తెలంగాణ భక్తి సాహిత్య ప్రపంచంలో మౌళిత్రయం స్థానం విశిష్టమైనది. వీరు తమదైన శైలిలో, ఎలాంటి ప్రచారార్భాటాలు లేకుండా తమ సాహిత్య సేద్యాన్ని కొనసాగించారు. ప్రజల నాలుకల మీద వారి సాహిత్యం నిలిచిపోవడం, ఇక్కడి జీవనంలో అది భాగమైపోవడం విశేషం. తెలుగు, సంస్కృత భాషల్లో వీరు ఆణిముత్యాల్లాంటి రచనలు చేశారు. ఇప్పటికీ అవి అజరామరంగా నిలిచిపోయాయి.
మౌళిత్రయంలో మొదటివారు విఠాల చంద్రమౌళిశాస్త్రి, రెండోవారు విఠాల రాజమౌళిశాస్త్రి, మూడోవారు రుక్మాభట్ల విధుమౌళిశాస్త్రి. వీరి సాహిత్య సేవ బహుధా ప్రశంసలు పొందింది. మౌళిత్రయ కవులకు సంగీతసాహిత్యాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఆధ్యాత్మక చింతన ఆనువంశికంగా పితృపితామహుల ద్వారా అబ్బినాయి. పఠన, ప్రవచనం, ప్రబోధకం త్రివేణిలా వారిలో సంగమించాయి. సమాజ సంక్షేమమే లక్ష్యంగా భక్తిమార్గాన్ని ఎంచుకుని పాండితీ గరిమతో కూడిన సాహిత్య సేవ చేశారు. మూఢత్వం నుంచి ప్రజలను భక్తిమార్గం వైపు మళ్లించేందుకు తమవంతు కృషి చేసి చరితార్థులయ్యారు.
ముగ్గురు సోదరులు విఠాల వంశంలో జన్మించినా.. మూడో సోదరుడు దత్తుపోవడంతో ఇంటి పేరు మారింది. అగ్రజుడైన చంద్రమౌళిశాస్త్రి బాసరలో సరస్వతీ అమ్మవారి సన్నిధిలో దీక్ష చేసి అక్షరానుగ్రహం పొందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో శతావధానం చేసి మెప్పించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి అవధానాలు, హరికథా కాలక్షేపాలు, భజనలతో ప్రజలను ఆయన అలరించేవారు. కావ్యపురాణ పఠనాలతో పాటు వేదాంతాన్ని బోధిస్తూ కవిగా, పండితునిగా, ఉపాసకునిగా విశేష కీర్తిని పొందారు. పండితపామరుల మన్ననలు పొందారు. తన అఖండ ప్రతిభతో శిష్యప్రశిష్యులను ఎందరినో తీర్చిదిద్దారు.
సాహితీ సేద్యంలో అమూల్య రత్నాలను పండించారు. గాయత్రీమాతపై భక్తసంపత్ప్రదాత్రి అనే మకుటంతో మాతృప్రేమ, శీరామునిపై మేలుకో మేలుకో శీరామ మకుటంతో శ్రీరామ ప్రబోధం వెలువరించారు. దేవీ భాగవతంలోని దేవీగీతకు టీకా తాత్పర్యాలు రాసి పుస్తకంగా వేశారు. జ్ఞానవాసిష్టంలోని ప్రశ్నోత్తర మాలికా శ్లోకాలను శ్రీరామ ప్రబోధం పేరిట అనువదించి గ్రంథరూపంలో వెలువరించారు. విశ్వానర స్తోత్రాన్ని తెలుగులో గద్యపద్య రూపంలో అనువదించి శివలీల రాశారు. ప్రియతమ శిష్యుడు, అష్టావధాని యామవరం రామశాస్త్రితో కలిసి తొలినాళ్లలో కుమార సల్లాపం అనే గ్రంథం రాశారు. ఇదే శిష్యునితో కలిసి తర్వాతికాలంలో చుంచనకోట త్రిపుర సుందరీ శతకాన్ని రాశారు. ఇందులో చంద్రమౌళిశాస్త్రి మొదటి ఎనిమిది మత్తేభాలను (మత్తేభాష్టకం) రాశారు. ఇవే కాకుండా అనేక భజనలు కూడా రాశారు. మహాలక్ష్మి భజనలు, భువనేశ్వరి బాలా భజనలు, రాధాకృష్ణ దీనాలాపం, వీరాంజనేయ భజన మొదైలనవి పుస్తకాల రూపంలో వచ్చాయి.
మౌళిత్రయంలో రెండోవారైన రాజమౌళిశాస్త్రి సంగీత, సాహిత్యాలను ఔపోసన పట్టారు. రాగయుక్తంగా హరికథ చెప్పడంలో అద్వితీయమైన కీర్తిప్రతిష్ఠలు పొందారు. స్వయంగా బాణీలు కట్టుకుని పాడేవారు. పద్య, గద్య, సంకీర్తనాత్మక హరికథలను స్వయంగా రాసి ప్రదర్శించేవారు. భావానంద రామాయణం మొదలైన హరికథలను ఆయన రాశారు. మెదక్ మండల సాహిత్య పరిషత్తు ద్వారా సాహిత్య కార్యక్రమాలు, అలాగే లెక్కలేనన్ని భాగవత సప్తాహాలు నిర్వహించారు.
మూడోవారైన విధుమౌళిశాస్త్రి భక్తిప్రచారోద్యమంలో విస్తృత కృషి చేశారు. ఆయన స్వయంగా 108 భజన సంఘాలను ప్రారంభించారు. భజన మండళ్ల ద్వారా ఆట, పాటలతో రామభక్తిని ప్రచారం చేశారు. భజన సంఘాలను ఒకేచోటికి చేర్చి సిద్దిపేటలో 50 వేలమందితో అఖండ నామసంకీర్తనం నిర్వహించి ఖ్యాతి పొందారు. శ్రీరామ పదపరాగ్గా పేరొందారు. ఆయన రాసిన భజనలు నేటికీ వినిపిస్తుంటాయి. వీరి రచనల్లో ముఖ్యమైనవి తందనాన గేయకావ్య పరంపరలో రాసిన రామాయణం, భారతం, శివలీలలు, కృష్ణలీలలు, ఉత్తరరామాయణం పుస్తకరూపంలో వచ్చి పండితుల ప్రశంసలు పొందాయి. ఎరుకల నాంచారి అనే బుర్రకథ కూడా పుస్తకరూపంలో వెలువరించారు. గ్రంథస్థం కానటువంటి భజనలు, మంగళహారతులు ఎన్నో ఉన్నాయి.
ఇలా ఒకే కుటుంబం నుంచి ఈ ముగ్గురు సోదరులు భక్తిసాహిత్యంలో విశేష కృషిచేసి ప్రజాభిమానం చూరగొని ఇక్కడి ప్రజల సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మౌళిత్రయ సాహిత్యంపై జరిపిన పరిశోధనకుగానూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పార్నంది రామకృష్ణ డాక్టరేట్ పట్టా పొందారు.
– ఎడిటోరియల్ డెస్క్