ప్రజల కోసమే పుట్టి, ప్రజల కోసమే బతికి, ప్రజల కోసమే మరణించినవారిని ప్రజలు మరిచిపోతారేమో కానీ, చరిత్రలో వారు సృష్టించుకున్న పేజీలు మాత్రం మరిచిపోలేవు. నిరంతరం వారి త్యాగా లను గుర్తుచేస్తూనే ఉంటాయి. వారు సృష్టించుకున్న చైతన్యదీప్తి ఈ సమాజాన్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అందుకే చరిత్ర ఈ మహనీయులను ప్రజల మనుషులుగా అభివర్ణిస్తుంది.ఆ విధంగా గుర్తించినవారిలో వట్టికోట ఆళ్వారుస్వామి ముందువరుసలో ఉంటారు.
‘విశ్రాంతి తెలియనివాడు-స్వసుఖం కోరనివాడు వారం వారం మారనివాడు-రంగులద్దుకోలేనివాడు’ అని వట్టికోట ఆళ్వారుస్వామిని కీర్తిస్తూ తన అద్భుతరచన ‘అగ్నిధార’ను వట్టికోటకు అంకితమిచ్చారు మహాకవి దాశరథి. అంతేకాదు, కేతవరపు రామకోటి శాస్త్రి తన ‘పీహెచ్డీ సిద్ధాంత’ గ్రంథాన్ని, దాశరథి రంగాచార్య తన ‘జనపదం’ నవలను అంకితమిచ్చారు.
తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తి, రాష్ట్ర సాధన కోసం సాగిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘వట్టికోట’ను ప్రశంసించారు. ఎందరో మహనీయుల ప్రశంసలందుకున్న వట్టికోట 1915 నవంబర్ 1న నల్గొండ జిల్లాలోని చెరువు మాదారం గ్రామంలోని నిరుపేద (సింహాద్రమ్మ- రామచంద్రాచార్య) దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కాంచనపల్లి సీతారామారావు అనే ఉపాధ్యాయునికి వండిపెడుతూ వట్టికోట తన చదువును కొనసాగించారు. ఆ తర్వాత గ్రంథాలయాలనే పవిత్ర ఆలయాలుగా భావించిన వట్టికోట నిరంతరం గ్రంథాలయాల్లోనే గ్రంథ పఠనం చేస్తూ సాహిత్య సౌరభాలను ఆఘ్రాణించారు. విజయవాడలో ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేసినప్పుడు అక్కడి సాహిత్యకారులతో పరిచయం ఏర్పరుచుకున్నారు.
ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన వట్టికోట 1936-37లో గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా, ఆ తర్వాత మీజాన్ పత్రికలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే ఆయనకు ఆంధ్ర మహాసభతో సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఆంధ్ర మహాసభ, నల్గొండ శాఖకు అధ్యక్షుడయ్యారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ కార్యకర్తగా, అభ్యుదయ రచయితల సం ఘం, తెలంగాణ రచయితల సంఘం సభ్యుడిగా నిరంతరం ప్రజల కోసమే జీవించారు.
ఇక నిజాం వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనడంతో ప్రభుత్వ ఆగ్రహానికి గురై జైలు పాలయ్యారు. జైలు లోపల గడిపిన రోజుల్లో అప్పటికే జైల్లో ఉన్న దాశరథితో సాన్నిహిత్యం ఏర్పడింది. జైలు గోడలపై బొగ్గుతో రాసిన దాశరథి కవితలను కంఠస్థం చేసేవారు. జైలు నుంచి విడుదలైన వట్టికోట సమాజ చైతన్యానికి విజ్ఞాన ప్రచారమే సాధనమని భావించారు. అందుకే సికింద్రాబాద్‌లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి పలువురు ప్రముఖుల గ్రంథాలను ప్రచురించారు. ఈ గ్రంథమాల సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘హైందవ ధర్మవీరులు’, ‘ప్రాథమిక స్వత్వములు’ గ్రంథాలతో సహా 35 గ్రంథాలను ప్రచురించింది. అంతేకాదు ఊరూరా తిరుగుతూ ఈ గ్రంథాలను తక్కువ ధరకే విక్రయించిన వట్టికోట సమాజంలో చైతన్యదీప్తిని ప్రజ్వరిల్లజేశారు. సాహిత్య ప్రచార సారథిగా మాత్రమే కాదు, ఆయన తొలితరం నవలా రచయిత, కథకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త కూడా. వట్టికోట కొంతకాలం ‘తెలుగు తల్లి’ అనే మాసపత్రికను నిర్వహించారు. ‘తెలంగాణ’ అనే వార్తాపత్రికను కూడా నడిపారు. ఆయన రాసిన ‘ప్రజల మనిషి’ 1938కి ముందు నిజాం పాలన కింద ఉన్న తెలంగాణ పరిస్థితులకు దర్పణం పడుతుంది. ‘జైలు లోపల’ అనే కథా సంపుటి తాను జైలులో స్వయంగా దర్శించిన ఖైదీల విభిన్న మనస్తత్వాలను విపులంగా విశదీకరిస్తుంది. ఇక ‘గంగు’ అసంపూర్ణ నవల 1940-45 మధ్య నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి అద్దం పడుతుంది. ‘రామప్ప రభస’ వ్యాసాలు సామాజిక సమస్యలను కండ్లెదుట వ్యంగ్యంగా నిలుపుతాయి. అంతేకాదు వట్టికోట ‘ధర్మరాజు’ అనే కలం పేరుతో కూడా కొన్ని రచనలు చేశారు.
తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి. 1961, ఫిబ్రవరి 5న దివంగతులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి ప్రభుత్వం 2014, నవంబర్ 1న ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అంతేకాదు, హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ గ్రంథాలయానికి వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం.
-బసవరాజు నరేందర్ రావు
98662 95779