. అయితే, పెద్ద వయసులో మంచులో నిలబడి పెయింటింగ్ గీసిన బేర్మన్ మాత్రం మర్నాడే రాలిపోతాడు!
నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే మామూలు మనుషులనే, కరుణ, అనుకంప, ఎంత ఉన్నతులుగా మలుస్తాయో ఈ కథానికలోనే కాదు, ఓ.హెన్రీ ఏ కథానికలోనూ వాచ్యంగా చెప్పడు! అంతటి నిగ్రహం, అతగాడి సమకాలికుడైన రష్యన్ కథానిక రచయిత అంతోన్ చేహఫ్లోనే కనిపిస్తుంది!!
వచ్చేవారం నుంచి, ఇరవయోఁ శతాబ్ది తెలుగుకథ ఎప్పుడు, ఎక్కడ పుట్టిపెరిగిందో ఈ కాలమ్లో మాటాడుకుందాం.
– మందలపర్తి కిశోర్ 81796 91822