తెలంగాణ ఆవిర్భావం అనంతరం తెలంగాణ భాష ప్రత్యేకతను దేశం అంతా కీర్తిస్తోంది. చెప్పవలసిన అంశాన్ని ముక్కుసూటిగా, ఒకింత పరుషంగా, కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించే భాష తెలంగాణ భాష. గ్రామీణ పలుకుబడులతో, సామెతలతో, జాతీయాలతో పరిపుష్టమైన భాష తెలంగాణ భాష. ప్రాచీన కవుల నుంచి ఆధునికానంతర కవుల దాకా వెలువరించిన సాహిత్యంలో తెలంగాణ భాష కమ్మదనం, అమ్మదనం సాక్షాత్కరిస్తాయి. కాళోజీ కవిత్వమూ అంతే!
కృష్ణానది ప్రవహించే బీజాపూర్‌లో 1914 లో పుట్టారు కాళోజీ. కృష్ణానదిలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు ప్రవహించి పెరిగి పెద్దయ్యారు. ఈ మట్టివాసనను నరనరాన ఒంటబట్టించుకుని, కవిత్వంలో ఒలికించారు. చారిత్రక ప్రాధా న్యం కలిగిన బీజాపూర్ (కర్ణాటకలోని విజయపుర)లో జన్మించి, చారిత్రక విశిష్టత కలిగిన హనుమకొండ ప్రాంతంలో పెరిగి, విశిష్ట వ్యక్తిత్వాన్ని అణువణువూ సంతరించుకొని, తెలంగాణ చరిత్ర పుట ల్లో ప్రధాన భాగమయ్యారు కాళోజీ. ఏకవచనంతో సంబోధించడం తెలంగాణ ప్రేమ భావనకు, అందరినీ హత్తుకుని దగ్గరకు తీసే నైజానికి నిదర్శనం. స్వపక్షం వాడినైనా, విపక్షం వాడినైనా ఏకవచనంతో సంబోధించడం తెలంగాణవాసులకు ఉన్న ప్రత్యేక స్వభావం.ఈ స్వభావం కాళోజీ కవిత్వంలో కనబడుతుంది.
ఆంధ్ర సారస్వత పరిషత్తు తొలి వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ కోటలో ఆ సంస్థ సభ్యుడైన కాళోజీ వేయించిన పందిళ్లను రజాకార్లు కూల్చేశా రు. వరంగల్ కోటలో నాటి కాంగ్రెస్ నాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో రజాకార్లు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో మొగిలయ్య అనే కార్యకర్త మరణించాడు. రజాకార్లతో ముఖాముఖి ఘర్షణకు దిగారు కాళోజీ. ఫలితంగా మూడునెలలపాటు నగర బహిష్కరణ శిక్షకు గురయ్యారు. ఆ సందర్భంగా విచారణకు వెళ్లిన ప్రధానమంత్రి మీరా ఇస్మాయిల్‌ను ఉద్దేశించి
‘ఎన్నాళ్ల నుండియో ఇదిగో ఇదిగోయనుచు/ ఇన్నాళ్లకైనను వెళ్ళి వచ్చితివా/ కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట /గూండాల శక్తులు గోచరించినవా?” అని నిలదీశారు. ఈ కవితలో మీరా ఇస్మాయిల్‌ను ఏకవచనంతో సంబోధించడం కనిపిస్తుంది. ఇది తెలంగాణ భాష నైజం.
ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కూడా ఏకవచనంతోనే సంబోధించారు కాళోజీ. ‘ఒప్పందాలను నమ్మి/ ఒప్పుకుందిచాలమ్మా/ఎవరి ప్రాంతమును వారిని/ ఏలనియ్యి ఇందిరమ్మ’ అని ఏకవచనంలో డిమాండ్ చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పు డు 1975 జూన్‌లో రాష్ట్రపతిని సైతం ఏకవచనంతో సంబోధించారు. ‘పౌర జీవితమ్ము కాలి/ కమురు కంపు కొడుతుంటే/ ఎమర్జెన్సీ అత్తరుతో/ ఏమాత్రం ఆపగలవు/రాష్ట్రపతి ఏమంట వు’ అని నేరుగా రాష్ట్రపతినే ప్రశ్నించడం కనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా విధించిన అత్యవసర పరిస్థితి సందర్భం లో ‘జాతిని కాపాడుటకు’ అనే కవితలో ‘పట్టెయ్యి కాళోజీని/ మెడ కొట్టెయ్యి కాళోజీది / నా గొడవ సాగకుండా / చేసెయ్యి వెంగళ్రావ్’ అని వెంళగరావుకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని 1978లో‘ఉద్రిక్తులను చేసి ప్రజల/నుగ్రవాదులంటావా / కాళోజీ అడుగుతాండు / ఏమంటవ్ మర్రి చెన్న?’ అని ప్రశ్నించారు.
