కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, రన్నింగ్ కామెంట్రీ రచయితగా, కార్టూనిస్టుగా, కథా రచయితగా, రేడియో నాటకాలు, రంగస్థలం నాటకాల రచయితగా, సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా, పాటల రచయితగా.. ఇలా అన్నీ తానై అన్నింటా తానై వెలుగొందిన దేవీప్రియ అందరికీ సుపరిచితులు. కవితల మాంత్రికుడు దేవీప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15న షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబీ పుణ్యదంపతుల ఇంట సాహితీమాత వరాలపంటగా జన్మించారు. అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్.
రచనారంగంలో అరంగేట్రం చేసిన తర్వాత ‘దేవీప్రియ’ అనే కలం పేరుతో హుస్సేన్ విఖ్యాతి పొందారు. కాలేజీలో చదివే రోజుల నుంచే కవితలు, కథలతో తన సాహితీ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబరకవులలో ఆయన ఒకరు.
కథకుడిగా మొదట సాహితీరంగంలో అడుగుపెట్టి, ఆ తర్వాత కవిత్వం వైపు తన అక్షరాన్ని మళ్లించి కవిత్వంలో నూతన ఒరవడి సృష్టించారు దేవీప్రియ. ‘అమ్మ చెట్టు’ వీరి మొట్టమొదటి కవితాసంపుటి. గరీబు గీతాలు, నీటిపుట్ట, అరణ్యపురాణం, తుఫాన్ తుమ్మెద, గాలిరంగు, చేపచిలుక, సమాజానంద స్వామి, గంధకూటి, ఇన్షా అల్లాహ్… లాంటి ఎన్నో కవితా సంపుటాలు ఆయన వెలువరించారు. ఆయన కవిత్వంలో ధిక్కారం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. పదసంయోజనంలో సాధికారత సాధించిన కవి దేవీప్రియ. సుతిమెత్తని కవిత్వాన్ని ఒత్తుగా అల్లిన విశిష్ట కవి. కొత్త ఊహలు చేయడంలో అందెవేసిన చెయ్యి. దేవీప్రియ జర్నలిస్టుగా అనేక పత్రికల్లో విశిష్ట సేవలు అందించారు. అలాగే ఆయన పత్రికల్లో రాసిన రన్నింగ్ కామెంట్రీకి విశిష్ట స్థానముంది.
సినిమా రంగంలోనూ ఓ వెలుగు వెలిగారాయన. బి.నరసింగరావు దర్శకత్వం లో వచ్చిన మా భూమి, దాసి, రంగుల కల వంటి జాతీయ పురస్కారాలు పొందిన సినిమాలకు స్క్రిప్టులు, పాటలు రాశారు. ఆయన రచించిన జమ్ జమల్ మర్రి అనే పాట అశేష ప్రేక్షకాదరణ పొందింది. రేడియో నాటకాలు, రంగస్థల నాటకాలు ఆయన కలం నుంచి జాలువారాయి. అనిశెట్టి గారితో కలిసి సహాయకుడిగా 11 సినిమాలకు పాటలు, మాటలు రాశారు.
దేవీప్రియ బహుభాషా కోవిదులు. ఎన్నికల నిర్వహణలో కేజే రావు గురించి ‘ది కోబ్రా డాన్సర్’ పేరుతో ఆంగ్లంలో జీవిత కథ రాశారు. అలాగే మైఖేల్ జాక్సన్ రాసిన కవితని తెలుగులోకి అనువదించారు. దేవీప్రియ రాసిన వాటిల్లో ‘దాంపత్య ప్రణయ కవిత్వం’ ఆయన స్పెషలైజేషన్. సాహిత్యంలో దేవీప్రియ చేసిన సేవలకు గానూ ఎన్నో పురస్కారాలు అం దుకున్నారు. 2017లో గా లి రంగు కవితా సంపటికి ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సాహితీ సవ్యసాచిగా సుప్రసిద్ధి పొందిన దేవీప్రి య 2020 నవంబర్ 21న కన్నుమూశారు.
-పింగళి భాగ్యలక్ష్మి 97047 25609