జీవితంలో అలసిపోయి
నాలుగు గోడల మధ్య
గడియారంలా వేలాడుతూ
సమయాన్ని లెక్కించేవాళ్లకు
యంత్రాలు కాదు
ఇప్పుడు మనుషులు కావాలి!
మనసు పంచుకోడానికి
మాటలు వినడానికి
భారం దించుకోడానికి
తోడు కరువైన లోకంలో
ఇప్పుడు మనుషులు కావాలి!
ముఖాలు చూసుకోకుండా
మాటలు పట్టించుకోకుండా
కాలంతో పాటు పరుగులు తీసే
నేటి కాలపు మనుషులకు
కాస్త మనిషితనం గుర్తుచెయ్యాలి!
మనుషుల లోకంలో
మనుషులే మాయమైపోతున్న కాలం
కాస్త ఆగి చూడండి
మనుషులు దిక్కు లేకుండా
ఎలా కొట్టు మిట్టాడుతున్నారో!
ఎంత ఎత్తులకు చేరినా
ఎంత సంపాదించుకున్నా
మనుషుల్లేని బంధాలు
వస్తువులతో ఉంటాయా,
కాస్త భ్రమలు వీడి
మనుషులతో కలవండి
మనుషులను మనుషులుగా
కాస్త బతకనివ్వండి!
పుట్టి గిరిధర్
94949 62080