కాళోజీకి గాంధీజీ అంటే చాలా అభిమానం, ప్రేమ. ఆ ఇష్టంతో రాసిన కవితల్లోనూ గాంధీజీని ఏకవచనంతో సంబోధించడం కనిపిస్తుంది. ‘ఇంకే మి కావాలె? ఇంకేమి చేయాలె / బతికినన్నాళ్లు నిన్ను బాపు అని పిలిచితిమి / చచ్చిపోయిన నిన్ను జాతిపిత జేసితిమి / పెక్కుభంగుల నిన్ను చెక్కి నిలవేసితిమి / వేడ్కతో ఇంటింట వ్రేలాడదీసితిమి/ నీ మాట మాటుననె మా మాట పలికితిమి / నీ అడుగులను చూపి మా అడుగులు వేసితిమి” అని స్మృతి కవిత రాశారు కాళోజీ.
కాళోజీ రాసిన మరో స్మృతి కవిత లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను ఉద్దేశించింది. ‘పుటక నీది /చావు నీది / బతుకంతా దేశానిది’ అని జయప్రకాశ్‌నారాయణ్ జీవన సార్థకతను ఏకవచనంలో వ్యక్తపర్చారు కాళోజీ.
తన సహాధ్యాయి పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినా ఆయనను ఏకవచనంతో సంబోధించడం మానలేదు కాళోజీ. ప్రధానిగా ఆయన నివాసంలోని భద్రతా ఏర్పాట్లు చూసిన కాళోజీ ‘ఏమిరో, తెలంగాణలో, వరంగల్‌లో ప్రజలు కటకటపడుతున్నారు. వాళ్ల తరఫున పోరాడుతున్న వాళ్లు కటకటాల వెనుక ఉన్నారనుకున్నాను. ఇంత దూరం వచ్చి నీకిదే చెప్తామనుకున్నాను. కానీ నువ్వే పెద్ద బందిఖానాలో ఉన్నట్లున్నావు కదా” అన్నారు. ఈ సంభాషణలో నాటి ప్రధానమంత్రిని సాన్నిహిత్యంతో ‘ఏమిరో’ అనడం కూడా కనిపిస్తుంది. ఇదీ తెలంగాణ దోస్తానా.
‘ఆపతి’ మరో తెలంగాణ పదం. ఆపద సమయాన్ని ఈ పదంతో సూచిస్తాం. తెలంగాణను ప్రగాఢంగా వాంఛిస్తూ రాసిన కవితలో కాళోజీ ఈ పదాన్ని ఉపయోగించారు.‘తెలంగాణ వేరైతే / దేశానికి ఆపత్తా?” అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ వేరైనంత మాత్రాన దేశానికి వచ్చే ప్రమాదమేమీ లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేశారు.
‘బాంచెన్ దొరా కాల్మొక్త’ తెలంగాణలో రెండు దశాబ్దాల క్రితం వరకు తరచుగా వినిపించిన మాట. ఈ మాటను తన కవిత్వంలో ఉపయోగించారు కాళోజీ. ఈ మాట అనే ప్రజలే నిజాం తొత్తులైన దొరల పని పడతారని ‘దొరల దెబ్బల తినుచు గురువు సాపెన వినుచు / ‘బాంచెనయ్యా’ యనుచు ప్రణమిల్లు ప్రాణాలు / ఇప్పుడిప్పుడె తెప్పరిల్లుతున్నాయి” అని హెచ్చరించారు.
‘గారబం చేయడం’ తెలంగాణలో గారాబానికి మరో మాట. ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉన్న వ్యక్తుల మధ్య పల్లవించేది గారాబం. దీన్నే తెలంగాణలో గార్వం, గార వం అంటున్నాం. 1943లో వరంగల్లులో జరిగిన కవిసమ్మేళనానికి అధ్యక్షుడు రాయప్రోలు సుబ్బారావు. తెలంగాణ విద్యారంగానికి గుండె కాయలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధిపతిగా ఉంటూ అప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతున్న నిజాం వ్యతిరేకోద్యమంలో రాయప్రోలు సుబ్బారావు పాల్గొనలేదన్న విమర్శలు వెల్లువెత్తిన రోజులవి. ఈ సందర్భంగా రాయప్రోలును అధిక్షేపిస్తూ ..
