ఆ మాట వినగానే
వడివడిగా ఉరకలేశాయి అడుగులు,
దారి చీకటైనా,
అదే నడిచిన పాత వీధిలా;
చెప్పుల్లేని పాదాల కింద
కంకర నేల
మెత్తని పచ్చిక మైదానమైంది;
వేడి ఇసుక తుఫాను
చల్లని పిల్లగాలిగా తాకింది.
గుక్కెడు నీళ్లు దొరకని పొడిగొంతు,
చుక్క నీటి కోసం దాహపడలేదు;
బుక్కెడు బువ్వ దూరమైన పొట్ట,
ఆకలిని మరిచిపోయింది.
కంటికి కునుకురాని ఎన్నో రాత్రులు
ఇప్పుడు నిద్ర తలుపు తట్టినా
మనసు అడ్డేసింది.
అన్నిటి నుంచి, అందరి నుంచి దూరమై,
శత్రువుల బంధనంలో,
పగలో రాత్రో తెలియని
నాలుగుగోడల మధ్య,
దేశమో విదేశమో
తెలియని ప్రదేశంలో
ముళ్ల కంచె, ఇనుప బూట్ల
పహారాల నడుమ,
చిత్రహింసలతో కొట్టుమిట్టాడుతూ,
మమతానురాగాలకు దూరమై,
చిక్కిశల్యమైన ఆ జీవితం
అక్కడే ముగిసిపోతుందనుకున్న క్షణంలో
యు ఆర్ ఫ్రీ నౌ
అన్న ఒకే ఒక్క మాట
మసకబారిన మనసులో
వసంతం చిగురించి
ఆవిరైన ఆశలన్నీ ఒక్కసారిగా
రంగులమయమై పులకరించినప్పుడు
దొరికిన పిడికెడు స్వేచ్ఛ
రెక్కలు విప్పుకొని
తనవాళ్లను వెతుక్కుంటూ
విహంగమై విహరిస్తుంటే
శరీరం ఇంకే సుఖాన్ని కోరుకుంటుంది?
– వేణు నక్షత్రం +1(703)861-8368