గొంతెత్తితే గోరింటలు గొంతు కలుపుతయి
కట్లెపూలు కోలాటమాడుతయి
బొడ్డు మల్లెలు బోనమెత్తుకుంటయి
రుద్రాక్షలు నిద్రాణమైన వీణను
వీపు తట్టి లేపుతయి.
జాజులు జతుల గతులను నేర్చి
పొత్తిలిలోని మెత్తటి మాటల
పసి పెదవుల మీద పండు
వెన్నెల పూయిస్తయి
పాలకంకులకు పూవు పిందెలకు
పుప్పొడి ఉగ్గును తినిపిస్తయి
నుడులకు అడుగులు మొలిసి
నూతన లోకానికి తీసుకపోతయి..
ఆ మేని తీగ
ఎదల పొదలను అల్లుకుంటది
తలలో నాలుక అయితది
తలెలో మెతుకు అయితది
తల్లడం మల్లడం అయ్యే గుండెను
తావుకు తెస్తది
ఆ కాళ్ళు గెగ్గెర బొంగరాల్లాగా
ఊరంతా తిరిగినా
ఉనికిలోనే ఉంటయి
ఏటి గట్టు మీదుంటయి
నీటి అలల నరాల తీగలను మీటుతయి
మాటల ఊటలో దాగి
చుక్కల చూపులకు రెక్కలు కడుతయి.
చూపులను తూపులను చేస్తయి
చెట్టు తొర్రలోని తొడిదిలాగా
ఒర్రెలోని చెలిమెలాగా
జలలోనే ఉంటయి
జ్వలనాన్నే కలగంటయి.
-కందుకూరి అంజయ్య
94902 22201