గట్లుంటది..
‘నూలు బట్టలు కట్టుకుంటే నేల మీద కూర్చున్నా ఏమనిపించదు. పీతాంబరం కట్టుకుంటేనే పీట అవసరం’… ఇలా చెప్పడమే కాదు, బతికున్నన్నాళ్లూ నూలు బట్టలు కట్టుకున్న ఆ పండితుడిని ఎలా మరచిపోతాం. సంగీత, సాహిత్య నిధి సామల సదాశివ గారిని యాది చేసుకోకుండా ఎలా ఉంటాం.
సాహిత్యం సరే, సంగీతం గురించి మన బండ బుర్రలకు అర్థమయ్యేలా చెప్పేవారేరీ ఆయన ముందు కానీ, ఆ తర్వాత కానీ. అందుకే, ఈ సామల సదాశివ గారంటే తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు ప్రాణం పెట్టేవారు. అప్పటికి సదాశివ గారు చిన్నపిల్లాడు కదా. ‘మా ఊరు ఆదిలాబాద్ మీ అందరికీ దూరం. అందుకే మీరెవ్వరూ మా ఊరు రారు. ఒక్కసారి రాండ్రి. ఎంత బాగా చూసుకుంటామో తెలుస్తది’ అంటూ తల్లావఝుల వారు, విశ్వనాథలతో పాటు పెద్దల ముందు కాసింత అలక ప్రదర్శించారు సదాశివ గారు. ‘అది కాదులే నాన్నా.
ఈసారి సాహిత్య సమావేశం పెట్టు. మేం వస్తాం’ అని సదాశివగారికి ప్రేమగా హామీ ఇవ్వడమే కాదు, వెళ్లారు కూడా అనేకమంది ప్రముఖులు. తనకు గుర్తున్న సంగతులు, చూసిన, చదివిన, అనుభవించిన అనేక విషయాలన్నీ కలిపి ‘యాది’ అంటూ పుస్తకం వేస్తే ఆ కవర్ పేజీ మీద ఏదో ఆలోచనలో ఉన్న సదాశివ గారి కాళ్ల దగ్గర ఓ కుర్రాడు చాలా శ్రద్ధగా, వొద్దిగ్గా కూర్చునుంటాడు. ఆయన ఏం చెప్తారో విందామనే ఆరాటం కనిపిస్తుంది ఆ కుర్రాడిలో. ఇంతకీ ఆ కుర్రాడెవరో తెలుసా… తెలుగు పాఠకులే. సంగీతాభిమానులే. సాహిత్య ప్రేమికులే. గజళ్లకు, ఉర్దూ కవిత్వానికి ఆయన చేసే అనువాదాలు చదువుదామనే ఆశ ఆ కవర్ పేజీ మీద కనిపిస్తుంది. ఈ కవర్ పేజీ బొమ్మ వేసింది ఆర్టిస్టు చంద్రే కానీ ఆ బొమ్మ నిండా ఆనాటి తెలుగు పాఠకులే ఒక్కరై కూర్చున్నారనిపిస్తుంది.
కురుక్షేత్రం నాటకంలోనో, రాయబారంలోనో, సత్యహరిశ్చంద్ర కాటి సీనులోనో నటీ నటులు పలికే పదాల చివర వచ్చే ఆలాపనలు వినే ఉంటారు కదా… ఆ రాగాలాపనలకు మూలం ఉత్తరాది అని… మరీ ముఖ్యంగా మహరాష్ట్ర సంప్రదాయం అని రుజువులతో సహా చెప్పింది ఈ సామల సదాశివ గారే. ఇంతేకాదు… సంగీత కచేరీల్లో పక్క వాయిద్యాల గురించి పెద్దగా చర్చించుకోని సమయంలో వాటి పుట్టుక, జన్మస్థలం ఇదర్రా అని చెప్పింది ఈ మహా పండితుడు సామల సదాశివ గారే.
గజల్స్ విన్నాం కదా… ఆ ఉర్దూ గజల్స్ని తెలుగు వారికి పరిచయం చేసింది తొట్ట తొలుత సదాశివ గారేనని, ఆయన చెప్పేవరకూ ప్రాచీన సంగీతం గురించి పెద్దగా తెలిసినవారు లేరని నాకు ఆధారాలు చూపిస్తూ వివరించింది మరో పండితుడు బూదరాజు రాధాకృష్ణ గారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాట సమయంలో బయట ఏం జరుగుతుందో ఉద్యమకారులు తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా రేడియో రూపొందించిన బృందంలో ఉన్నదీ ఈ సామల సదాశివ గారే.
Dear Friend తొందర్లో ఏదో రాసినాను. ఏమీ అనుకోకండి అంటూ సదాశివ గారికి ఓ కార్డు వచ్చింది. ఇలా రాసింది ఎవరో కాదు… విశ్వనాథ సత్యనారాయణ. దీనికి కారణం ఏం లేదు. విశ్వనాథ గారి గురించి రాసిన ఓ వ్యాసానికి ఫొటో పంపమని సదాశివ గారు కార్డు రాస్తే… ‘మీరు ఏం రాస్తారో.. ఎందులో రాస్తారో.. నాకు మాత్రం ఈ ఫొటో పంపడానికి కొంత ఖర్చు అయ్యింది’ అంటూ విశ్వనాథ వారు ఆ ఫొటో వెనుక రాసి పంపారు. ఆ జాబుకు సదాశివ గారు చాలా సౌమ్యంగా రాసిన ఉత్తరం, ఆ తదుపరి విశ్వనాథ గురించి రాసిన వ్యాసం చదివి ఇలా ఏమి అనుకోకండి’ అని… పైగా Dear Friend అని సంబోధిస్తూ రాసిన ప్రత్యుత్తరం అది. విశ్వనాథగారు రాసిన ‘ఆ ఏమి అనుకోకండి’ అంటూ రాసిన ఉత్తరం వెనుక ఉన్నది సదాశివ గారి ఎదుగుదలే కాదు… ఆయన వొదుగుదల కూడా. సామల సదాశివ గారిని యాది చేసుకోవడమంటే ఆనాటి తరాన్నే కాదు, అప్పటి అనుబంధాలను గుర్తు చేసుకోవడమే.
ముక్కామల చక్రధర్
99120 19929