మహాభారతం అనగానే తెలుగువారికి ముందుగా శ్రీకృష్ణపరమాత్మ, కౌరవ పాండవులు, భగవద్గీత ఎలా యాదికి వస్తాయో.. శ్రీకృష్ణ రాయబారం కూడా అలాగే యాదికొస్తుంది. తెలుగు భాష మీద, తెలుగు పద్యాల మీద, తెలుగు పౌరాణిక సినిమాల మీద కాస్త పట్టు ఉన్నవారికి తిరుపతి వేంకట కవులు రాసిన ‘పాండవోద్యోగ విజయములు’లోని పద్యాలు, అదిగో ద్వారక..శ్రీకృష్ణుని పడకసీను పద్యాలు వంటివి కూడా యాదికి వస్తాయి. ఇక శ్రీకృష్ణ రాయబారంలోని ‘మామా సాత్యవతేయి పౌత్ర… తమ్ముని కొడుకులు సగ పాలిమ్మనిరి… అటుల యిష్టపడరేనియు అయిదూళ్లిమ్మనిరి అయిదుగురకు..
చెల్లియో చెల్లకో తమరు సేసిన యెగ్గులు సైచిరందరున్..’ వంటి పద్యాలు గుర్తుకొస్తాయి.వేదవ్యాస భగవానుడు సంస్కృత భాష లో జయసంహిత పేరుతో మహాభారతాన్ని మొదట రాశారు. పంచమ వేదం అనదగిన మహాభారతం వేదవ్యాస మహర్షి రచన అన్నది ఎంత నిజమో.. మహాభారతంలోని సత్యవతీ సుతుడు సాత్యవతేయుడు కృష్ణద్వైపాయన వేద వ్యాసుడు అన్నది అంతే నిజం. కాబట్టి, వేద వ్యాసుని మహాభారతం రచన వాస్తవానికి అతి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాస మహాభారతాన్ని చాలామంది కవులు వివిధ భాషల్లోకి అనువదించారు. మనం కవిత్రయంగా పిలుచుకు నే నన్నయ్య, తిక్కన, ఎర్రనలు తెలుగులో అనువదించారు. అంతేకాదు, దీని ఆధారంగా అనేక నాటకాలు, సినిమాలు వచ్చాయి.
తెలుగులో మహాభారత వృత్తాంతం ఆధారంగా వచ్చిన అనేక సినిమాలు కథాపరంగా గాడి తప్పాయి. ముఖ్యంగా రాయబారాల విషయానికొస్తే శ్రీకృష్ణ రాయబారం ఒక్కటే మన సినిమాల్లో ఉంటుంది. నిజానికి వ్యాస మహాభారతంలో నాలుగు రాయబారాలు ఉంటా యి. కవిత్రయం రాసిన
మహాభారతంలోనూ నాలుగు రాయబారాలుంటాయి. కానీ, శ్రీకృష్ణ రాయబారం మాత్రమే తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది. అది తెలుగు నాటకాలు, సినిమాల ప్రభావమేనని చెప్పవచ్చు.
ఇక మహాభారతంలోని రాయబారాల విష యానికొస్తే.. పాండవుల అరణ్యవాసం, అజ్ఞాత వాసం పూర్తయ్యాక విరాటరాజు ఉత్తర గోసంర క్షణ విషయంలో కౌరవులకు, అర్జునునికి నడుమ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడి దే పైచెయ్యి అవుతుంది. కర్ణుడు కూడా ఓడిపోతా డు. ఆ తర్వాత విరాట మహారాజు, శ్రీకృష్ణుడు, ద్రుపదుడు, బలరాముడు, సాత్యకి, పాండవు లు, వారి హితులు ఒకచోట సమావేశమవుతారు. అప్పుడు పాండవుల రాజ్యం గురించి శ్రీకృష్ణుడు ప్రస్తావిస్తాడు. సమావేశంలోని అందరి ఆలోచనలను మన్నించి ద్రుపదుడు తన అగ్ర పురోహితుడిని కౌరవుల వద్దకు రాయబారిగా పంపుతాడు. ఇదే మొదటి రాయబారం. దీన్నే బ్రాహ్మ ణ రాయబారం అంటారు.
