తెలుగు సాహితీవనంలో మట్టివాసనను, ప్రాంతీయ చైతన్యాన్ని అక్షర రూపంలో నిలిపిన ప్రముఖ కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు డాక్టర్ నందిని సిధారెడ్డి. ఆయన రచించిన కవితా సంపుటి ‘అనిమేష’కు 2025 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం తెలుగు భాషా సాహిత్యాలకు దక్కిన
అరుదైన గౌరవంగా భావించవచ్చు.
‘అనిమేష’ కవితా సంపుటి ఎంపిక కావడం కేవలం ఒక కవికి దక్కిన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు; తెలంగాణ భాషా సంస్కృతి, ప్రాంతీయ సాహిత్య చైతన్యానికి లభించిన జాతీయ గుర్తింపుగా కూడా భావించవచ్చు.డాక్టర్ నందిని సిధారెడ్డి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కవి. 1955 జూన్ 12న అప్పటి మెదక్ జిల్లాలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే భాషా సాహిత్యాలపై మక్కువ పెంచుకున్నారు. గ్రామీణ జీవన వాతావరణంలో పెరిగిన ఆయనకు మట్టివాసన, పల్లె జీవన రాగాలు, ప్రజల కష్టసుఖాలు లోతుగా అర్థమయ్యాయి. అదే అనుభవ ప్రపంచం ఆయన కవిత్వానికి మూలధారగా మారింది. విద్యార్థి దశ నుంచే సాహిత్య రచనలు ప్రారంభించిన ఆయన ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఆధునిక తెలుగు కవిత్వంపై లోతైన పరిశోధనలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆధునిక తెలుగు కవిత్వంలో ‘సూర్య ప్రతీక’ అనే అంశంపై ఎం.ఫిల్ చేసి, ‘ఆధునిక కవిత్వంవాస్తవికతఅధివాస్తవికత’ అనే అంశంపై డాక్టరేట్ సాధించారు. ఆధునిక కవిత్వంలోని రూపక నిర్మాణాలు, ప్రతీకలు, సామాజిక వాస్తవికత మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన తన పరిశోధనల ద్వారా విశ్లేషించారు.
కవిగా మాత్రమే కాకుండా ఉపాధ్యాయుడిగా, విమర్శకుడిగా, సాహిత్య చైతన్యకారుడిగా కూడా నందిని సిధారెడ్డి విశేష సేవలు అందించారు. ఆయన కవిత్వం తెలంగాణ అస్తిత్వ పోరాటంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నది. తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజల్లో ఆత్మగౌరవాన్ని రగిలించిన అనేక కవితలు ఆయన రచించారు. తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని కవిత్వంలో వ్యక్తం చేస్తూనే, సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను ప్రశ్నించే ధైర్యాన్ని ఆయన కలం చూపించింది.
ఈ సాహిత్య ప్రయాణంలో ‘అనిమేష’ కవితా సంపుటి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. కవి సమాజాన్ని, కాలాన్ని, మనిషి జీవనాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా పరిశీలించే దృష్టిని కలిగి ఉండాలని ఈ శీర్షిక సూచిస్తున్నది. కవిత్వం అనేది కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాకుండా సమాజాన్ని అర్థం చేసుకొనే ఒక ఆలోచనా ప్రక్రియ అని ఈ సంపుటి స్పష్టం చేస్తున్నది. ‘అనిమేష’లోని కవితలు మనిషి అంతర్ముఖ ప్రపంచాన్ని మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచంలోని సంఘర్షణలను కూడా ప్రతిబింబిస్తాయి.
భాషాపరంగా ‘అనిమేష’ కవితలు ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నాయి. తెలంగాణ మాండలికానికి చెందిన పదాలను సహజంగా ఉపయోగిస్తూ కూడా కవి సార్వజనీనమైన భావాలను వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషా మాధుర్యం, ఆధునిక కవిత్వపు మేధోపరమైన లోతు ఈ సంపుటిలో సమన్వయమై కనిపిస్తాయి. పల్లె జీవన చిత్రాలు, రైతు కష్టాలు, కార్మికుల పోరాటాలు, సామాన్య మనిషి ఆశలు, ఆవేదనలు ఈ కవిత్వంలో సజీవంగా ప్రతిఫలిస్తాయి. సామాజిక దృక్పథంరంగా కూడా ఈ సంపుటి ప్రాముఖ్యత కలిగినది. ‘అనిమేష’కు గౌరవం లభించడం ద్వారా తెలంగాణ సాహిత్య సంప్రదాయానికి మరింత గుర్తింపు లభించింది.
ఈ సంపుటి కేవలం ఒక కవితా గ్రంథం మాత్రమే కాదు; ఇది ఒక కాలాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్య సాక్ష్యం. నందిని సిధారెడ్డి కలం నిరంతరం సమాజాన్ని పరిశీలిస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నది. ఆ దృష్టి ‘అనిమేష’గా నిలిచినంత కాలం తెలుగు కవిత్వానికి కొత్త దారులు, కొత్త దిశలు చూపుతూనే ఉంటుంది.
-రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494