స్వప్నంలో సాక్షాత్కరించిన రామభద్రుండే తనకు భాగవతం రచన ఆదేశించినందువల్ల, తనకు భవహరం కాగలదని నమ్మి రాసిన పోతన భాగవత రచన ఒక గంగా ప్రవాహం వలె సాగినది. పోతన భాగవతం అంతా భక్తి రసావేశంతో కూడుకున్నదే. త్యాగరాజు వంటి రామభక్తుడు, వాగ్గేయకారుడు పోతన భాగవతాన్ని చదివి పులకాంకితగాత్రుడై తన పదాలను పాడుకొన్నాడనీ, ఇంకా ఎందరో మహానుభావులు పోతనచే ప్రభావితమై కావ్యరచన గావించినారని చెప్పిన సందర్భంలో కుల, మత, ప్రాంత, తరగతుల విభేదాలు లేక ప్రజలంతా రోజుల తరబడి విని తరించే గ్రంథంగా పోతన భాగవతం నిలిచింది అని అభిప్రాయపడతారు దేవులపల్లి
సారస్వత పరిషత్తు పక్షాన సారస్వత వేదిక ప్రారంభోపన్యాసంలో తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం పొందని సాహిత్యాన్ని, ప్రత్యేకించి కవిత్వం గూర్చి మాట్లాడుకోవడం సముచితమనీ, ముఖ్యంగా తెలుగులో తొలి సమాజ కవుల రచనలను ఆ ఏడు (1981) స్మరించుకోవడం సముచితమని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కవుల గూర్చి వీరి ప్రసంగం ద్వారా తెలుసుకుంటాం. భక్తితత్వము ఈ సమాజ కవుల రచనలతో ప్రస్ఫుటిస్తుంది. సమకాలీన సమాజం వీరి రచనలలో ప్రతిబింబిస్తుంది. ‘భక్తి తత్వ కవులు-సామాజిక భూమిక’ ఈ ప్రసంగ శీర్షిక.
నన్నయకు ముందునుంచే తెలుగు భాష రెండు పాయలుగా చీలినట్లు కనిపిస్తుంది. మొదటిది పండితులు ఉపయోగించిన కావ్య భాష కాగా, రెండవది జానపదులకు ఆటపైట్టెన వ్యవహార భాష. ఇందుకు ఉదాహరణగా అన్నమయ్య మున్నగు కవులు సాధారణ జన హృదయాలను చేరేవిధంగా రచనలు చేశారని చెప్పుకొస్తారు రామానుజరావు.
‘వేమన్న కవి కాదు’ అన్న పండితులు
కూడా ఉన్నారని చెప్తూ, తెలుగు భాషను సంపన్నం చేసిన తాళ్ళపాక కవులకు రాజుల ఆదరణ లభించలేదంటారు ఉపన్యాసకులు. ‘సింహగిరి వచనాలు’ రాసి తెలుగులో వచన కవితకు మార్గదర్శకుడైన కృష్ణమాచార్యుడు 14వ శతాబ్దంలో భక్తి మార్గాన్ని ప్రబోధించాడు. అన్నమయ్య, గురజాడ, వేమన, వీరబ్రహ్మం, సిద్ధప్ప లాంటి కవులు సమకాలీన సమాజ సంస్కరణలకు సరళ, దేశీయ భాషలలో రచనలు చేశారని వారి రచనలు పదాల్లా, పాటల్లా జనుల నాల్కల మీద నడయాడినవంటారు. ఆ విధంగా ఆ కవులు సమాజ శ్రేయస్సుకు తోడ్పడ్డారంటారు రామానుజరావు.
ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు పూజ సల్పితినో యేను పూర్వమందు కలదయేని పునర్జన్మ కలుగు గాక మధుర మధురమైన తెనుగు మాతృభాష!
మధ్యకాలపు రాచరికము, నిరంకుశ పాలన, పాలకుల శ్రేయస్సే ప్రధానంగా, ప్రజల మాతృభాషలను ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తూ, దుర్నీతితో సాగే నిజాం దుష్టపాలన ఎండగట్టడానికి ఎందరో మహానుభావులు, త్యాగధనులు ముందు వరుసలో నిల్చున్నారు. వారిలో అగ్రగణ్యులు సురవరం ప్రతాపరెడ్డి, మాతృభాషా వికాసం, ప్రజాస్వామ్య స్థాపన, సంఘ సంస్కరణ ధ్యేయంగా సమాజ సేవకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీ యం. అందుకే రామానుజరావు ఈ ప్రసంగంలో తెలంగాణ వైతాళికుడిగా వర్ణిస్తారు సురవరంను. అనేక ఒత్తిడులు, ప్రతిబంధకాల నడుమ ‘గోలకొండ’ పత్రికను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్లిన ధీశాలి సురవరం. పద్యం, కవిత్వం, కథ లు, నవలలు, నాటకాలు, వ్యక్తి చిత్రణ మున్నగు సాహితీ ప్రక్రియల్లో ఆరితేరి దాదాపు 40 గ్రంథాలు ప్రకటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞాన ఖని సురవరం అంటారు దేవులపల్లి.
