నేను కురిశాను
నేను తడిపాను
నేనుపెంచాను
నాకంతా ఋణగ్రస్తులు!
నేను పూచాను
నేను వీచాను
నేను నిలిచాను
నాకంతా ఋణగ్రస్తులు!
నిండు గర్భిణులు
కనక మానేనా
ఎండవేడికి నిండుమబ్బులు
కరగక ఆగేనా!
ప్రాయాన ప్రాణులు
వికసించక ఆగేనా
ఒంపులో సొంపులో
ఆపితే ఆగేనా!
ఆగలేక జారి కురుయు చినుకుకు
పుడమి ఋణగ్రస్తమా
పడుతున్న చినుకులను ఒడిసిపట్టు
అవనికి చినుకు ఋణగ్రస్తమా!
మబ్బును కరిగించిన వేడికి
భూమి ఋణగ్రస్తమా
తాపము తగ్గించిన చినుకుకు
ధరణి ఋణగ్రస్తమా!
ప్రాణం నిలిపే పవనమునకు
విశ్వంభర ఋణగ్రస్తమా
ఆశ్రయమిచ్చిన వసుంధరకి
గాలి ఋణగ్రస్తమా!
పంచభూతాలకంటని
ఋణ గణాంకాలు
తుచ్ఛ ప్రాణులకెందుకో
అంతటి అహంకారమెందుకో!
నేను నేను నేను నేను
నా కిందే అంతా
నే లేకుంటే వాడెంత
నేను నేను నేను నేనని!
-రవికిషోర్ పెంట్రాల,
లాంగ్లీ, లండన్!