అచ్చరాలను రుబ్బి
గుండె గుమ్ములకు మెత్తడానికి
ఊసుల అత్తరు పూసుకున్నరు..
పొలాల్లో పరిగేరి సంచుల్లో నింపినట్టు
పొత్తంల బతుకుల్ని వోసి
సినిగిన పల్లె పాణాలకు సిరా దబ్బనంతో కుట్లేసిండ్రు
ఏటికేడు దగా పడే సెమట నాగళ్ల లెక్క
దుఃఖాన్ని కండ్లల్లో ఒడిసిపట్టి
నిత్యం పరిగెత్తే నదులవుతున్నరు
సిన్నప్పుడు సుట్టాలచ్చి వోతంటే చేతిల పైసలు వెట్టినట్టు
లోకం ముచ్చట్లు దోసిట్ల నింపివోతరు..
వాళ్లను సూత్తాంటే
దస్రకు అలైబలై తీసుకున్నంత సంబురమైతది..
పాలపిట్టను ముద్దువెట్టుకున్నంత బరాబరైతది..!
పడమటింటి ,రవికుమార్
99483 93391