నాకు గ్యావ తెలిపినప్పటి నుంచి
అవ్వ మబ్బుల్నే నిద్ర లేచేది
నిద్రబోయిన ఆకలిని లేపి
శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టేది
రాత్రి పూసుకున్న బాసన్లకు తానం పోసి
వాటిని భద్రంగా శిక్కంలో శెక్కేది…
సూర్యుడు డ్యూటీ ఎక్కకముందే
పూట కోసం కోసెడు దూరం కూలికి పొయ్యేది
పగటి పూట ఎండిన పేగులకు
మెత్తబడిన బువ్వలో నీళ్లు పోసుకొని పిస్క తాగి
మా పేదరికాన్ని అవ్వ కొంగుచాటున దాచేది
సూర్యుడిని చీకట్లు మింగేసిన తర్వాత
మెల్లంగ అవ్వ ఇంటికి చేరేసరికి
అయ్య సుతారి పన్జేసి సుక్కేసుకొని
అచ్చి ఇల్లంతా ఈరంగం జేసేటోడు
అవ్వ పొద్దంతా చెమట చుక్కలు చిందిస్తే
రాత్రి మాత్రం అవ్వ కన్నీళ్లను కార్చేది
అవ్వ ఆరగించిన రోజుల కన్న
కడుపును ఆరబెట్టిన రోజులే ఎక్కువ
అవ్వ చినిగిన చీరను కుట్టుకుంటూ
అవమానాల వంతెనను దాటుకుంటూ
అతుకుల సంసారాన్ని ఈదుతుండేది
మెడ మీద పిసరంత పసిడి లేకున్న
అవ్వ ఆయమన్న చీరను కట్టకున్న
ఎప్పుడూ నిరాశల నీడలను ఒంపుకోలేదు
అవ్వ కూలి చేసి కూడబెట్టిన కాసులతో
దసరా పండుగకు పట్టించిన అంగీని
ఇప్పటికీ నా అల్మారలో పదిలంగా దాచుకున్న
అవ్వకు అక్షరాల పోకడ తెల్వకున్నా
నాకు సదువుల సారాన్ని తాగించింది
అవ్వకు ఏమిచ్చి రుణం తీర్చుకోను
ఆమెకు సేవ చేయడంలో తరించడం తప్ప..
– తాటిపాముల రమేశ్ (తార) 79815 66031