కళ్ళు మూసుకుంటే
రాత్రి కనురెప్పలపై వాలదు
రాత్రి అంటే
కళ్ళు తెరిచినా చీకటే
ఆ చీకట్లో నా కళ్ళు టార్చ్లైట్లు!
నిదుర కరువైనప్పుడల్లా
నా స్నేహం అంతా చీకటితోనే
అంత చిక్కని రాత్రిలో
ఆలోచనల రంగురంగుల తుమ్మెదలు
కవిత వాక్యాలై కనురెప్పలపై వాలుతాయి
బయట విరగ్గాసిన పూల పరిమళం
కిటికీలోంచి అదృశ్యంగా ప్రవహిస్తుంది
ఆ చీకటి దృశ్యాలే
పొద్దున్నే కాగితాలపై
వెలుతురు కిరణాలైతవి!
పద్యానికి వెలుగు చీకట్లతో పనిలేదు
పొద్దు పొడుపును కలగనేది
నిజంగా అప్పుడే!
ఈ రాత్రి నాకు నిద్రను దూరం చేసినా
పొద్దున్నే పద్యంతో పగ తీర్చుకుంటా!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి 94402 33261