సూర్యుడు అతని కోసం నిరీక్షిస్తుంటాడు..
సమయపాలనకు నియమ బద్ధుడైన
అతని రాకతో తన గమనాన్ని
సరిపోల్చుకోవడానికి
ఆకాశం అతడికి సలాం చేస్తుంది..
రంగు లేని తమ వాన బిడ్డకు
అద్భుతంగా హరితవర్ణం అద్దాడని
భూదేవి అతడి అడుగుల కోసం
ఆశగా చూస్తుంది..
అతడు నడయాడే చోట
తన ఖనిజ సంపద
సారవంతమవుతుందని
నీటి ప్రవాహం అతని పాదాలకు
వందనం చేస్తుంది..
అతని చేతుల్లోకి చేరితే
తన జన్మకు సార్థకత చేకూరుస్తాడని
గాలి అతడికి ప్రణమిల్లుతుంది..
తన పయనానికి స్వచ్ఛమైన
పంటచేల సుగంధాన్ని
బహుమతిగా అందిస్తాడని
విత్తనం అతని స్పర్శ కోసం తహతహలాడుతుంది..
తన ఆత్మకు రక్షణ కల్పించి
ఒక అందమైన రూపంతో
ప్రాణ ప్రతిష్ట చేస్తాడని
ప్రకృతి అతనిని మరో బ్రహ్మగా కొనియాడుతుంది..
తన వనరుల రక్షణ కోసం నిత్యం
తాపత్రయపడే ఆపద్బాంధవుడు అతనని
అవును మరి..
సాటి వారి ప్రాణం నిలిపేందుకు
ఎన్నో నిద్దుర రాత్రులను
కాలానికి అరువిచ్చే యోగి అతడు
సేద్యానికి శ్రమను తాకట్టు పెట్టి
ధాన్యపు సిరులను
లోకానికి దానం చేసే రుషి అతడు
అన్నపూర్ణా దేవికి అసలైన వారసుడు
మానవజాతికి ఆరాధ్య దేవుడు
-విశ్వైక, సికింద్రాబాద్