హస్తినలో బ్రాహ్మణ రాయబారం జరుగుతుంది. పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయని, వారి రాజ్యం వారికివ్వాలనే అంశమే బ్రాహ్మణ రాయబారంలో ఉంటుంది. ఆ తర్వాత హస్తినలోనూ రాయబారం అంశం చర్చకు వస్తుంది. సంజయుడిని కౌరవులు తమ రాయబారిగా పంపుతారు. ‘ఏదేమైనా యుద్ధం వద్దు. సుయోధనుడు ఎవరి మాట వినడు. మీరు రాజ్యాన్ని కోరవద్దు..’ అన్నట్లు ఈ రాయబారం సాగుతుంది. అప్పుడు తానే కౌరవసభకు వస్తానని సంజయునితో శ్రీకృష్ణుడు చెబుతాడు. పాండవుల వద్ద నుంచి వచ్చిన సంజయుని మాటలు విని మొదట ధృతరాష్ర్టుడు భయపడతాడు. ఇక్కడే విదుర నీతులు ఉంటాయి.
ఆ తర్వాత శ్రీకృష్ణ రాయబారం ఉంటుంది. ఇది మూడో రాయబారం. హస్తినకు వచ్చిన శ్రీకృష్ణుడిని ధృతరాష్ర్టుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. శ్రీకృష్ణుడు మరుసటి రోజు తను వచ్చిన విషయం చెప్పడానికి కౌరవసభకు వెళతాడు. అక్కడ జరిగిన చర్చే శ్రీకృష్ణుడిని బంధించే వరకు వెళ్తుంది.
ఆ తర్వాత శకుని కుమారుడైన ఉలూకుని రాయబారం ఉంటుంది. ఇది నాలుగవ రాయబారం. ఇది తొడగొట్టు, మెడకొట్టు, పడగొట్టు అన్నట్లు ఉంటుంది. ఇలా మహాభారతంలో నాలుగు రాయబారాలు ఉంటాయి. ఈ నాలుగు రాయబారాలను నిశితంగా పరిశీలిస్తే, ఇవి సామదానభేదదండోపాయ ధర్మాలను కలిగి ఉంటా యి. ఓవైపు యుద్ధ సన్నాహాలు చేసుకుంటూనే కౌరవ, పాండవులు రాయబారాలను నడిపిస్తారు.
ఒకసారి తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే కవిత్రయం అనువదించిన మహాభారతం, రకరకాల ప్రక్రియల్లో మహాభారతాలు రాసిన కవులు స్వేచ్ఛ పేరుతో అందులోని పాత్రల గుణగణాలను ఇష్టం వచ్చినట్లు మార్చేశారని చెప్పక తప్పదు. అలాగే వ్యాస భారతంలో లేని అనేక కట్టుకథలను కల్పించి రాశారు. ఇదెంత వరకు సమంజసం.
ఉదాహరణకు నన్నయ్య, తిక్కన, ఎర్రనలు అంటే ఇష్టం ఉన్నవారు వారి భారతమే వాస్తవం అంటారు. అంతేతప్ప, వ్యాస భారతాన్ని పరిశీలించరు. అభిమానం హద్దులు దాటితే అవాస్తవమే వాస్తవం అవుతుంది. నేటి సినిమాల్లో జరుగుతున్నది అదే. కాబట్టి, ఇప్పటికైనా మన వేద పురాణేతిహాసాల మీద అభిమానం ఉన్న పండితులు వాస్తవాలను గ్రహించాలి. లేకుంటే రాముడుకు సీత ఏమవుతుంది? పంచ పాండవుల్లో అర్జునుడు ఉంటే బాగుంటుందా? కర్ణుడు ఉంటే బాగుంటుందా? అనే అర్థ రహిత చర్చలే అగ్రపీఠాన నిలుస్తాయి.
-వాగుమూడి లక్ష్మీరాఘవరావు
62814 90160