‘చేరదీసి నిన్ను గారవము చేసినా/ మావి గున్నల మాట మాట వరసకునైనా / ఎన్నడైనను తలచితే కోకిలా / ఎప్పుడైనను పాడితే కోకిలా” అని కవిత్వం చదివారు. ఎంతో గారాబంతో చేరదీసిన తెలంగాణ వారి సమస్యలనూ పట్టించుకొమ్మని రాయప్రోలు సుబ్బారావుకు విజ్ఞప్తి చేసిన కవిత ఇది.
తెలంగాణ వివిధ ప్రాంతాల వారిని తన గుండెలకు హత్తుకుంది. తనలో కలుపుకుంది. తెలంగాణ నేలకు ఉన్న ఈ స్వభావమే తెలంగాణ భాషలోనూ కనిపిస్తుంది. తెలంగాణ సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్నందువల్ల ఈ ప్రాం తంలో ఉర్దూ పదాలు తెలంగాణ భాషలోఅంతర్భాగమయ్యాయి. ఆ పదాలు కాళోజీ కవిత్వంలోనూ కనబడుతూ తెలంగాణ భాష పర భాషలను తనలో ఇముడ్చుకున్న తీరును వివరిస్తాయి. వరంగల్ కోట ఘర్షణ విషయంలో ప్రధాని మీరా ఇస్మాయిల్‌ను ఉద్దేశించి రాసిన కవితలో “బాజార్లో బాలకుని బల్లెంబుతో బొడుచు బద్మాషునేమైన పసిగట్టినావా? / కాలానుగుణ్య మౌ కాళోజీ ప్రశ్నలకు కళ్లెర్రజేసి ఖామోష్ అంటా వా’ అని నిలదీయడంలోనూ ‘బద్మాష్’, ‘ఖామోష్’ మొదలైన పరభాషా పదాలు కనబడతాయి. తన కవితా స్వరూపాన్ని గురించి తానే రాసుకున్న కవితలో ‘జీ’అనని ‘కలేజా’తో / కాళోజీ అను నది / నఖరాలు లేనట్టిది / అక్షరాల జీవనది’అనే కవిత లోనూ పరభాషా పదాల విస్తృత ప్రయోగాలను గమనించవచ్చు.
తెలంగాణలో వాడుకలో ఉన్న వివిధ సామెతలను, లోకోక్తులను, జాతీయాలను కాళోజీ తన కవిత్వంలో ప్రయోగించారు. నిజాం నవాబు ఏర్పరచిన విధాన సభకు ప్రతినిధిగా తన సన్నిహితుడు బలదేవ్ పతంగే ఎన్నిక కావడంపై ‘కూయనీయని చోట / కూతబలముంటేమి?’ అని ప్రయోగించడం కనిపిస్తుంది.‘చెమ్మగిల్లని కనులు బతుకు / కమ్మదనమును చాటలేవు / చెమ్మగిల్లని కనులు బతుకు / కమ్మదనమును చూడలేవు’ అనడం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది.
భాష విషయంలో కాళోజీకి కొన్ని ప్రత్యేక అభిప్రాయాలున్నాయి. తెలంగాణ భాష, యాసపై ఎం తో అభిమానం కాళోజీకి. రెండున్నర జిల్లాల భాష నే తెలుగు భాషగా పత్రికల్లో ప్రకటితమవడాన్ని తప్పు పట్టారు.‘రెండున్నర జిల్లాలదే దండి బాస అయినప్పుడు / తక్కినోళ్ల నోళ్ల యాస, తొక్కినొక్కబడ్డప్పుడు” అని నిరసించారు. ‘వందలేండ్లు తెలంగాణ / మంది వేరుగున్నప్పుడు / తెలంగాణ తెనుగుతనము / దినుసుగుణము పోయిందా?” అని ప్రశ్నించారు.
జీవభాష తెలంగాణను తన కవిత్వంలో విరివిగా ప్రయోగించిన కాళోజీ 2002 నవంబరు 13న అస్తమించారు. తెలంగాణ భాష ఉన్నం తకాలం ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది. చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసిన ఏ సాహిత్యకారుడికైనా మరణం లేదు. కాళోజీ కూడా అంతే!
(నవంబర్ 13 కాళోజీ వర్ధంతి)
– డా॥ రాయారావు సూర్యప్రకాశ్ రావు 94410 46839