పోలికలు స్థిరపడని రూపాలకు
ఆనవాళ్లిచ్చిన రూపకర్త.
పుటకనిచ్చిన బ్రహ్మ ఊహకూ
జన్మనిచ్చిన అమ్మలకూ మధ్య
సాకార సారూప్య వారథి.
స్వస్థతకు కేశ నిర్వహణే
మూల వైద్యమన్న చరకుడు
దుర్గమ కేశారణ్యంలో చిక్కువడిన
కర్మేంద్రియాల విధిని
సుగమం చేసిన రోగహారి.
ఆజానుబాహులకూ అరవింద నేత్రులకూ
మూర్తిమత్వ పూర్ణతనిచ్చిన కూర్పరి.
రథోత్సవాలకూ వాహన సేవలకూ
దివిటీలై కాలి
నాదస్వరాల రాగ వాహినిలో
ఊపిరులై ప్రవహించి
తగిలితేనే స్నానం చేసే ధర్మాల
మనోధర్మంలో మసిబారిన
మనిషితనం మంగలి.
పుట్టు వెంట్రుకల నుంచి సావుదినం దాకా
అవసరమై నిలబడి కత్తిలా కలబడి
ఒసుగు బిచ్చం కోరే
గడప అవతలి పంచె మంగలి.
తెర మీది శిరోజాల సౌరును
శిరసున ముద్రించే లాఘవం
వాడలకొద్దీ హీరోలకు జన్మనిచ్చి
జీరోగా మిగిలే జీవి.
వెర్రెత్తిన కుర్రకారు హుషారు ‘కీ’.
ఖండనాల ముండనాల దండనాయకుడు.
తెగేసి చెక్కగల శిల్పి
తెరువు తెలిసిన తెగువరి.
వంచిన తలలకు తలెత్తుకునే యోగాన్నిచ్చి
మాసిన జుట్టును మల్లె తోటగా విప్పార్చి
పగిలిన అద్దాల మీద
ముక్కలవుతున్న మురికి రవిబింబం.
సెలూన్ల సెగ ధగల్లో
బెలూన్లలా పేలి రాలిపోతూ
కార్పొ ‘రేటు’ కత్తెర దారిలో
దారు పట్టక తుప్పు పట్టిన
అతార మంగలి.
గొరుగుతున్నప్పుడు కులాన్ని అడగని
సమతా సౌందర్య దాత
కత్తి లాగే బతుకూ అరుగుతున్నప్పుడు
‘కల్ప’నీ కాలాన్నీ ప్రశ్నించని
వృత్తి వృత్తంలో జీవిత ఖైదీ
ఊడ్చేసిన వెంట్రుకల కుప్పలో
మూలుగుతున్న కులకశ్పి వేరు.
బుసకొట్టే నాగరికతల కాటుకి
కమిలిపోతున్న బతుకు కాటుక.
అంగడిలో అగ్వకౌలు ప్రాణి
వేణీ సంహార సమరంలో
వేళ్లు తెగుతున్న యోధుడు
(మంగలి రాములు స్మృతిలో..)
– వఝల శివకుమార్ 94418 83210