తెలుగుదేశంలో వైతాళికులైన మహనీయులనేకులున్నప్పటికీ తమ స్వీయ చరిత్రలను రాసిన వారు కొద్దిమందే. తెలుగులో స్వీయచరిత్ర రాసిన మొదటి వ్యక్తి వీరేశలింగం పంతులు అని చెప్తూ, సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో తెలుగులో తొలి వైతాళికుడు పంతులు అంటారు రామానుజరావు ‘తెలుగులో వెలువడిన స్వీయ చరిత్రలు’ అనే ప్రసంగ పాఠంలో. ఇంకా అయ్యదేవర కాళేశ్వరరావు, చిలకమర్తి లక్ష్మీనర్సింహం, ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య పంతులు, గొట్టిపాటి బ్రహ్మయ్య, ఆదిభట్ల నారాయణదాసు, సంజీవదేవులు తమ స్వీయచరిత్రలు రాసి ప్రకటించిన వారిలో ఉన్నారట.
అయితే, ఆనాటి తెలంగాణ పరిస్థితులు తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆత్మకథలు మూడు మాత్రమే అని చెప్తూ కేవీ రంగారెడ్డి స్వీయచరిత్ర; మందుముల నరసింగరావు ‘యాభై సంవత్సరాల హైదరాబాద్’ రావి నారాయణరెడ్డి ‘వీర తెలంగాణ’ అంటూ ఈ గ్రంథాలు ఆ నాటి పరిస్థితులు, ఆంధ్రోద్యమ – రాజకీయోద్యమాలు, హైదరాబాద్ విమోచనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మాత్రమే గాక వారి వారి జీవిత వివరాలనూ, అనుభవాలనూ పేర్కొంటున్నాయని ముక్తాయిస్తారు దేవులపల్లి.
ఈ పుస్తకంలోని ‘ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్య్రోద్యమము-కొన్ని జ్ఞాపకాలు’ అనే చివరి ప్రసంగంలో, ప్రత్యేకంగా ఏ ఒక్క నాయకుడికో అనుచరుడిగా కాక, స్వతంత్రంగానే తాను ఆంధ్రోద్యమాన్నీ, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాన్నీ బలపరచడం జరిగిందని చెప్పుకుంటారు రామానుజరావు. సరోజినీ నాయుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ సీవీ రామన్ల ఉపన్యాసాలు రామానుజరావును బాగా ఆకట్టుకునేవట. కట్టమంచి రామలింగారెడ్డి ఇంగ్లీషు, తెలుగు ఉపన్యాసాలు అద్భుతంగా ఉండేవంటారు. స్వర్గీయ బీఆర్చారి సంపాదకత్వంలోని ‘తెలంగాణ’ దినపత్రికకు వీరు అనేక వ్యాసాలు రాశారట.
స్వతంత్ర భారతదేశం గూర్చి తాను కన్న కలలు నిజం కాలేదని దేశ స్వాతంత్యానంతర పరిస్థితులను చూసి వాపోతారు దేవులపల్లి. ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం, విశ్వజనీనమైన నైతిక విలువలు ప్రధాన ప్రాతిపదిక కలిగిన రాజకీయ వ్యవస్థ ఏర్పడాలని తన అభిలాషను వ్యక్తం చేస్తారీ ప్రసంగంలో. ఈ విధంగా రామానుజరావు ‘ఉపన్యాస తోరణం’ గ్రంథ పఠనాసక్తికీ, విజ్ఞాన సంపదకూ, పరిశీలనా పటిమకు, పరిశోధనా తత్వానికి, మానవీయ విలువలకు, భాషా సేవకు, ఉపన్యాస ప్రతిభకు ప్రతీకయై తెలంగాణ సారస్వత ముద్దుబిడ్డగా తెలుగు సాహితీ లోకంలో వారి స్థానాన్ని పదిలపరిచింది.
-డాక్టర్ వాణీ దేవులపల్లి
9866962414