ఒకానొక చీకటి యుగంలో
పరిమళం కూడా బంధించబడిన రోజుల్లో
బానిస చీకట్ల ఛాయలు
నా నేలనింకా వీడని చీకటి మాయాజాలంలో
కలలు కూడా ఖైదీ అయిన కాలరుతువు
ఆధిపత్యపు చీకట్లు నా వనమంతా అల్లుకుని
అవమానాల అణిచివేతల కింద
నా తంగేడుపూల వనం చుట్టూ
అనేక వివక్షల ముళ్లకంచెలు మొలిచిన సమయం
కాలం ఒక కొత్త చరిత్రను లిఖించింది
ప్రకృతి నా తంగేడు వనానికి ఓ కొత్త భాషను నేర్పింది
నా నేల ఒక కొత్త పాఠాన్ని బోనంలా నెత్తికెత్తుకుంది
దేశం పొద్దుపూల వైపు చూసింది
ఉద్యమ చైతన్య ఝరీ ప్రవాహంలో
తంగేడుపూలన్ని యుద్ధ నావలయ్యాయి
సునామీలా ఎగసిపడ్డ ఉద్యమ సముద్రం
ఉద్యమ గుబాళింపులో
అణిచివేతల అహంకారపు రక్త చరిత్రల సాక్షిగా
అనేక పూలు రక్తంతో తడిసి రాలిపడ్డా
దండలోని దారం నా తెలంగాణ ఆకృతిగానే రూపుదిద్దుకుంది
నా అస్తిత్వం తంగేడుపూల పరిమళమై
నా స్వేచ్ఛా పిపాస, పోరాట పటిమ
ప్రపంచం తలెత్తిచూసేలా చేసింది
ఆధిపత్యం పిల్లిలా తోకముడిచింది
సరిగ్గా దశాబ్దం క్రితం..స్వేచ్ఛ రెక్కలు తొడుక్కుని
సుపరిపాలన సుగంధాలు పులుముకుని
ప్రజల బతుకులకు బతుకమ్మల కొలువై నిలబడింది
పాలపిట్ట ప్రశాంత గీతాలు పాడుతూ
ప్రకృతిని పులకింపజేస్తోంది
ఒకానొక దీర్ఘకాల యుద్ధం గెలిచిన తరువాత
నేలంతా విజయోత్సాహంతో
పచ్చపూల పరిమళమై పరిఢవిల్లుతోంది
నా ప్రాంతమిప్పుడు ఒక రాష్ట్రం కాదు
ఒక తంగేడుపూల దేశం
ఒక దేశం జెండాకున్నంత పొగరుని
తలకెత్తుకున్న ఆత్మగౌరవ అస్తిత్వ సందేశం
– చిత్తలూరి 91338 32246