ఎంత కాలం నడవాలో తెలీదు
నడిచిన కొద్దీ గమ్యం
దూరంగా జరుగుతున్నది!
నడవగలిగినంత కాలమే కదా
నీవైనా నేనైనా నడిచేది
ఒక మలుపు దగ్గర ఎండమావి వెక్కిరిస్తది!
నేల ఆకాశం కలిసినంత భ్రమనే
అనుకున్న సమయంలో
గమ్యాన్ని ముద్దాడటం!
జీవితమే అన్వేషణ అనుకుంటే
క్రాంతదర్శులకు నవనవోన్మేషమే
అలసట వెంటాడదు!
గాడితప్పిన పాలనాకాలంలో
తావు మార్చి జీవించ వీలుకాని చోట
పేదవాని కోపం పెదవికే చేటు!
రాజ్యం పగ ప్రతీకారం అంటూ
రోజు క్యాలెండరు విడుదల చేస్తుంటే
సగటు మనిషిది లోయలోని స్వరమే!
నడక నేర్పాల్సిన పాలకులు
గమనం మరచి దుమ్మెత్తిపోస్తుంటే
ప్రజలు మట్టికొట్టుక పోవలసిందేనా?!
ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కొలువనప్పుడు
చేజార్చుకున్న ఓట్లు నిర్లిప్తంగా
ఐదేండ్లు దిగులు పడటం పెను విషాదం!!