మాకూ మీకున్నట్టి కొలతలే ఉంటవి
కాకపోతే ఆ అవయవాల్లో మీకున్నట్టు
నిగనిగలు ఉండవు
అంతా వట్టిపోయిన వక్కిపోయిన
పండ్లూ, కూరగాయల మాదిరిగా
ఉంటవి మా దేహాలు
అంగాలను కొలిచి అందాన్ని తూచి
అవార్డులిస్తూ ఆర్భాటాన్ని ప్రదర్శించే నేతలారా
ఆకలికి అలమటించే సూచికలతో
మీరు ర్యాంప్ వాక్ చేపించగలరా?
మాకూ ఓ అవకాశం ఇవ్వరూ
ఈ దేశపు ఆకలి ఉలి మలిచిన
మా దేహాలను ఈ దేశపు
జెండాగా ప్రదర్శిస్తాం
బాధలను చెప్పుకొందామని
వచ్చేటోళ్లకు బారికేడ్లు అడ్డు
అందాలను పంచేటోళ్లకు,
అందినకాడికి దోసుకునేటోళ్లకు
అడుగడుగునా హారతులు..
ప్రజాస్వామ్యమా… సిగ్గుపడు
అధికారం అభాగ్యుల మీదికెక్కి స్వారీ చేస్తుంది
అంగార్థిక బలాలున్నోళ్లను
దాని వీపున మోస్తుంది
(విశ్వసుందరి పోటీలకు
చేస్తున్న ఆర్భాటాన్ని నిరసిస్తూ..)
– దిలీప్.వి 84640 30808