ఈ బండిని ప్రతిసారీ..
ప్లాట్‌ఫాం వన్‌పైనే పెట్టండి!
కులీనులైన మన ప్యాసింజరు దేవుళ్లని..
ఎస్కలేటరో, లిఫ్టో ఎక్కి ఇంకో
ప్లాట్ఫామ్మీదికి వెళ్లమని చెబితే పాపం!
ఆధునికీకరణ యజ్ఞంలో భాగంగా
మన దేవుళ్లకు విసుగూ, ఈసడింపూ పుట్టకుండా
కొత్త ప్లాట్‌ఫాంలు,
అత్యాధునిక రిటైరింగ్ రూములూ
సత్వరమే సిద్ధం చేయించండి..
వేరే గతి లేక, స్తోమత లేక ఆశ్రయించేవాళ్లూ..
బతకలేని బతుకుల్ని గోతాల్లో మూటగట్టుకుని
వలసెత్తుకుని పరుగెత్తేవాళ్లూ..
మలమూత్రాలు నిండిన మరుగుదొడ్ల పక్కన,
సీట్ల కిందన, సీట్ల మధ్య ఇరుకుల్లో
కొలువు తీరి, తీరిగ్గా పడుకునీ
ప్రయాణించే అలగా జనం ఎవ్వరూ
మన వాళ్ల కళ్ల పడడానికి వీల్లేదు!
ఆ జాతికీ ఈ జాతికీ మధ్యలో ఉక్కు గోడలను కట్టండి!
ఈ కులీన దేవుళ్ల పాదసేవలో
భరతమాత పునీతం అవుతున్నది!
ప్రభుత్వాలకు పన్నుల ఇం‘ధనం’ వాళ్లు..
పాలకులకు చీకటి బంధం వాళ్లు..
వారి చరణాంబుజముల సేవలో తరించడం
వారి తొత్తరికాన్ని అనునిత్యం అనుష్ఠించడం
మనందరి కర్తవ్యం!
దేశమంటే దరిద్రులు కాదోయ్
దేశమంటే కుబేరులోయ్
ఇది నవ్య నిర్వచనాల కవనం!
ధన రూపసుల కాల్మొక్కే పనులనే
జాతిని ఉద్ధరిస్తున్నట్టుగా డప్పు కొట్టుకోవడం..
దేశసేవగా చాటి చెప్పుకోవడం..
మన జ్ఞానరస ఔద్ధత్యం!
వందే భారతాల వెల్లువలో
ఘన నగరాలను ముడిపెట్టేస్తున్నారే..
రైలెక్కితే స్వర్గ సుఖాలలో ముంచేస్తున్నారే..
ఇంత చేస్తున్నారే సామీ
మీ జన పంక్తులలో మాబోటి కనిష్ఠుల కొరకు..
మీ దయాప్రాప్తత కోసం
ఆర్తిగా చూసే ధూర్తుల కొరకు..
మీ పంచభక్ష్య పరమాన్నాల విస్తరిలో
తిని వదిలేయగా మిగిలిన ఎంగిలి లాగా..
మీ సకల వ్యాపార, వ్యవహారాల నడుమ
కడు పుణ్యార్జన కోసం వేసే ముష్టి లాగా..
ప్రతి మామూలు పొగబండికీ
రెండేసి జనరల్, స్లీపర్ బోగీలు..
ఎగస్ట్రా వేయరాదా?
తొక్కిసలాటల నుంచీ, దుర్భరావస్థల నుంచీ,
జన సమ్మర్ధంలో మాలో మాకు కొట్లాటల నుంచీ,
రవ్వంత విముక్తిని ప్రసాదించరాదా?
మీకు రుచించే ‘భారతీయాత్మ’ మాలో లేదనీ..
మీరు స్మరించే ‘భరతమాత పుత్రులు’
మేం కాదనీ..
మీరు స్వప్నించే దేశ సేవా యశస్సు
మావలన దక్కదనీ..
అంత నమ్మకమా సామీ!
-అగస్త్య