తెల్లారక ముందే
ఆ గల్లీ అంతా తెలికత్తది…
ఐదారిండ్ల సెత్తంతా
ఆల్ల కోసం ఎదిరిసూత్తది…
సిన్న పిల్ల లెవ్వకున్న
సిన్నగ ఒక సూపు జూసి
సీకటి తొవ్వ వట్టి
సిట్ట సిట్ట నడకతోటి
సిన్న పాటాకు ముంగట
పెద్ద పనికి తయ్యార్…
సీపిరితోటి సోపతి
ఊపిరి సల్పని ఆపతి
షురువైందంటే ఆమె ఓ మిషినే…
పెంట తీర్గున్న అరుగులు అర్రలను
ఊడ్సి సల్లీ తుడిసి
ముద్దుగ అద్దమోలే మెరిపిత్తది…
అండిన బగోన్లు గిన్నెలు గిలాసలు
తిన్న పల్లెములు కంచుడు
గంటెలు సరాతములు…
సక్కగ సబ్బువెట్టి
సర్రాసుగ తోమేత్తది…
తంతెలు కడుగాలంటరు
వంకలు ఎన్నో పెడుతరు
అద్దగంట ఆలిసెమైతే
అదో పెద్ద రామాయణం…
కుస కుసున్నా కూలవడ్డా
కుండపోత వాన కురిసినా
అమాస లేదు అయితారం లేదు
పండుగు లేదు పబ్బం లేదు
తాతిల్లే లేవంటరు
తప్పక పనిజెయ్యాలే…
ఇంటెడు పనంతా
ఒంటి సేత్తోటి సేత్తది
గంపెడు బోల్లున్నా గాని
సొంపుగ తోమిచ్చుడే…
కాళ్లల్ల సెక్రాలు పెట్టుక
ఇండ్ల నడుమ ఉర్కుడే…
పనివడి పైసలడుగుతే
ఆసాములే ఐదు
సొప్పున అడ్డీకిత్తరు…
ఆకిర్కి అడ్డీ పేరు జెప్పి
ఇచ్చేదంతా కత్రిత్తరు…
ఆడ ఈడ సెమటడిపి
నెల కాంగనే
కొత్తలు కొంగుకు ముడేసి
కొంటవోతే
మోర్దోపు మొగడేమో
కల్లుకే సగం
కలాస్ జేత్తడు…
అమ్మా… పనికచ్చే తల్లులూ..!
సదువు లేకనే మీకు ఇన్ని తిప్పలు
అద్దనంగ అయితున్నయి
అప్పుల కుప్పలు…
ఇగనైనా కండ్లుతెరిసి
మీ పిల్లలను సదిపియ్యుండ్రి
గాల్లకు అప్పులు సూపుడు గాదు
నాలుగిండ్లు అప్పజెప్పుడు గాదు
నల్గురు శెభాష్ అనేటట్టు
సగవెట్టాలె… సదిపియ్యాలె..
– అల్లాడి శ్రీనివాస్ 83416 63982