ఆధునిక కాలంలో అనేక కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాల ఆదరణ కోల్పోవడం ఒక కారణమైతే, కార్పొరేట్ సంస్థలు వాటి అధీనంలోకి కులవృత్తులను తీసుకోవడం రెండో కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు వాటికి నచ్చిన ధరకు మార్కెట్ చేయడం ద్వారా కులవృత్తిని జీవనాధారం చేసుకొని బతుకుతున్న ఎన్నో కుటుంబాలు నేడు ఆకలితో అలమటిస్తున్నాయి.
నానాటికి ఆదరణ తగ్గుతున్న కులవృత్తుల్లో ఒకటి నాయీ బ్రాహ్మణ వృత్తి (మంగలి వృత్తి). వీరి చేతిలో దువ్వెన, కత్తెర ఆడితేనే వారి బతుకులు తెల్లారుతాయి. ఈ వృత్తిలోని సాధక బాధల గురించి, ఆ వృత్తినే చేస్తూ ‘అసిపె’ అనే దీర్ఘకవిత సంకలనం ద్వారా మన ముందుకువచ్చారు కవి వనపట్ల సుబ్బయ్య. ‘అసిపె’ అంటే మంగలి వృత్తి వారు ఉపయోగించే ఆయుధాలు అంటే… కత్తులు, గోరుగాలు, పటికె, దువ్వెన, అద్దం తదితర వస్తువులు పెట్టుకునే పెట్టె అని అర్థం. ఈ దీర్ఘకవితలో ప్రజాస్వామ్య ఫలాలు దక్కని బహుజనవాదుల దీన అవస్థలను కవి చక్కగా కవిత్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తుల వాళ్లందరూ ఏకమై పరస్పర సహకారంతో ముందుకుసాగుతూ ఒక బలమైన గొంతుకై చట్టసభల్లో వారికి సముచిత స్థానం కలిగేలా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం బహుజన వాదాన్ని తన కలం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న మంగలి వృత్తిని చేస్తూ తన నాయినను తన వృత్తిలో చూసుకుంటూ కవిత మొదలవుతుంది.
ఈ వృత్తిని అవమానించే సామెతలను చూస్తే.. (పేజీ 87) ‘చాకలి మంగలి పొత్తు ఇంటికి రాదిత్తు’, ‘సక్కగ కూసోర సాకలి నాయాలా అంటే ఇంటివే ఈడిగెంకటయ్య మంగలి తొత్తు మాట’, ‘పని లేని మంగలి పిలిచి తల కొరిగిండట’ ఇలా పనిలేని వెదవలు కూసే సామెతల నోళ్లను ఫినాయిల్‌తో కడగాలని ఉందంటాడు కవి. ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనుషుల్లో అజ్ఞానం పోలే ఇంకా మూఢాచారాలను నమ్ముతూ మంగలోడెదురుంగొస్తే అపశకునమని మంగలోన్ని చూసి ‘దున్నపోతు కుట్టిందంట’ లాంటి అవహేళన పదాలు వారి వృత్తిని కించపరిచేవిధంగా మాట్లాడుతూ వారి హృదయాలను చిత్రవధకు గురిచేస్తుంటారు. శుభ్రంగా ఉండాలనే ఇంగితజ్ఞానం లేకుండా, ముఖాలు కడుక్కోకుండా, పళ్లు తోమకుండా, పాచి ముఖాలు, నోటినిండా కంపుతో ముందు కూర్చుని కటింగ్ చేయమని, సంక లేపంగానే చచ్చిపోయేంత వాసనను భరిస్తూ, చేతి, కాళ్ల గోర్లను, ఆనెలు తీస్తూ వృత్తినే దైవంగా, గౌరవంగా చూస్తూ, మానవ సేవనే మాధవ సేవ అని భావిస్తూ వారి వృత్తిని చేస్తుంటారు మంగలివాళ్లు.
ఈ దీర్ఘ కవితలో మంగలోళ్లంతా ఎలా నలిగిపోతున్నారో, వారి జీవితాలు అగమ్యగోచరంగా ఎలా కొనసాగిస్తున్నారనేది వివరిస్తూ వనపట్ల సుబ్బయ్య మంగలి వృత్తిలోని ఆవేదనను, బాధలను ప్రపంచానికి తెలియజేయాలనే తాపత్రయం కనబడుతుంది. ఇలాంటి దీర్ఘ కవితలు ఇప్పుడు అన్ని కులవృత్తులపై రావాలి. అప్పుడే ప్రజల్లో, కులవృత్తులపై ఆదరాభిమానాలు పెరుగుతాయి. ‘అసిపె’ ఊహాజనితమైన కావ్యం కాదిది, శ్రమైకజీవుల చెమట చుక్కల్లో నుంచి వచ్చిన ఆత్మగౌరవ ప్రతీక. చక్కటి శ్రమైక జీవన సౌందర్య కావ్యాన్ని మనకందించిన వనపట్ల సుబ్బయ్యను అభినందిస్తూ మరెన్నో సాహితి సంకలనాలను తీసుకురావాలని ఆశిస్తూ…
– గాజోజి శ్రీనివాస్ 99484 83560