తెలుగు కవిత సృజన ప్రపంచంలోకి ఎన్.అరుణ ‘మౌనమూ మాట్లాడుతుంది’ అనే కవితా సంపుటితో ప్రవేశించడం నాటి సాహితీ లోకంలో ఒక ఆశ్చర్యం. విద్యార్థి దశలోనే సాహితీ సృజన చేసినా కుటుంబ బాధ్యతలకు అంకితమై నిశబ్దంగా ఉన్న అరుణ ఒక్కసారిగా కవిత్వాన్ని వెల్లువలా సృష్టించి వ చన కవితా చరిత్రలో తనదైన స్థానాన్ని అందుకున్నారు. అగ్నిపర్వతం బద్దలైతే ప్రమాదకరమైన లావా వెలువడుతుంది. అరుణ హృదయం బద్దలై కవిత్వ పరిమళ ప్రవాహం లోకాన్ని ముంచెత్తింది. మౌనం కొత్త వర్ణమాలను సృష్టించుకొని, సరికొత్త వ్యాకరణాన్ని అల్లుకొని మాట్లాడిన మాటలు పాఠకలోకంలో వినూత్న అనుభూతులను, ఆలోచనలను ఆవిష్కరించాయి.
‘నన్ను నేనెప్పుడూ వెతుక్కుంటూనే ఉంటాను/ మనస్సు నిండా చిన్న చిన్న శూన్యాలుంటాయి/ ఆ శూన్యాలకు భాష్యమే మౌనం’
అంటూ అరుణ మానవ లోకంలో అలుముకున్న శూన్యానికి తాత్విక కవితా భాష్యాన్ని పునర్లిఖించారు.
లౌకిక వ్యవహారాలను వదిలించుకొని, జీవిత రహస్యాలని అవగతం చేసుకొని, కాలం చేసే మార్మికతలను ఛేదించుకొని పరిణత మనసుతో నిండిన వ్యక్తిత్వంతో జీవన సౌందర్యాన్వేషణలో ఒక్కొక్కరు ఒక్కో తీరానికి చేరుకుంటారు. సృజనాత్మకశీలి అరుణ కూడా కవితాత్మక తీరానికి ఆలస్యంగానైనా చేరుకోవడం సహజమైన పరిణామమే. ‘లోకానికి అక్షరాలు అప్పుపడ్డాను/ అందుకే కవిత్వం రాస్తున్నా’, ‘ఋణశేషం నాకిష్టం లేని పని/ అందుకే నన్ను నేను అక్షరంగా మలచుకుంటున్నా’నంటూ విశిష్టమైన వస్తుశిల్పాలతో బలమైన వచన కవితా స్వరంగా శాశ్వత స్థానాన్ని పొందిన కవయిత్రి అరుణ.
దశాబ్ద కాలంలో ఎనిమిది కవితా సంపుటాలు సృజించటం సామాన్యమైన విషయం కాదు. ‘మౌనమూ మాట్లాడుతుంది’తో మొదలైన కవితాపథం ‘పాటల చెట్టు’గా మారి గుప్పెడు గింజల్ని వెదజల్లుతూ ‘అమ్మ ఒక మనిషి’ అని నిరూపిస్తూ ‘హృదయమే వదనం’గా ఆవిష్కృతమై ‘సూది నా జీవన సూత్రం’ అంటూ తన కవిత్వంలోని అంతస్సూత్రాలను ప్రకటిస్తూ ‘కొన్ని తీగలు కొన్ని రాగాలు’గా తన కవితా స్వరాన్ని పాఠక హృదయాల్లో ప్రతిధ్వనించేలా పలకరించారు.
బంగారం అనే ఒక లోహంపై ఈ మనుషుల మోహాన్ని ఎంత ఘాటుగా విమర్శించారో చూడండి.‘ఇది స్త్రీ హృదయ సౌందర్యాన్ని/ కప్పేసే కాలమేఘం భావనలను గాయపరిచే/ కన్నీటి లోహం/ ఇది మగవాడి ప్రేమ కాదు/రసికత ఇచ్చే కానుక /ఆడదాని బానిసత్వానికి ప్రతీక’ అంటూ నలుగురిలోకి వెళ్లినప్పుడు వ్యక్తి సంస్కారాన్ని, జ్ఞానాన్ని కొలమానాలుగా కాకుండా కేవలం లోహాభరణాలతో విలువ కట్టే సమాజంలో బంగారం ధర విపరీతంగా పెరిగితేనన్నా అది జీవితాల్లోంచి అదృశ్యమై మనిషి విలువ తెలుస్తుందని కవయిత్రి ఆకాంక్షించారు. ఆమె ఆకాంక్ష బలపడుతున్న సందర్భంలో అరుణ అదృశ్యమైపోవడం తీరని విషాదం. కవిత్వం-వ్యక్తిత్వం రెండూ తూర్పు పడమరల్లా వేర్వేరుగా ఉన్న కాలంలో అరుణ వ్యక్తిత్వం కవిత్వంలో ఉషోదయమంత వాస్తవికంగా దార్శనికతతో వ్యక్తమవడం విశేషం.
అరుణ అమ్మ ‘ఒక మనిషి’ వారి కవితా దృక్పథానికి ప్రతీక. అమ్మను లేదా స్త్రీని అక్షరాల్లో ఆకాశమంత ఎత్తుకు వర్ణిస్తూ ఆమె ఒక మహాకావ్యమని ప్రశంసించే లోకానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తారు. ‘అమ్మ గురించి/ కవిత్వం రాయకండి మిత్రులారా!’ అని వారిస్తూ ‘గోరుముద్దలు గుర్తున్నాయి గాని/ ఇవ్వాళ ఆమెకో ముద్దపడేస్తున్నారా?’ అని సూటిగా ప్రశ్నిస్తారు. అందుకే ‘అమ్మను/ దేవతను చేయకండి మిత్రులారా/ మనిషిగా గుర్తిస్తే చాలు’ అంటారు. అరుణ వాక్యం వారి లాగానే నిరాడంబరంగా వెలిగిపోయింది. వస్తువేదైనా దాన్ని కవిత్వంతో నింపారు. మూలాలను మరిచిపోకుండా తనను తాను అక్షరాల్లోకి అనువదించుకొని సాంత్వన పొందారు. అందువల్లే వారి కవితాక్షరాలు తామరాకు మీద నీటిబొట్టులా తాత్వికంగా పలకరించాయి. అంతలోనే అవి మన మనసులోకి జారిపడి ముత్యాల్లా మారిపోయి మిల మిలలాడుతూ జీవిత అర్థాలను విప్పి చెప్పాయి. అందుకే, అరుణ విశ్రాంత వర్గ కవి కాదు. ‘వచ్చేటప్పుడు ఏం వెంట తెచ్చానో తెలియదు/ పోయేటప్పుడు ఏం తీసుకెళ్తానో కూడా తెలియదు/ ఈ అనుభవాలు, జ్ఞాపకాలే కదా జీవితం’ అంటూ అరుణ సాహితీ అభిమానుల్లో ఒక చెరగని కవితా జ్ఞాపకంగా నిత్యం వెలుగులీనుతుంటారు.
– డాక్టర్ జె.నీరజ