ఏ అస్తిత్వమైనా వస్తుగతంగా ఆద్యంత రహితమైనది. ఈ మాట సృష్టిలోని చరచరాలన్నింటికి వర్తిస్తుంది. అందుకు 360 కోణాలు, భూత-వర్తమాన-భవిష్యత్ కాలాలన్నీ ఉంటాయి. వీటిలో ఏ ఒక్క అంశానికి, ఏ కారణంగా, ఎపుడు, ఏ హానిని అనుమానించినా అస్తిత్వ అంతర్లోకం అణుశక్తి వలె విస్ఫోటనమవుతుంది. తెలంగాణకు సంబంధించి అటువంటి కారకాలు తిరిగి చీకట్లలో దోబూచులాడుతున్నాయన్నది ఇక్కడి ఆలోచనాపరులకు కలుగుతున్న అనుమానం.
ఈ అనుమానాలు కొంతకాలం క్రితం మొదలై ఇటీవల క్రమంగా వ్యాపిస్తున్న స్థితి నుంచి ఏర్పడిందే ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’. అనేక మేథోమథనాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘వేదిక’ తొలి ప్రచురణ ‘తెలంగాణ అస్తిత్వం’. వేదిక లక్ష్యమేమిటన్నది ఆ సంస్థ పేరులోనే ముంజేతి కంకణం వలె కనిపిస్తుండగా, ‘ఏర్పాటు ఎందుకు?’ అనే సుదీర్ఘ వివరణ ప్రచురణకర్తల మాట రూపంలో ఈ పుస్తకంలో ఉంది. దానితోపాటు, అస్తిత్వ వేదిక ‘అవగాహనా పత్రా’న్ని కూడా చేర్చారు. వేర్వేరు రచయితల పదకొండు వ్యాసాలను చదివే ముందు ఈ రెండు భాగాలను పరిశీలించినట్లయితే, ఏ హానికరమైన పరిస్థితుల కారణంగా ఈ వేదికను ఏర్పాటు చేయవలసి వచ్చిందో, ఆ పరిస్థితులను నిలువరించేందుకు తెలంగాణ సమాజం చేయవలసింది ఏమిటో, ఆ దిశలో ఈ వేదిక కార్యాచరణ ఏ విధంగా ఉండనున్నదో అర్థమవుతుంది.
రెండు మాటలలో చెప్పాలంటే,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందునాటి మాటలు తెలంగాణేతర శక్తుల నుంచి వినరావటం మళ్లీ మొదలైంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన చేతలు కూడా వారితో పాటు, ఇక్కడి వర్గాలు కొన్ని వారితో షరీక్ కావటం ద్వారా కనిపిస్తున్నాయి.
ఆ విధంగా, ఈ ప్రాంతానికి స్వరాష్ట్రం ఏర్పాటుతో రాజకీయ అస్తిత్వమైతే ఏర్పడింది గాని, మౌలికమైన సర్వతోముఖ అస్తిత్వానికి గల ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. అనగా వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా ముగియలేదు. అందువల్ల, ఉద్యమకాలం నాటి చైతన్యాన్ని తిరిగి ఆవాహన చేసుకుంటూ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కోణం లోంచి తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవటం, ఈ సమాజపు ఐక్యతను, సమభావనను, సహజీవన సంస్కృతిని ముందుకు తీసుకుపోవటం అవసరం. ఈ విలువలను యువతరానికి అందిస్తూ, ఇతరత్రా రాజకీయ లక్ష్యాలంటూ లేనివిధంగా సంస్థ పనిచేస్తుందని మొదట ప్రకటించారు.
అదిగాక, ఇదే దృక్పథానికి పొడిగింపుగా ‘అవగాహనా పత్రం’లో, తెలంగాణకు జైన, బౌద్ధ, వీరశైవ సంప్రదాయాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మిక, తాత్విక పునాదులను మొదట ఒక భూమికగా పేర్కొన్నారు. సమానత్వం, అహింస, కులవివక్షపై వ్యతిరేకత, అణచివేత పట్ల ధిక్కారం అందులో భాగమంటూ, వర్తమాన వివక్షలు, విధ్వంసాలను, మత విద్వేషాలను, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేయటం అస్తిత్వ వేదిక ఆశయాలని వివరించారు.
వ్యాసాలన్నీ కూడా ఈ విస్తారమైన చిత్రంలో భాగంగా ఇమిడి ఉన్నవే. వాటిని స్థూలంగా వర్గీకరించాలంటే, తెలంగాణ అస్తిత్వానికి గల ప్రాచీనతను, దాని లక్షణాలను మొదట సుదీర్ఘంగా వివరించి చెప్పటం అస్తిత్వ భావనకు పునాది వంటిది. ఆ విధంగా చారిత్రమైన చిత్రీకరణను పరిశోధనాత్మకంగా చేసినవారు ఈమని శివనాగిరెడ్డి, రామోజు హరగోపాల్, మామిడి హరికృష్ణ. ఆ చారిత్రమైన స్థితికి ఆలంబనలు అనదగ్గ భాషా సాహిత్యాలను, వాటి పరిణామ క్రమాలను, ఉద్యమంలో భాగంగా అవి పరిఢవిల్లిన తీరును అంతే పరిశోధనాత్మకంగా తమ వ్యాసాలలో రచించినవారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నలిమెల భాస్కర్, సంగిశెట్టి శ్రీనివాస్, శ్రీధర్ దేశ్ పాండేలు. అస్తిత్వ వర్తమానానికి వచ్చి, ఆ సవాళ్లు ఏమిటి, వాటిని ఎదుర్కొంటూ అస్తిత్వ నిర్మాణం ఏ విధంగా జరగాలన్న మార్గనిర్దేశనం కె.శ్రీనివాస్, పిట్టల రవీందర్ల వ్యాసాలలో కనిపిస్తుంది. జాతులు, జాతి నిర్మాణాలు అనే సైద్ధాంతికతలను, ఈ ప్రాంత ప్రత్యేకతలను 1969 నాటి ఉద్యమ పరిస్థితులకు అన్వయిస్తూ, ఆ కాలంలో ఇక్కడ స్వయంగా పర్యటించిన జర్మన్ విద్యావేత్త దాగ్మార్ బెర్న్స్టార్ఫ్ వ్యాసాన్ని కూడా మన అవగాహనను పెంచేందుకు ఈ సంకలనంలో చేర్చారు.
‘తెలంగాణ అస్తిత్వం’ అనే భావన ఎంత లోతైనదో, విస్తారమైనదో, ఈ వేదిక ఏర్పాటు అయిన వర్తమాన పరిస్థితులు ఎంత కీలకమైనవో, సంస్థ లక్ష్యాలు ఎంత మౌలికమైన, దీర్ఘకాలికమైన దృష్టితో రూపొందుతున్నాయో, ఈ ప్రచురణ కూడా ఆసాంతం అంత విలువైనదని చెప్పవలసి ఉంటుంది.
-టంకశాల అశోక్