సైన్యాల మధ్య చెలరేగే బదులు
సామాన్యుల మీద విరుచుకుపడి
శవాల పంటకు నారు పోస్తుంది
నిరపరాదుల తలల మీదికెక్కి
నాట్యం చేస్తుంది కసిగా
రక్తదాహంతో రగిలే ఈ రాక్షసికి
అమాయక ప్రాణాలే అన్నపానీయాలు
రెండు పక్షాల మొండితనాన్ని సాకుగా చూపించి
నిస్సహాయతను నటిస్తుంది ఇది!
ఉండుండి గర్జిస్తూ
క్రూరత్వాన్ని కురిపిస్తూ
దుర్భరం చేస్తుంది బతుకుల్ని
అదుపు, అలుపు లేని ఇది
కదనకుతూహల రాగాన్ని ఆలపిస్తూ
ఎన్ని రోజులైనా నడక సాగిస్తుంది
భవనాలు కూలే శబ్దాలే
పక్కవాద్యాల ప్రతిధ్వనులు దీనికి!
కళ్లెం లేని ఓ గుర్రమా!
దౌడు ఆపడం మీద ధ్యాస పెట్టు
పచ్చని బతుకుల శోభలను
నీ గిట్టలతో నేలమట్టం చేయకు
ప్రజా సంక్షేమానికి సమాధి కట్టకు
ఎలనాగ